ముదిరిన ‘ఖానాపూర్‌’ లొల్లి

ముదిరిన ‘ఖానాపూర్‌’ లొల్లి


రేఖానాయక్‌ వర్సెస్‌ రమేశ్‌రాథోడ్‌..

‘పట్టు’ కోసం ఇరువురి  మధ్య పోటాపోటీ

రోజురోజుకూ  వేడెక్కుతున్న రాజకీయం

సీఎం పర్యటనకు ముందే ఇద్దరి మధ్య గొడవ

రెండుగా చీలిపోయిన పార్టీ వర్గాలు

మాజీ ఎంపీపై పోలీసులకు  ఎమ్మెల్యే ఫిర్యాదు




నిర్మల్‌రూరల్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ పక్క జిల్లాకు వస్తున్న రెండురోజుల ముందు జిల్లాలోని టీఆర్‌ఎస్‌ పార్టీ పరంగా ఖానాపూర్‌ నియోజకవర్గంలో లొల్లి రాజు కుంది. నియోజకవర్గంపై పట్టు నిలుపుకోవడంలో భాగంగా ప్రస్తుత ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్, మాజీ ఎంపీ రమేశ్‌ రాథోడ్‌ల మధ్య కొనసాగుతున్న వార్‌ మరోమారు బయటపడింది. రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సాక్షిగా పార్టీ కార్యకర్తల సమక్షంలోనే మంగళవారం వీరి మధ్య గొడవ చోటుచేసుకుంది.



‘నువ్వెంత.. అంటే నువ్వెంత.. బతకడానికి వచ్చిందెవరు.. నువ్వా నేనా..’ అనే స్థాయిలో ఎమ్మెల్యే, మాజీ ఎంపీల మధ్య రభస సాగింది. వీరిద్దరితో పాటు వీరి వర్గాల మధ్యనా గొడవ చోటుచేసుకుంది. పోటాపోటీ నినాదాలతో ఆయా వర్గాల నాయకులు, కార్యకర్తలు హోరెత్తించారు. ఎమ్మెల్యే రేఖానాయక్‌ ఏకంగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తనపై దురుసుగా ప్రవర్తించాడంటూ మాజీ ఎంపీపై ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జరిగిన పార్టీ సమావేశంలో చోటుచేసుకున్న ఈ సంఘటన జిల్లాలో ప్రస్తుతం చర్చనీ యాంశంగా మారింది. ఖానాపూర్‌ నియోజకవర్గంపై పట్టు నిలుపుకునేందుకు ఇరువర్గాలు చేస్తు న్న ప్రయత్నాలు మరోమారు బయటపడ్డాయి.



గతంలోనూ గొడవలు

ఖానాపూర్‌లో తాజా ఎమ్మెల్యేకు.. మాజీ ఎమ్మెల్యేకు మధ్య గతంలోనూ గొడవలు జరిగాయి. ఖానాపూర్‌ ఆస్పత్రిలో జరిగిన సంఘటనలో తనపై గన్‌మెన్‌ను తోసేసి, అసభ్యంగా ప్రవర్తించాడంటూ రమేశ్‌రాథోడ్‌పై రేఖానాయక్‌ ఆరోపించారు. ఖానాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ ఎదుట బైఠాయించి ఆందోళన వ్యక్తంచేయడం అప్పట్లో చర్చనీయాంశమైంది. పలు సభలు, సమావేశాల్లో వీరిద్దరు ఒకరిపై ఒకరు మాటల యుద్ధానికి దిగారు. ప్రతిపక్ష టీడీపీలో సీనియర్‌గా ఉన్న రమేశ్‌ రాథోడ్‌ ఏళ్లపాటు పాలించి నియోజకవర్గాన్ని ఏం అభివృద్ధి చేయలేదంటూ ఎమ్మెల్యే చాలా సందర్భాల్లో మండిపడ్డారు. ఇప్పుడు తాము చేస్తున్న అభివృద్ధికి అడ్డుపడుతున్నారంటూ ఆయనపై మాటల దాడికి దిగారు. మాజీ ఎంపీ సైతం అవకాశం దొరికినప్పుడల్లా ఎమ్మెల్యే ఏం అభివృద్ధి చేయడం లేదంటూ విమర్శలు గుప్పించారు.



రాథోడ్‌ టీఆర్‌ఎస్‌లోకి రావడంతో..

ఒకే నియోజకవర్గంలో ఉప్పు..నిప్పులా ఉన్న ఇద్దరూ ఒకే పార్టీ వారు కావడం లొల్లిని మరింత ముదిరేలా చేసింది. రెండు నెలల క్రితం ఖానాపూర్‌ నియోజకవర్గానికి చెందిన సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు పైడిపల్లి రవీందర్‌రావుతో కలిసి రమేశ్‌రాథోడ్‌ టీఆర్‌ఎస్‌లో చేరారు. అప్పటి నుంచి ఎమ్మెల్యే రేఖానాయక్‌ మరింత గుర్రుగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్‌ విషయంలో తనకు పోటీగానే టీఆర్‌ఎస్‌లో చేరాడని రాథోడ్‌పై మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. మొన్నటిదాకా టీఆర్‌ఎస్, ప్రభుత్వాన్ని తిట్టిన వ్యక్తి.. ఇప్పుడు ఎందుకు పార్టీలోకి వచ్చారంటూ మండిపడ్డారు. అధిష్టానం నిర్ణయాన్ని వ్యతిరేకించలేక స్థానికంగా పట్టు కోసం శ్రమిస్తున్నారు.



పోటాపోటీగా...

ఉమ్మడి ఆదిలాబాద్‌ నుంచి విడిపోయిన మూడు జిల్లాల్లో విస్తరించి ఉన్న ఏకైక నియోజకవర్గం ఖానాపూర్‌. నాలుగు జిల్లాలతోనూ సంబంధాలు కలిగి ఉన్న ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గమిది. ఒకప్పుడు టీడీపీ నుంచి రమేశ్‌ రాథోడ్‌ ఏళ్లపాటు ఇక్కడ పట్టు నిలబెట్టుకున్నారు. ఆయన ఎంపీగా వెళ్లినా భార్య సుమన్‌బాయిని ఎమ్మెల్యేగా గెలిపిం చుకున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ నుంచి పోటీచేసిన రేఖానాయక్‌ ఖానాపూర్‌ ఎమ్మెల్యేగా గెలుపొందా రు. అప్పటి నుంచి రాథోడ్‌ మళ్లీ పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఆయన యత్నాలకు గండి కొడుతూ తనదే పైచేయిగా సాధించేం దుకు రేఖానాయక్‌ పావులు కదుపుతూ వస్తున్నారు. ఇప్పుడు ఇద్దరూ ఒకే పార్టీలో ఉండటం, రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు నేపథ్యంలో ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారు. ప్రస్తు తం ఖానాపూర్‌ టీఆర్‌ఎస్‌ రెండు వర్గాలుగా చీలిపోయి ఉంది. ఏ కార్యక్రమం జరిగినా పోటాపోటీగా తమ ప్రదర్శన చేస్తూనే ఉన్నాయి.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top