ఆ..కందుల కథేంటీ?

ఆ..కందుల కథేంటీ? - Sakshi


దొరికిన కందులను ఏమి చేద్దాం

వ్యాపారస్తుల్లో గుబుల్‌...రహస్య సమావేశం

నావేనంటూ కార్యదర్శి వద్దకు వచ్చిన ఓ రైతు

పట్టాపాస్‌బుక్‌...ఆధార్‌కార్డు తీసుకురావాలని సూచన

ఖంగుతిన్న రైతు...మళ్లీ వస్తానని చెప్పి వెళ్లిన వైనం




నారాయణపేట : పదులు కాదు.. ఇరువైలు కాదు ఏకంగా రూ.లక్షన్నర విలువ చేసే కందులను అక్రమంగా మార్క్‌ఫెడ్‌లో విక్రయించేందుకు వ్యాపారులే రైతుల అవతారం ఎత్తుతున్నారు. ఈ నెల 11న ఓ హామీలీ 58 సంచుల కందులను స్థానిక మార్క్‌ఫెడ్‌ కేంద్రంలో రైతు పేరిటా విక్రయిస్తూ మార్కెటింగ్‌ అధికారులకు పట్టుబడిన విషయం పాఠకులకు విధితమే. రైతుల పేరిట దొంగ సరుకును విక్రయిస్తున్న సంఘటనలు ఇటీవల కాలంలో పేట వ్యవసాయ మార్కెట్‌లో వెలుగు చూస్తున్నాయి. ఒక్కొక్కరూ ఒక్కొక్క రీతిలో సరుకును విక్రయించేందుకు యత్నిస్తూ చివరి సమయంలో పట్టుబడుతున్నారు. ఓవైపు జిల్లాలోని బాదేపల్లి మార్కెట్‌ యార్డులో విజిలెన్స్‌ అధికారుల తనిఖీలు ముమ్మరం కానుండడంతో ఆ గాలి నారాయణపేట మార్కెట్‌ యార్డుపై పడే అవకాశాలు లేకపోలేవనే చర్చ కొనసాగుతుంది.


58 బస్తాల కందులు దాదాపు 29 క్వింటాళ్ల తూకం అవుతుందని ఒక క్వింటా ధర రూ.5,050 మార్క్‌ఫెడ్‌ కేంద్రంలో విక్రయిస్తే మొత్తం రూ.1,46,450 అవుతుంది. అయితే గతంలో స్థానిక వ్యాపారులు రైతుల నుంచి తక్కువ ధరకు కందులను కొనుగోలు చేసి ప్రస్తుతం వాటిని అధిక ధరలకు విక్రయించేందుకు యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. వ్యవసాయ మార్కెట్‌లో పనిచేసే ఓ హమాలీ రైతు అవతారమెత్తించి కందులను విక్రయించేందుకు మార్క్‌ఫెడ్‌ యార్డుకు తరలించి పట్టుబడిన వైనం వ్యాపార వర్గాల్లో గుబులురేపుతోంది. జీరో వ్యాపారానికి అలవాటుపడిన నారాయణపేట వ్యాపారులకు మార్క్‌ఫెడ్‌ కేంద్రం గుదిబండలా మారినట్లు ఈ సంఘటనను బట్టీ స్పష్టమవుతుంది.


అంతేకాకుండా పాలకవర్గ చైర్మన్‌ రైతులకు అండగా నిలుస్తూ ఎక్కడ అన్యాయం జరగకుండా యార్డులో పర్యవేక్షణ చేపడుతూ సమస్యలు పరిష్కరిస్తుండడంతో వ్యాపారులకు కంటిమీద కునుకులేకుండా పోతుంది. పట్టుబడిన కందులు గంజిలోని ఓ కమీషన్‌ ఏజెంట్‌కు సంబంధించినట్లుగా తెలుస్తోంది. దొంగ సరుకును ఎలాగైనా రైతు సరుకుగా చూపించేందుకు తెరవెనుక గురువారం యార్డులో రాజకీయ బేరసారాలు మొదలుపెట్టారు. ఆ సరుకును అక్కడి నుంచి కనిపించకుండా చేయడమా..? రైతుల పాసుపుస్తకాలను పెట్టి చూపించడమా అనే దానిపై యత్నాలు మొదలయ్యాయి.



వ్యాపారుల ప్రత్యేక సమావేశం..

పట్టుబడిన కందులను ఏం చేద్దాం.. మా ర్కెట్‌ చైర్మన్‌ ఎంత పనిచేస్తాడో.. ఇలాగైతే వ్యాపారాలు యార్డులో చేయడం కష్టం.. అంటూ వ్యాపారులు రహస్య సమావేశంలో చర్చించుకున్నట్లు సమాచారం. మార్క్‌ఫెడ్‌లో పట్టుబడిన కందులు ఎవరివి.. ఆ కందులకు సంబంధించిన కమీషన్‌ ఏజెంట్‌ ఎవరా అనే విషయమై ఆరా తీసినట్లు తెలుస్తోంది. అసలు ఆ కందులు కమీషన్‌ ఏజెంట్‌వా.. లేక రైతువా అని చర్చించారు.  తనవే నని ఎవరైనా ముందుకు వస్తే ఏదో ఒకటి చేస్తామని వ్యాపారులు సదరు కమీషన్‌ ఏజెంట్‌కు భరోసానిచ్చినట్లు వినికిడి. అధికారులు, పాలకవర్గాన్ని తమ దారిలోకి తెచ్చుకోవాలంటే సగం సగం ఖర్చు అయినా ఫర్వాలేదు.. ఇందుకు సిద్ధంగా ఉండాలని చర్చించుకున్నట్లు సమాచారం.



కంగుతిన్న రైతు..మళ్లీ వస్తానని మాయం..

పట్టుబడిన కంది బస్తాలు తనవేనంటూ ఓ రైతు గురువారం మార్కెట్‌ కార్యదర్శి ముందు ప్రత్యక్షమయ్యారు. అయితే బుధవారం ఎందుకు చెప్పకుండా వెళ్లావని ప్రశ్నిస్తే.. హడావుడిలో ఏం చెప్పాలో తోచక వెళ్లానని కార్యదర్శితో చెప్పుకొచ్చారు. అయితే పట్టా పాసుపుస్తకం, ఆధార్‌కార్డు తీసుకురావాలని ఆ రైతుకు కార్యదర్శి సూచించడంతో పాలుపోలేని రైతు తడబడుతూ సార్‌ మళ్లీ వస్తానంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.



కందులను చూయించేందుకు అనాసక్తి..

పట్టుబడిన 58 కంది బస్తాలను మార్క్‌ఫెడ్‌ కార్యాలయం నుంచి మార్కెట్‌ పాత కార్యాలయంలోకి మార్చారు. కంది బస్తాలు ఎక్కడ పెట్టారని మార్కెట్‌ అధికారులను అడగగా అవి మార్క్‌ఫెడ్‌ వారి ఆధీనంలో ఉన్నాయని ఒకరు.. వారిని అడిగితే అవి మార్కెట్‌ అధికారుల పరిధిలో ఉన్నాయంటూ మరొకరు చెప్పుకొచ్చారు. మార్కెట్‌ కార్యాలయంలో ఉన్న కంది బస్తాల ఫొటోలను చిత్రీకరించేందుకు ‘సాక్షి’ విలేకరి అక్కడికి వెళ్లగా మార్క్‌ఫెడ్‌ అధికారి మాత్రం తనకు సంబంధం లేదంటూ తాళం వేసుకొని వెళ్లిపోయారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top