పింఛన్‌ కోసం వచ్చి హత్యకు గురై..

పింఛన్‌ కోసం వచ్చి హత్యకు గురై.. - Sakshi


దేవనగర్‌ లెప్రసీ క్యాంపునకు చెందిన వ్యక్తి దారుణ హత్య



డిచ్‌పల్లి(నిజామాబాద్‌ రూరల్‌) : రెండు నెలల పింఛను డబ్బులు తీసుకువెళదామని ఆశతో ఎక్కడో హర్యానా నుంచి డిచ్‌పల్లికి వచ్చాడు. తన పింఛను డబ్బులతో పాటు భార్య పింఛను డబ్బులు తీసుకున్నాడు. తోటి వారికి హర్యానా తిరిగి వెళుతున్నానని చెప్పి బయలుదేరాడు. తెల్లారేసరికి దారుణహత్యకు గురైన ఘటన డిచ్‌పల్లి మండలం లెప్రసీ క్యాంపులో జరిగింది. ఎస్సై కట్టా నరేందర్‌రెడ్డి తెలిపిన కథనం ప్రకారం.. మండలంలోని అమృతాపూర్‌ పంచాయతీ పరిధిలోని దేవనగర్‌ లెప్రసీ క్యాంపునకు చెందిన పర్శ రాములు(42), భార్య అక్కమ్మతో కలిసి కొద్దిరోజులుగా హర్యానాలో నివసిస్తున్నాడు. లెప్రసీ రోగులైన వీరు భిక్షాటన చేసి జీవిస్తుంటారు. భార్యాభర్తలకు వికలాంగుల కోటాలో ప్రభుత్వం ద్వారా నెలకు రూ. 1500 చొప్పున పింఛను వస్తోంది. పెద్దనోట్ల రద్దు తర్వాత నగదు కొరత కారణంగా రెండు నెలలుగా పింఛను డబ్బులు రాలేదు. నాలుగైదు రోజులుగా పింఛను డబ్బులు పంపిణీ చేస్తున్నారు. పింఛను డబ్బులు ఇస్తున్నారని తెలిసి డబ్బులు తీసుకువెళ్లడానికి రాములు మూడు రోజుల క్రితం దేవనగర్‌కు చేరుకున్నాడు. మంగళవారం తనతో పాటు భార్య పింఛను డబ్బులు తీసుకున్నాడు.



క్యాంపునకు చెందిన తోటి వారితో తిరిగి హర్యానా వెళుతున్నట్లు చెప్పి సాయంత్రం బయలు దేరాడు. బుధవారం ఉదయం నడిపల్లి పంచాయతీ పరిధిలోని ఎఫ్‌సీఐ గోదాముల వెనకాల రైల్వే ట్రాక్‌ సమీపంలో రాములు మృతదేహమై కనిపించాడు. స్థానికులు మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సీఐ తిరుపతి, ఎస్సై నరేందర్‌రెడ్డిలు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి ఒంటిపై కన్పిస్తున్న గాయాలను బట్టి దుండగులు కర్రలతో కొట్టి హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతుడి ఒంటిపై దుస్తులను తొలగించి పక్కనే కాల్చి వేశారు.



ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఏసీపీ

హత్య జరిగిన విషయం తెలిసిన నిజామాబాద్‌ ఏసీపీ ఆనంద్‌కుమార్‌ ఘటనా స్థలానికి చేరుకుని సీఐ, ఎస్సైలతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఘటనా స్థలంలో పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. మృతుడి వద్ద ఉన్న డబ్బుల కోసం హత్య జరిగిందా.. లేక ఇంకేదైనా కారణం ఉందా.. అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ తెలిపారు. మృతుడికి భార్యతో పాటు కొడుకు, కూతురు ఉన్నారు. వారు ప్రస్తుతం హైదరాబాద్‌లోని అనాథ ఆశ్రమంలో ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. నడిపల్లి వీఆర్వో దేవిదాస్‌రావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top