ఎస్‌ఐ దేహదారుఢ్య పరీక్షలు ప్రారంభం

ఎస్‌ఐ దేహదారుఢ్య పరీక్షలు ప్రారంభం - Sakshi


మూడుగంటలు ఆలస్యమైన ఈవెంట్

మొదటిరోజు మొరాయించిన ఆన్‌లైన్ వ్యవస్థ

సర్టిఫికెట్ల పరిశీలనకు గంటలకొద్దీ అభ్యర్థుల నిరీక్షణ

స్వయంగా పర్యవేక్షించిన ఎస్పీ రెమారాజేశ్వరి

 


 

మహబూబ్‌నగర్ క్రైం: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఎస్‌ఐ అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలు సోమవారం జిల్లాకేంద్రంలోని క్రీడామైదానంలో ప్రారంభమయ్యాయి. అభ్యర్థులు తెల్లవారుజాము 4గంటల నుంచే భారీ    సంఖ్యలో తరలి వచ్చారు. ఉదయం 6గంటలకు ప్రారంభించాల్సిన ఈవెంట్స్ ఆన్‌లైన్ వ్యవస్థ మొరాయించడంతో 9 గంటలకు ప్రారంభమైంది. పరీక్షలను ఎస్పీ రెమా రాజేశ్వరి స్వయంగా పర్యవేక్షించారు. 80బ్యాచ్‌ల చొప్పున 480మందికి దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించారు. ఒక్కోబ్యాచ్‌లో ఆరుగురికి అనుమతి ఇచ్చారు. ప్రతి అభ్యర్థి సర్టిఫికెట్లను ఆన్‌లైన్‌లో పరిశీలించిన తరువాత ప్రత్యేక నంబర్ ఇచ్చి చాతి, ఎత్తు కొలిచారు. ఈ సమయంలో ఆన్‌లైన్ వ్యవస్థ పనిచేయకపోవడంతో వందలాది మంది అభ్యర్థులు తమ పేర్లను నమోదు చేసుకునేందుకు పడిగాపులు కాశారు.



పోలీసులకు ఆన్‌లైన్ సవాల్!

పూర్తిగా ఆన్‌లైన్ చేయడంతో పోలీసులకు కొంత ఇబ్బందిగా మారింది. సర్టిఫికెట్లను పరిశీలించేందుకు చాలా సమయం పడుతోంది. ఈ క్రమంలో రోజుకు 1200మంది అభ్యర్థులకు పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా కేవలం 400నుంచి 500 మంది వరకు కూడా చేరుకోవడం లేదు. నిర్ధేశించిన లక్ష్యంలో కనీసం సగం కూడా చేరుకోకపోవడంతో గడువులోగా పూర్తయ్యేనా అనే విమర్శలు వినిపిస్తున్నాయి. జూలై 1వ తేదీ వరకు ఎస్‌ఐ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు పూర్తిచేయాలని ఆదేశాలు ఉన్నా.. ఇదే పద్ధతి కొనసాగితే మరోవారం రోజులు పాటు గడువు పొడగించాల్సి ఉంటుందని స్పష్టమవుతోంది.

 

తొలిరోజు వరుణుడి ఎఫెక్ట్

ఎస్‌ఐ అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలకు వరుణుడు అడ్డంకిగా మారే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే కురిసిన వర్షాలకు మైదానం పూర్తిగా తడిసిపోయింది. దీంతో అభ్యర్థులు 800 మీటర్ల పరుగు పందెంలో కొంత ఇబ్బందిపడ్డారు. మంగళవారం జరిగే సెలక్షన్స్‌కు వర్షం అడ్డం కిగా మారితే కేవలం అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించి దేహదారుఢ్య పరీక్షల కోసం మరో తేదీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.

 

ప్రత్యేక ఏర్పాట్లు  

దేహదారుఢ్య పరీక్షల సందర్భంగా అభ్యర్థులు అస్వస్థతకు గురైతే ప్రాథమిక చికిత్స అందించేందుకు వైద్యులు, అంబులెన్స్, నర్సులను మైదానంలోనే అందుబాటులో ఉంచారు. కొంతమంది అభ్యర్థులు 800మీటర్ల పరుగు పోటీలో కొంత ఇబ్బంది పడ్డారు. జిల్లా పోలీస్‌శాఖ నుంచి వెయ్యిమంది సిబ్బంది ఈవెంట్స్ సందర్భంగా విధులు నిర్వహించారు. ఎస్పీ రెమా రాజేశ్వరి, అదనపు ఎస్పీ డీవీ శ్రీనివాసరావు, ఏఎస్పీ కల్మేశ్వర్ సింగనవార్, ముగ్గురు డీఎస్పీలు, 10మంది సీఐలు, 30మంది ఎస్‌ఐలు, కానిస్టేబుల్స్, ప్రత్యేక బలగాలు పాలుపంచుకున్నారు.





మొదటి రోజు 776 అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన

మొదటిరోజు 776మంది అభ్యర్థులు సర్టిఫికెట్లను పరిశీలించినట్లు ఎస్పీ రెమా రాజేశ్వరి తెలిపారు. 480మంది అభ్యర్థులకు ఐదు రకాల పరీక్షలు నిర్వహించి.. 262మంది అభ్యర్థులను తుది రాతపరీక్షకు అర్హత సాధించారని తెలిపారు. మిగిలిన అభ్యర్థులకు  మంగళవారం వరుస క్రమంలో పరీక్షలు కొనసాగుతాయని చెప్పారు.

 

ఎస్పీ ప్రత్యేక పర్యవేక్షణ

ఎస్‌ఐ అభ్యర్థుల దేహదారుఢ్య ప రీక్షలను ఎస్పీ, దగ్గరుండి పరిశీలించారు. ఆ తర్వాత అభ్యర్థులు నేరుగా 100మీటర్ల పరుగు పోటీలో పాల్గొన్నారు. ఆ తర్వా త 800మీటర్ల పరుగు పోటీ, లాంగ్‌జంప్, హైజంప్, షార్ట్‌పుట్ పరీక్షల్లో పాల్గొన్నారు. అయితే చాలామంది అభ్యర్థులు 800మీటర్ల పరుగులో ఇబ్బందిపడ్డారు. ప్రతి ఆరుగురి బ్యాచ్‌లో ముగ్గురు, నలుగురు మాత్రమే నిర్ధేశించిన సమయంలో పరుగెత్తారు. అదేవిధంగా హై జంప్‌లో 139మీటర్లు దూకుతున్న సమయంలో చాలామంది కష్టపడ్డారు. లాంగ్‌జంప్, హైజంప్ సమయంలో అభ్యర్థులకు మూడుసార్లు అవకాశమిచ్చా రు. మొదటిరోజు 480మంది అభ్యర్థుల్లో 20శాతం మంది మాత్రమే అర్హత సాధించారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top