ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య


భూదాన్‌పోచంపల్లి :  ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి రైలు పట్టాలపైపడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతుడి కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..మండల కేంద్రంలోని మహామ్మాయి కాలనీకి చెందిన గంజి గణేశ్‌(35) లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల ఈయన కుటుంబం ఆర్థికంగా చితికిపోయింది. దాంతో ఇంట్లో కలహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి భార్యభర్తలు గొడవపడి గణేశ్‌ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. చాలా సేపటి వరకు ఇంటికి రాకపోవడంతో భార్య మహాలక్ష్మి తన అత్త, మరిదితో కలిసి వెతికారు. అయినా ఆచూకీ తెలియరాలేదు.



 దాంతో ఆదివారం కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వెళ్లారు. అక్కడ బీబీనగర్‌ వద్ద రైలు పట్టాల వద్ద ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడని స్థానిక పోలీసులు మృతుడి ఆనవాళ్లు తెలిపారు. మృతుడి కుడిచేయి మధ్యవేలు విరిగి ఉందని పేర్కొన్నారు. గంజి గణేశ్‌ చేతివేలు కూడా సగానికి విరిగి ఉండటంతో అనుమానంతో భువనగిరి ఏరియా ఆసుపత్రిలోని మార్చురీలో ఉన్న మృతదేహాన్ని పరిశీలించారు. అది గణేశేనని కుటుంబసభ్యులు నిర్థారించారు. పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చి దహన సంస్కారాలు నిర్వహించారు. మృతుడికి మూడేళ్ల కూతురు ఉంది.



ఒకప్పుడు చేనేత కార్మికుడే...

ఐదారు ఏళ్ల క్రితం గణేశ్‌ చేనేత కార్మికుడిగా మగ్గం నేసేవాడు. కానీ చేనేత పరిశ్రమ సంక్షోభంలో ఉండి గిట్టుబాటు కాక, చేనేత వృత్తిని వీడి లారీ డ్రైవర్‌గా చేరాడు. నిరుపేద గణేశ్‌ కుటుంబానికి ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలని చేనేత నాయకులు కోరారు. 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top