2016.. మరిచిపోలేని వసంతం

2016.. మరిచిపోలేని వసంతం - Sakshi


కొత్త జిల్లాగా పురుడు పోసుకున్న మహబూబాబాద్‌ జిల్లా

ప్రజల చెంతకు వచ్చిన పాలన

తొర్రూరు డివిజన్‌తోపాటు నాలుగు కొత్త మండలాల ఏర్పాటు

నెరవేరిన ప్రజల చిరకాల వాంఛ




మహబూబాబాద్‌ : రాష్ట్ర చరిత్రలో 2016 ఓ మైలురాయి. మహబూబాబాద్‌ చరిత్ర గురించి రాయాల్సి వస్తే 2016 అక్టోబర్‌ 11కు ముందు.. ఆ తర్వాత అని రాయాల్సిందే. ఎందుకంటే ఈ ఏడాదే రాష్ట్రవ్యాప్తంగా జరిగిన జిల్లాల పునర్విభజనలో తనదైన అస్థిత్వాన్ని నిలుపుకొని మానుకోట ప్రత్యేక జిల్లాగా పురుడుపోసుకుంది. ఇదే జిల్లాలో జెట్‌ స్పీడ్‌లో విద్యా, వాణిజ్య కేంద్రంగా అభివృద్ధి చెందుతున్న తొర్రూరు పట్టణం డివిజన్‌ కేంద్రంగా ఏర్పాటైంది. అలాగే దంతాలపల్లి, పెద్దవంగర, చిన్నగూడూరు, గంగారం మండలాలు కొత్తగా ఏర్పాటయ్యాయి. ఫలితంగా ప్రజలకు జిల్లా, డివిజన్, మండల అధికార యంత్రాంగాలు మరింత చేరువయ్యాయి. కొత్త జిల్లాలో ప్రజాసమస్యలకు త్వరితగతిన పరిష్కారం లభిస్తోంది. ఉమ్మడి వరంగల్‌ జిల్లా విస్తీర్ణం ఎంతో పెద్దది. గతంలో వరంగల్‌ జిల్లా కేంద్రంలో ఉండే కలెక్టర్, ఎస్పీ, వివిధ శాఖల అధికార Ä¶æ  మారుమూల ప్రాంతాల్లో పర్యటించాలంటే సుమారు 100 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వచ్చేది. దీంతో అధికారులు పర్యటించేందుకు సరిపోయేంత సమయం ఉండేది కాదు. అధికారులు తమ పాలన కాలంలో చాలా మండలాలు పర్యటించని సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం జిల్లా కేంద్రం నుంచి చివరి మండలం 67 కిలో మీటర్లలోపే ఉండటంతో అధికారులు ఉదయం పూట క్షేత్రస్థాయి పర్యటన చేసి  మధ్యాహ్నం తర్వాత కార్యాలయాల్లో అందుబాటులో ఉండే అవకాశం ఏర్పడింది.



గతంలో ఇబ్బందులు..

జిల్లాల విభజనకు ముందు వరంగల్‌లో ఉన్న జిల్లా అధికారులను కలిసి తమ సమస్యలు విన్నవించుకోవాలంటే ప్రజలు నానా అవస్థలు పడాల్సి వచ్చేది. తెల్లవారుజామున బయల్దేరి వెళితేగానీ మధ్యాహ్నానికి చేరుకునేవాళ్లుకాదు. అదే ఇప్పుడు ఉదయం కార్యాలయం తీసే సమయానికి ఒక అరగంట ముందు బయల్దేరి జిల్లా కార్యాలయాలకు చేరుకోవచ్చు. తమ పని కాకపోతే దగ్గర్లో కలెక్టరేట్‌ ఉండడం వల్ల ఒకటికి రెండుసార్లు వెళ్లగలిగే అవకాశం కూడా ఉంది. అందుకే ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్‌కు పలు సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు బారులుతీరుతున్నారు. జిల్లాలో తొర్రూరును రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయడంతో పాలనాపరంగా మరింత సౌలభ్యం ఏర్పడింది. ప్రాజెక్టులు, ప్రభుత్వ పథకాల భూసేకరణకు మరింత వెసులుబాటు లభించింది. రెవెన్యూ పరమైన సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం అవుతున్నాయి.



ఖమ్మం జిల్లాలోని రెండు మండలాలలు..

పాత ఖమ్మం జిల్లాకు చెందిన రెండు మండలాలు నూతనంగా ఏర్పాటైన మహబూబాబాద్‌ జిల్లాలో కలిపారు. బయ్యారం, గార్ల మండలాలలు ఇది వరకు ఖమ్మం జిల్లాలో విభజనకు ముందు ఉండేవి.  ఈ మండలాల ప్రజలు ఖమ్మం జిల్లాకు వెళ్లాలంటే సుమారుగా రెండు నుంచి మూడు గంటల పాటు ప్రయాణం చేసే వెళ్లేవారు. అదే ఇప్పుడు అరగంటలో జిల్లా కేంద్రానికి చేరుకుంటున్నారు.



డుమ్మాలకు చెల్లుచీటి..

మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంగా ఏర్పాటు కావడంతో ప్రజల సమస్యలు నేరుగా కలెక్టర్‌ డాక్టర్‌ ప్రీతి మీనా, ఎస్పీ మురళీధర్‌ దృష్టికి వస్తున్నాయి. కలెక్టర్, జేసీ, ఎస్పీ, డీఎంహెచ్‌ఓ తదితర అధికారులు తరుచూ ఆకస్మిక పర్యటనలు చేస్తుండటంతో కిందిస్థాయి అధికారులు, ఉద్యోగులు సమయపాలన పాటిస్తున్నారు. ప్రభుత్వ పథకాల అమలులో వేగం పెరగగా.. గ్రామ స్థాయిలో పథకాల అమలు తీరుతెన్నులను కలెక్టర్లు, ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులు సమీక్షించేందుకు వెసులుబాటు లభించింది. ప్రజలకు మరింత మెరుగైన పారదర్శక పాలన అందేందుకు ఇది దోహదపడుతుంది.

 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top