ప్రత్యేక హోదాకోసం ‘ఆప్’ పోరాటం

ప్రత్యేక హోదాకోసం ‘ఆప్’ పోరాటం - Sakshi


13 జిల్లాల ప్రతినిధుల సమావేశంలో నిర్ణయం



విజయవాడ (చిట్టినగర్) : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం, కేజీ బేసిన్ గ్యాస్ దోపిడీపై ఉద్యమాలకు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) శ్రీకారం చుట్టనుందని, ఈ నిరసన కార్యక్రమాలకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వచ్చే అవకాశం ఉందని  ఆ పార్టీ రాష్ర్ట కో-కన్వీనర్ పోతిన వెంకట రామారావు చెప్పారు. ఆప్ 13 జిల్లాల ప్రతినిధుల సమావేశం ఆదివారం విజయవాడ చిట్టినగర్‌లోని శ్రీ నగరాల సీతారామస్వామి కల్యాణమండపంలో నిర్వహించారు.  పార్టీ భవిష్యత్ కార్యాచరణ,  నాయకులు, కార్యకర్తలు ప్రజలకు ఏ విధంగా చేరువ కావాలనేదానిపై చర్చించారు.  అనంతరం పార్టీ పలు తీర్మానాలను ప్రవేశపెట్టింది. 



కేజీ బేసిన్‌లో గ్యాస్ దోపిడీకి పాల్పడుతున్న కంపెనీలకు కేంద్రం కొమ్ము కాస్తున్న తీరుపై పోరాటం చేయాలని నిర్ణయించింది. విజయవాడ కేంద్రంగా చేపట్టే నిరసనలకు  ఢిల్లీ సీఎం  కేజ్రీవాల్ వస్తారని పేర్కొన్నారు. రాష్ర్ట విభజన తర్వాత ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తామని ఇచ్చిన హామీలను నెరవేర్చేలా  కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయిం చింది.  





యువతకు ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు ఆప్ దృష్టి సారిస్తుందన్నారు.  భూసేకరణ,  నిరుద్యోగ సమస్య, ధరల నియంత్రణ అంశాలలో కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల వైఫల్యంపై 13 జిల్లాల యాత్ర నిర్వహించాలని తీర్మానించింది.  నవ్యాంధ్రలో పోలీసులకు పనిభారం పెరిగిందని, సిబ్బంది పెంపుతో పాటు వారికి వేతనాలను పెంచాల్సిన అవసరం ఉందని ఆప్ గుర్తించిందన్నారు.  సమావేశంలో పార్టీ నాయకులు  హర్‌మహేందర్ సింగ్ సహాని,  విజయవాడ నగర కన్వీనర్ కొప్పోలు విజయ్‌కుమార్,  జిల్లా కన్వీనర్ కె.వి.ఎ.కోటేశ్వరరావు  పాల్గొన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top