పవర్ పాట్లు


ఒంగోలు: వ్యవసాయ విద్యుత్‌ సర్వీసుల కోసం జిల్లా రైతాంగం ఎదురుచూపులు చూస్తోంది. విద్యుత్‌ శాఖ సర్వీసులు కేటాయిస్తే బోరు బావుల ద్వారా వ్యవసాయం సాగించేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారు. ప్రభుత్వం తగినన్ని వ్యవసాయ విద్యుత్‌ సర్వీసులు మంజూరు చేయకపోవడంతో వారు ఇబ్బందులు పడుతున్నారు. 10 నెలలుగా ప్రభుత్వం అరకొరగా మినహా వ్యవసాయ విద్యుత్‌ సర్వీసులు మంజూరు చేయలేదు. జిల్లావ్యాప్తంగా ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు 9 నెలల కాలంలోనే 28 వేల మంది సర్వీసుల కోసం దరఖాస్తులు చేసుకున్నారు.  ప్రభుత్వం సకాలంలో తగినన్ని సర్వీసులు కేటాయించలేదు.



ఇప్పట్లో ఇచ్చే పరిస్థితి కానరావడం లేదు. దరఖాస్తులు చేసుకున్న 28 వేల మంది రైతుల్లో 10 వేల మంది తమ సర్వీసులకు సంబంధించిన అంచనా వ్యయంలో 50 శాతం మొత్తాన్ని చెల్లించారు. అయినా వీరికి ఇంకా సర్వీసులు మంజూరు చేయలేదు. ఎప్పటికి మంజూరు చేస్తారో తెలియని పరిస్థితి. దీంతో వారు ఎదురుచూపులు చూడాల్సి వస్తోంది. రైతులకు ఉచితంగా విద్యుత్‌ సరఫరా చేసే కార్యక్రమానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి శ్రీకారం చుట్టారు. విద్యుత్‌ ఉచితంగా అందించటమే కాక, రైతులకు అడిగినన్ని వ్యవసాయ సర్వీసులు మంజూరు చేసిన ఘనత వైఎస్‌కే దక్కింది. అయితే చంద్రబాబు సర్కారు విద్యుత్‌ సర్వీసుల కేటాయింపు మొక్కుబడిగా నిర్వహిస్తోంది. ప్రతి ఏడాది సగటున 30 వేల మంది రైతులు వ్యవసాయ సర్వీసులకు దరఖాస్తులు చేసుకుంటున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.



రెండేళ్లుగా పరిస్థితి ఇదీ..

గత రెండేళ్లలో టీడీపీ ప్రభుత్వం తక్కువ మోతాదులోనే సర్వీసులు మంజూరు చేస్తోంది. 2014–15 ఏడాదికిగాను 9,084 సర్వీసులను మాత్రమే మంజూరు చేయగా, 2015–16 ఏడాదికిగాను 8,675 సర్వీసులను మాత్రమే ఇచ్చింది. 2016–17 ఏడాదికిగాను 7,400 వ్యవసాయ కనెక్షన్లు మంజూరు చేయడమే లక్ష్యంగా పెట్టుకోగా, అక్టోబర్‌ 15వ తేదీ నాటికి 4,005 సర్వీసులు  కేటాయించినట్లు విద్యుత్‌ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఏడాదికిగాను ఇంకా 3,395 సర్వీసులు ఇవ్వాల్సి ఉంది.  



28 వేల మంది రైతులు ప్రస్తుతం సర్వీసుల కోసం దరఖాస్తులు చేసుకోగా వారిలో 10 వేల మంది రైతులు ఇప్పటికే అంచనా వ్యయం మొత్తాన్ని సైతం చెల్లించడం గమనార్హం. అంచనా వ్యయం చెల్లించిన 10 వేల మంది రైతులకు కూడా వ్యవసాయ సర్వీసులిచ్చే పరిస్థితి కనిపించటం లేదు. మిగిలిన 18 వేల మందికి ఎప్పుడు సర్వీసులు కేటాయిస్తారో తెలియని పరిస్థితుల్లో రైతాంగం ఆందోళన చెందుతోంది. తక్షణం వ్యవసాయ సర్వీసులు మంజూరు చేయాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top