డిప్యూటీ కలెక్టర్‌ ఉద్యోగం కాదని ఉద్యమంలోకి..

డిప్యూటీ కలెక్టర్‌ ఉద్యోగం కాదని ఉద్యమంలోకి.. - Sakshi


ముషీరాబాద్‌: యాధాటి కాశీపతి చదువు పూర్తి చేసిన తరువాత డిప్యూటీ కలెక్టర్‌గా ఉద్యోగం వచ్చింది. ఉద్యోగంలో చేరడానికి ముందు విజయవాడలో ఉన్న చండ్రపుల్లారెడ్డిని కలిసి వెల్దామని నాయకులు పేర్కొన్నారు. అన్నా.. నాకు డిప్యూటీ కలెక్టర్‌ ఉద్యోగం వచ్చిందని చెప్పగా మనకు కావాల్సింది కలెక్టర్‌ కాదు... కామ్రేడ్‌ అని  వారు చెప్పగా.. మరో మాట మాట్లాడకుండా వచ్చిన కారును పంపించి విప్లవ ఉద్యమానికి అంకితమయ్యారు కాశీపతి. ఆనంతపురానికి చెందిన కాశీపతి ఉస్మానియా యూనివర్సిటీలో  ఎంఏ(జర్నలిజం) చేశారు. అంతేకాక గోల్డ్‌ మెడల్‌ను కూడా సాధించారు.


తరిమెల నాగిరెడ్డి నాయకత్వంలో 1967 నుండి విప్లవ ఉద్యమంలో పని చేశారు. సీపీఐఎంఎల్‌ ఏర్పడక ముందు కో–ఆర్టినేషన్‌ కమిటీలో, చంద్రపుల్లారెడ్డి నాయకత్వంలో సీపీఐఎంఎల్‌లో చురుకైన పాత్ర పోషించారు. రామనర్సయ్య, జంపాల చంద్రశేఖర్‌ ప్రసాద్‌లు బూటకపు ఎన్‌కౌంటర్‌లో పోలీసులు చంపినప్పుడు ఆయన ‘ఉయ్యాలో...జంపాలో’ అనే పాట రాసి తనలో గొప్ప కవి కూడా ఉన్నాడని నిరూపించారు. అంతే కాకుండా పీడీఎస్‌యూ సంస్థ గీతం ‘ బిగించిన పడికిలి –పీడీఎస్‌యూ చిహ్నం’ పాటను కూడా రాశారు. 1972లో గుంటూరులో జరిగిన విరసం మహాసభల్లో  కార్యవర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు.


భారత చైనా మిత్ర మండలి, ఎపీసీఎల్‌సీ వ్యవస్థాపకుల్లో కాశీపతి ఒకరు. వేలాది మందికి పండు ఒలిచిపెట్టినట్లుగా రాజకీయ అర్థశాస్త్రాన్ని బోధించడంలో ఆయనకు ఆయనే సాటి. చండ్రపుల్లారెడ్డి, తరిమెల నాగిరెడ్డి, రామనర్సయ్య తదితర ఎంతో మంది విప్లవ కారులతో పని చేసిన అనుభవం అయనది. ఎమర్జెన్సీ సమయంలో  21 నెలల పాటు ముషీరాబాద్‌లో జైలు జీవితం గడిపారు. జైల్లో ఈయనతో పాటు ఉన్న వరవరరావు, ఇతర ముఖ్యనేతలేందరికో రాజకీయ తరగతులను బోధించారు.  సీపీఐఎంఎల్‌ పార్టీ తరపున సిరిసిల్లా నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. శ్రీశ్రీకి అత్యంత ఆప్తుడు.


శ్రీశ్రీ కవిత్వం ఎప్పుడూ కాశీపతి పెదాలపై ఆడుతూ ఉండేది. శ్రీశ్రీ  చలసాని తరువాత చెప్పే పేరు కాశీపతి. తెలుగు సమాజానికి ఎంతో మంది జాతీయ అంతర్జాతీయ విప్లవ బుద్ధి జీవులను పరిచయం చేసిన వ్యక్తి కాశీపతి. 1978లో శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో అక్కడే పాటలు పాడే ఓ గిరిజన యువతిని పెళ్లి చేసుకొని ఆదర్శంగా నిలిచారు. ఆరోగ్యం క్షిణించిన తరువాత పార్కిన్స్‌సన్‌ వ్యాధితో బాధపడుతూనే ‘ మధ్యతరగతి మందుహాసం’ అనే పుస్తకాన్ని శ్రీశ్రీ సాహిత్యంపై విమర్శనాత్మకంగా రాయడం అయనేకే చెందింది. పార్టీ పత్రిక ‘విమోచన’కువర్కింగ్‌ ఎడిటర్‌గా 1977 నుంచి 1979 వరకు పని చేశారు.


విప్లవ ఉద్యమం 1980 దశకంలో విప్లవ నాయకుడు సత్యనారాయణ సింగ్‌ ఉపాన్యాసం, దానిని తెలుగులో తర్జుమా చేసే కాశీపతి మాట, అరుణోదయ రామారావు పాటలు,  సభలుసమావేశాల్లో ఉర్రూతలూగించాయి. పెదవుల మధ్య సిగరెట్‌ పెట్టుకొని ఆయన మాట్లాడుతూ ఉంటే లయబద్దంగా కదిలే సిగరెట్, తూటాల్లాంటి మాటలు అప్పటి పాతతరం విప్లవాభిమానులకు నేటికీ గుర్తుంటాయి. తరువాత కాలంలో ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌లో, ఆంధ్రప్రభ, వార్తలలో 20 సంవత్సరాల పాటు జర్నలిస్టుగా పనిచేశారు.  కలర్‌ చిప్స్‌లో కొంత కాలం పని చేశారు. ఆనంతరం అనారోగ్యానికి గురై తుది శ్వాస విడిచారు.


ప్రముఖ కవి గజ్జెల మల్లారెడ్డి రాసినట్లు కాశీపతి  కూసేపతి అన్నాడంటే ఆయన ఉపన్యాసం, వాగ్దాటి ఎంత గంభీరంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అందుకే కూత నేర్పినవాడు, రాత నేర్పిన వాడు సీతాకోకచిలుకలాంటి వాడు, వేలాది మందిని కదిలించినవాడు కాశీపతి అంటూ అరుణోదయ కళాకారులు ఆయనకు కితాబునిచ్చారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top