నువ్వా.. నేనా

నువ్వా.. నేనా - Sakshi


పతాక స్థాయికి అధిపత్య పోరు

టీడీపీ పాత, కొత్త నేతల మధ్య పెరుగుతున్న వైరం

అధికారుల బదిలీలే వేదిక నిన్న అద్దంకి సీఐ బదిలీ వ్యవహారం...

నేడు ఇరిగేషన్ ప్రాజెక్టుల ఎస్‌ఈ రమణమూర్తి బదిలీ

రమణమూర్తిని కరణం బదిలీ చేయించారని ప్రచారం...

బదిలీని నిలిపివేయాలని పట్టుబట్టిన గొట్టిపాటి

గొట్టిపాటిని ప్రోత్సహిస్తున్న కరణం వ్యతిరేక వర్గం


సాక్షి ప్రతినిధి, ఒంగోలు: టీడీపీ పాత, కొత్త నేతల మధ్య అధిపత్యపోరు పతాక స్థాయికి చేరింది. ముఖ్యంగా పాత నేత కరణం బలరాం కొత్తగా పార్టీలో చేరిన ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ఢీ అంటే ఢీ అంటూ టీడీపీ వర్గవిభేదాలను పతాకస్థాయికి చేర్చారు. ఇటీవల అద్దంకి సీఐ బేతపూడి ప్రసాద్ వ్యవహారంలో ఇరువర్గాల మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. సీఐని గొట్టిపాటి బదిలీ చేయిస్తే... కరణం ఆ బదిలీని అడ్డుకున్నారు. ఈ విషయం సమసిపోక ముందే ఇరిగేషన్ ప్రాజెక్టుల ఎస్‌ఈ రమణమూర్తి బదిలీ వ్యవహారం రచ్చకెక్కింది. రమణమూర్తిని ఇటీవల ఉన్నతాధికారులు విజయనగరం జిల్లాకు బదిలీ చేశారు. రమణమూర్తి బదిలీ వెనుక కరణం హస్తం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అద్దంకి నియోజకవర్గంలో నీరు-చెట్టు పనుల కోసం కరణం వర్గీయులు రూ.9 కోట్లతో ప్రతిపాదనలు ఇచ్చారు.


చివరకు రూ.5 కోట్ల పనులు మాత్రమే మంజూరయ్యాయి. మిగిలిన పనులు మంజూరు కాకపోవడానికి ప్రాజెక్టుల ఎస్‌ఈ రమణమూర్తి కారణం అని భావించిన కరణం ఎస్‌ఈ బదిలీ కోసం ఒత్తిడి తెచ్చినట్లు ప్రచారం ఉంది. కరణంతో పాటు మరికొందరు అధికార పార్టీ నేతలు కూడా ఎస్‌ఈ బదిలీ కోసం ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. ఎస్‌ఈ బదిలీని అడ్డుకుని కరణం ఆధిపత్యానికి అడ్డుకట్ట వేయాలని భావించిన కరణం వ్యతిరేక వర్గం గొట్టిపాటిని ముందు పెట్టి పావులు కదిపింది. దీంతో ఎస్‌ఈ బదిలీని నిలిపివేయాలంటూ గొట్టిపాటి రవికుమార్ శుక్రవారం గుంటూరులో ముఖ్యమంత్రిని కలిసి గట్టిగా విన్నవించారు.


గొట్టిపాటి తానొక్కడే వెళ్లకుండా ఫిరాయింపు  ఎమ్మెల్యేలతో కలిసి ఎస్‌ఈ బదిలీని నిలిపివేయాలని కోరారు. కరణం నిబంధనలకు విరుద్ధంగా పనులు మంజూరు చేయాలని ఎస్‌ఈపై ఒత్తిడి తెచ్చారని, ఆయన మాట విననందుకే ఎస్‌ఈ బదిలీకి కరణం పట్టుపట్టారని గొట్టిపాటితో పాటు ఫిరాయింపు ఎమ్మెల్యేలు సీఎంకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్‌ఈ బదిలీ వ్యవహారం ఎలా జరిగిందన్న దానిపై ముఖ్యమంత్రి ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమను విచారించినట్లు సమాచారం. అనంతరం ఎస్‌ఈ రమణమూర్తి బదిలీని నిలిపివేయాలంటూ ముఖ్యమంత్రి ఉన్నతాధికారులకు సూచించినట్లు ప్రచారం ఉంది. మరోవైపు జిల్లా ఉన్నతాధికారి సైతం రమణమూర్తి బదిలీని నిలిపివేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. రమణమూర్తి బదిలీ ఆగిపోతే టీడీపీ వర్గపోరు పతాకస్థాయికి చేరడం ఖాయం.


 ఇప్పటికే అద్దంకి సీఐ వ్యవహారంలో ఓటమి చెందిన గొట్టిపాటి ఎస్‌ఈ బదిలీని నిలుపుదల చేయించి కరణం ఆధిపత్యానికి అడ్డుకట్ట వేయాలని గట్టి పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఇక నుంచి ఒంటరిగా కాక, తనతో పాటు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను వెంటబెట్టుకోవడంతో పాటు టీడీపీలో కరణం వ్యతిరేక వర్గీయుల మద్దతును కూడగట్టి కరణంపై అమీతుమీకి సిద్ధపడుతున్నట్లు సమాచారం. ఇదే సమయంలో కరణం సైతం తనకు మద్దతు పలుకుతున్న పాత నేతలతో కలిసి సీఎం వద్దే తేల్చుకునేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఇరువర్గాల గొడవ తీవ్రరూపం దాల్చుతోంది. చివరకు ఎవరిది పై చేయి అవుతుందో వేచి చూడాల్సిందే...!

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top