అమ్మా.. లేమ్మా.. స్కూల్‌కు టైం అవుతోంది..

అమ్మా.. లేమ్మా.. స్కూల్‌కు టైం అవుతోంది.. - Sakshi


‘‘అమ్మా.. లేమ్మా.. స్కూల్‌కు టైం అవుతోంది.. రెడీ చేయమ్మా’’ అంటూ పదేళ్ల బాలుడు విగతజీవిగా మారిన తల్లిని తట్టిలేపేందుకు చేస్తున్న ప్రయత్నం అక్కడున్న వారందరి గుండెలను ద్రవింపజేసింది. కోదాడ మండలం గోండ్రియాల గ్రామానికి చెందిన తండ్రీకూతురు పుసుళూరి వెంకటేశ్వర్లు(55), కొల్లు రమాదేవి(30) శుక్రవారం విద్యుదాఘాతంతో మృతిచెందారు. ఎనిమిదేళ్ల క్రితమే భర్త చనిపోవడంతో తన ఇద్దరు బిడ్డలతో బతుకీడుస్తున్న రమాదేవి కూడా ప్రమాదవశాత్తు మృతిచెందడంతో ఆ చిన్నారులు అనాథలయ్యారు.         

- కోదాడరూరల్


 

* విద్యుదాఘాతంతో తండ్రీకూతురు మృతి

* కోదాడ మండలం గోండ్రియాలలో విషాదం

* ఉతికిన బట్టలు ఆరవేస్తుండగా ప్రమాదం

* అనాథలైన ఇద్దరు చిన్నారులు


గోండ్రియాల గ్రామానికి చెందిన పుసుళూరి వెంకటేశ్వర్లు(55) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతడికి నలుగురు కుమార్తెలు. ఇద్దరు కుమార్తెలకు వివాహాలు కాగా మరో ఇద్దరు కుమార్తెలు చదువుకుంటూ ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నారు.

 

ఎనిమిదేళ్ల క్రితమే భర్తను కోల్పోయి..

వెంకటేశ్వర్లు పదెద కుమార్తె కొల్లు రమాదేవి(30)కి ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం బోదలబండకు చెందిన వ్యక్తితో పన్నెండేళ్ల క్రితం వివాహం జరిగింది. కారణాలైతే తెలియవు కానీ అతను ఎనిమిదేళ్ల క్రితమే మృతి చెందాడు. దీంతో రమాదేవి కుమారుడు సందీప్( 5వ తరగతి), కుతూరు మనస్వీ (3వ తరగతి)ని తీసుకుని పుట్టింటికి చేరింది. స్థానికంగా  ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ పిల్లలను చదివిస్తోంది.

 

బట్టలు ఆరవేస్తుండగా..

రమాదేవి శుక్రవారం తెల్లవారుజామునే లేచి ఇంటి పనులు చక్కబెట్టుకుంటోంది. ఈ క్రమంలో పిల్లల బట్టలు, స్కూల్ బ్యాగ్‌లను ఉతికి ఇంటి ఆవరణలో గల దండెంపై ఆరవేస్తోంది. ఈ క్రమం లో ఒక్క సారిగా విద్యుదాఘాతానికి గురై అరవడంతో సమీపంలోనే ఉన్న ఆమె తండ్రి వెంకటేశ్వర్లు గమనించారు. కూతురిని కాపాడేందుకు కర్ర తో దండెం తీగను బలంగా కొట్టాడు. ఆ తీగ తెగి వెంకటేశ్వర్లుపై పడడంతో అతను కూడా విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. ఇది గమనించి ఆయన భార్య సావిత్ర దగ్గరికి వెళ్లగా ఆమె కూడా షాక్‌కు గురై కొంత దూరంలో ఎగిరిపడింది. ఈ ప్రమాదంలో వెంకటేశ్వర్లు, రమాదేవి అక్కడికక్కడే మృతిచెం దగా, సావిత్రి ప్రాణాపాయం తప్పింది.

 

తీగ పైపొర ఊడిపోవడంతో..

వెంకటేశ్వర్లు ఇంట్లోకి తీసుకున్న కరెంట్‌తీగతో పాటు ఉన్న జే వైర్‌ను నేరుగా పోల్ నుంచి రేకుల కింద వేసిన రాడ్డుకు కట్టారు. అక్కడ తీగ పైపొర ఉడిపోవడంతో పాటు గురువారం రాత్రి కురిసిన వర్షానికి షార్ట్‌సర్క్యూట్ జరిగి ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది.

 

మిన్నంటిన రోదనలు

విద్యుదాఘాతంతో తండ్రీకూతురు మృతిచెందడంతో గోండ్రియాలలో విషాదఛాయలు అలుముకున్నాయి. తల్లిని కూడా కోల్పోయి అనాథలైన చి న్నారులు, ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన ఆ కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. విషయం తెలుసుకున్న రూరల్ పోలసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను  కోదాడ ప్రభుత్వ వైద్యాశాలకు తరలించారు. మృతుల కుటుంబ సభ్యులను డీసీసీబీ చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు పరామర్శించారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top