ఆ నలుగురు

ఆ నలుగురు - Sakshi


♦ మూడు వివాదాలు... ఆరు సెటిల్‌మెంట్లు

♦ కమిషనరేట్‌ పరిధిలో వారిదే ఇష్టారాజ్యం

♦ నగరాన్ని గుప్పెట్లో పెట్టుకుని వసూళ్లు

♦ కీలక కేసుల్లో తప్పుదారి

♦ టీడీపీ ముఖ్య నేత అండతో రెచ్చిపోతున్న ఖాకీలు




సాక్షి, అమరావతి బ్యూరో :  విజయవాడ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో నలుగురు అధికారుల తీరు  వివాదాస్పదంగా మారుతోంది. ఇద్దరు మధ్యస్థాయి అధికారులు, మరో ఇద్దరు స్టేషన్‌స్థాయి అధికారులు. ఈ నలుగురూ జిల్లా కీలకనేత సిఫార్సుతో పోస్టింగు తెచ్చుకున్నవారే. ఆ ధీమాతోనే సివిల్‌ వివాదాలు, సెటిల్‌మెంట్లలో తలదూరుస్తున్నారన్న ఆరోపణలు  వెల్లువెత్తుతున్నాయి.



ఆయనంటేనే హడల్‌

ఆయన ఓ మధ్యశ్రేణి పోలీసు అధికారి. జిల్లాలో టీడీపీ కీలక నేతకు అత్యంత సన్నిహితుడు. వ్యాపార కార్యకలాపాలకు కీలకమైన పాతబస్తీ ప్రాంతం ఆయన పరిధిలోకి వస్తుంది. సివిల్‌ కేసులు సెటిల్‌మెంట్లు చేయడంలో నిత్యం నిమగ్నమై ఉంటారు.



పాతబస్తీకి చెందిన కొందరు వ్యాపారులు ఎన్నో ఏళ్ల క్రితం ఇబ్రహీంపట్నం వద్ద భూమి కొనుగోలు చేసి ప్లాట్లు వేసుకున్నారు. ఆ భూమి ప్రస్తుత విలువ దాదాపు రూ.2కోట్లు. కానీ, కొన్ని నెలల క్రితం టీడీపీ కీలక నేత ముఖ్య అనుచరులు ఆ ప్లాట్లను కలుపుతూ వెంచర్లు వేశారు. దీనిపై వ్యాపారులు అభ్యంతరం తెలిపినా, వారిపై టీడీపీ నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. దాంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీడీపీ నేతలకు అండగా ఈ పోలీసు అధికారి రంగంలోకి దిగారు. ఆ ప్లాట్ల విషయాన్ని వదిలేయాలకపోతే వ్యాపారాలు సక్రమంగా చేసుకోలేరని పరోక్షంగా హెచ్చరించినట్లు సమాచారం.  



దుర్గగుడిలో ఉద్యోగాలు ఇప్పిస్తామని కొందరు దళారులు భారీగా వసూళ్లకు పాల్పడ్డారు. ఇద్దరు బాధితులు ఫిర్యాదు చేయడంతో ఈ బాగోతం బయటపడింది. ఈ ఉద్యోగాల రాకెట్‌కు పాత్రధారులైన ఇద్దరు కిందిస్థాయి ఉద్యోగులను అరెస్టు కూడా చేశారు. కేసు విచారణలో మరో 10 నుంచి కూడా అలాగే లక్షల్లో వసూళ్లకు పాల్పడ్డారని నిర్ధారణ అయ్యింది. మరోవైపు దాదాపు 100మంది తాత్కాలిక ఉద్యోగుల నియామకంలోనూ అవినీతి చోటుచేసుకుందని ప్రాథమిక ఆధారాలు. ఇంకేముందీ ఈ కేసును, కీలక సూత్రధారి అయిన ఉన్నతాధికారిని కూడా అరెస్టు చేస్తారని భావించారు. అనూహ్యంగా ఈ కేసు దర్యాప్తు నెమ్మదించింది. ఎందుకంటే ఆ ఉన్నతాధికారి జిల్లా టీడీపీ కీలక నేతను ఆశ్రయించారు. ఆ నేత సూచనలతో రంగంలోకి దిగారు. డీల్‌ కుదరడంతో ఈ కేసును వ్యూహాత్మకంగా పక్కదారి పట్టించారు. అప్పటి నుంచి విచారణ తూతూమంత్రంగా సాగుతోంది.



ఈయన అంతకుమించి..

నగరంలో మరో మధ్యస్థాయి అధికారి తీరు ‘అంతకుమించి’ అన్న రీతిలో ఉంది. ఈయన కూడా జిల్లా కీలక నేత సిఫార్సుతోనే పోస్టింగు తెచ్చుకున్నారు. వైట్‌ కాలర్‌ నేరాలను అవకాశంగా చేసుకుని సెటిల్‌మెంట్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఉద్యోగాలు ఇప్పిస్తామని భారీగా వసూళ్లకు పాల్పడ్డారు. ఈ కేసు విచారణలో అధికారుల మధ్య ఆధిపత్యపోరు వెర్రితలలు వేసింది. ఏజెంట్లను గుర్తించి వారిపై కేసులు పెట్టమని బెదిరిస్తూ వసూళ్లకు పాల్పడ్డారు. అందులో ఈ అధికారి కీలకంగా వ్యవహరించారు. ఓ నిందితుడిని చిత్రహింసలకు గురిచేసి నిరుద్యోగుల నుంచి వసూలు చేసిన డబ్బు తమకు ఇవ్వాలని వేధించారు. దీనిపై బాధిత కుటుంబం న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. నగరంలో వైద్యులను బురిడీ కొట్టించిన హవాలా కేసు లో అసలు చక్రం తిప్పింది ఈయనేనని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఆ  కేసులో తలదూర్చిన మరో అధికారిపై ఇప్పటికే వేటు పడింది. ఈయనపై మాత్రం చర్యలు తీసుకోలేదు.



ఆ జోడీ.. అక్రమాల దాడి

నగరం నడిబొడ్డున ఉన్న కీలకమైన పోలీస్‌స్టేషన్‌ అధికారి. ఆయన కిందే పనిచేసే మరో అధికారి. బడాబాబులు ఉండే కీలక ప్రాంతంలో రెండేళ్లకుపైగా కొనసాగుతున్నారు. ఆ స్టేషన్‌ పరిధిలో ఎక్కువగా అపార్టుమెంట్ల నిర్మాణాలు సాగుతున్నాయి. బిల్డర్ల మధ్య వివాదాలను అవకాశంగా చేసుకుని సెటిల్‌మెంట్లకు పాల్పడుతున్నారని తెలుస్తోంది. వచ్చిన ఫిర్యాదులను కేసు నమోదు చేయకుండా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని స్టేషన్‌కు పిలిపించి బెదిరింపులకు గురిచేస్తారని పోలీసువర్గాలే చెబుతున్నాయి.



సాక్షులను కూడా ప్రభావితం చేసేలా బెదిరింపులకు పాల్పడుతున్నారనే ఆరోపణలు తీవ్రమయ్యాయి. ప్రధానంగా ఓ సామాజికవర్గానికి చెందిన వారిని ఆయన వేధిస్తున్నారనే ఆరోపణలు ఎక్కువ. ఈ విషయంపై డీజీపీ కార్యాలయానికి కూడా లెక్కకుమించి ఫిర్యాదులు వెళ్లడం గమనార్హం. ఈ ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయానికి పంపిస్తున్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top