తండ్రిని చంపిన తనయుడు


- బెల్డోణ గ్రామంలో దారుణం

- కుటుంబ గొడవలే కారణం

 

చిప్పగిరి: క్షణికోద్రానికి గురైన కుమారుడు..తన తండ్రిని కట్టెతో బాది చంపాడు. ఈ ఘటన గురువారం తెల్లవారు జామున  బెల్డోణ గ్రామంలో చోటు చేసుకుంది. ఆలూరు సీఐ శంకరయ్య, గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. బెల్డోణ గ్రామానికి చెందిన గొల్ల భీమలింగప్ప(55)కు భార్య లీలావతి, కుమారుడు మునిస్వామి, ఒక కుమార్తె ఉన్నారు. వీరిలో కుమార్తెకు వివాహమయ్యింది. కొన్నేళ్ల నుంచి కుటుంబ కలహాలు చోటు చేసుకోవడంతో భీమలింగప్ప గ్రామం వదిలి ఇతర ప్రాంతంలో జీవించేవాడు. అప్పుడప్పుడు గ్రామానికి వచ్చి వెళ్లేవాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి భీమలింగప్ప బెల్డోణలోని తన ఇంటికి చేరుకున్నాడు. గురువారం తెల్లవారుజామున భార్య లీలావతి, కుమారుడు మునిస్వామిలు.. భీమలింగప్పతో వాగ్వాదానికి దిగారు. వారిలో మాటామాటా పెరిగి కోపోద్రోకుడైన మునిస్వామి తండ్రి తలపై కట్టెతో బాదాడు. దీంతో భీమలింగప్ప అక్కడికక్కడే కుప్పకూలి పడిపోయాడు. కొద్దిసేపటికే భీమలింగప్ప ప్రాణాలు విడిచాడు. తెల్లవారితే గ్రామంలో విషయం తెలిసిపోతుందని కంగారుపడిన లీలావతి, కుమారుడు మునిస్వామిలు ఓ ఆటోలో భీమలింగప్ప మృతదేహాన్ని గ్రామ సమీపంలోని ఓ పత్తి పొలంలో పడేశారు. ఉదయం అటుగా బహిర్భూమికి వెళ్లిన కొందరు గ్రామస్తులకు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అయినప్పటికీ భార్య లీలావతి, కుమారుడు మునిస్వామిలు మృతదేహం వద్దకు వెళ్లలేదు. ఆలూరు సీఐ శంకరయ్య, ఆలూరు, ఆస్పరి, హాలహర్వి ఎస్‌ఐలు ధనుంజయ, వెంకటరమణ, కృష్ణమూర్తి, చిప్పగిరి హెడ్‌కానిస్టేబుల్‌ ప్రకాష్‌ సంఘటనా స్థలానికి చేరుకొని మృతికి గల కారణాలను ఆరా తీశారు. కుమారుడు హతమార్చినట్లు తమ ప్రాథమిక విచారణలో నిర్ధారణ అయినట్లు సీఐ విలేకరులకు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. 

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top