కౌలు రైతును కాటేసిన కాల్‌మనీ కేసు


  •  ఇచ్చిన అప్పు కట్టమన్నందుకు కేసు

  •  తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడిన కౌలు రైతు

  • పోలవరం/నిడదవోలు : అతడో కౌలు రైతు. రెక్కలు ముక్కలు చేసుకుని వ్యవసాయం చేశాడు. నోరు కట్టుకుని.. సరదాలను చంపుకుని పైసా పైసా కూడబెట్టుకున్నాడు. అలా దాచుకున్న రూ.3 లక్షలతో ఇల్లు కట్టుకుందామనుకున్నాడు. అతనితో స్నేహం పెంచుకున్న ఓ వ్యక్తి ఆ సొమ్ము తనకు అప్పుగా ఇమ్మని అడిగాడు. ఇల్లు కట్టుకునే సమయంలో వడ్డీతో సహా ఇచ్చేస్తానన్నాడు. వడ్డీ రూపంలో ఎంతో కొంత వస్తుందని.. ఇంటి నిర్మాణానికి ఉపయోగపడుతుందని ఆశపడిన ఆ కౌలు రైతు రెండేళ్ల క్రితం స్నేహితుడికి ఆ సొమ్ము ఇచ్చాడు. ఇటీవల ఇల్లు కట్టుకునేందుకు సిద్ధమైన కౌలు రైతు తన సొమ్ము తిరిగివ్వాలని అడిగితే.. సదరు స్నేహితుడు అతడిపై కాల్‌మనీ కేసు పెట్టాడు. మనస్తాపానికి గురైన కౌలు రైతు బలవన్మరణం పాలయ్యాడు.



    వివరాల్లోకి వెళితే.. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మండలం అట్లపాడు గ్రామానికి చెందిన తోట వెంకటేశ్వరరావు (50) సుమారు ఐదు రోజుల క్రితం పోలవరం మండలం మూలలంకలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సోమవారం అతడి మృతదేహం లభ్యమైంది. పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. అతడు ఎవరో, ఎక్కడి నుంచి వచ్చాడన్న తొలుత వివరాలు లభ్యం కాలేదు. అతడి వద్ద లభించిన బస్ టికెట్ ఆధారంగా నిడదవోలు ప్రాంతానికి చెందినవాడై ఉంటాడని భావించిన పోలీసులు ఆ పరిసర ప్రాంతాల వారికి సమాచారం పంపించారు. మంగళవారం అతని బంధువులు వచ్చి మృతుడి పేరు తోట వెంకటేశ్వరరావు అని, అట్లపాడు గ్రామానికి చెందిన వాడని గుర్తించారు. ఈ ఘటన పూర్వాపరాలపై పోలవరం ఎస్సై కె.శ్రీహరిరావు ఆరా తీయగా.. కాల్‌మనీ కేసు వెలుగులోకి వచ్చింది. వెంకటేశ్వరరావు తాను దాచుకున్న సుమారు రూ.3 లక్షలను అదే గ్రామానికి చెందిన అచ్యుత నాగరాజుకు అప్పుగా ఇచ్చాడు. వెంకటేశ్వరరావు ఇల్లు కట్టుకునేందుకు నిర్ణయించుకుని పాత తాటాకింటిని తొలగించాడు.



    పూరిపాక వేసుకుని ప్రస్తుతానికి అందులో నివాసం ఉంటున్నాడు. ఇల్లు కట్టుకుంటున్నందును తానిచ్చిన సొమ్మును తిరిగివ్వాలని నాగరాజును వెంకటేశ్వరరావు అడిగాడు. అప్పు తీర్చకపోగా నాగరాజు అతడిపై సమిశ్రగూడెం పోలీస్ స్టేషన్‌లో కాల్‌మనీ వేధింపుల కింద 20 రోజుల క్రితం కేసు పెట్టాడు. దీంతో పోలీసులు వెంకటేశ్వరరావును స్టేషన్‌కు పిలిపించి విచారణ జరిపారు. దీంతో మనస్తాపానికి గురైన వెంకటేశ్వరరావు ఈనెల 15న ఇంటి నుంచి వచ్చేశాడు.


    పోలవరం మండలం మూలలంక ప్రాంతంలో సోమవారం శవమై కనిపించాడు. అతడికి భార్య మంగ, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. చిన్న కుమారుడికి వివాహం కాలేదు. వారంతా ఉమ్మడిగానే ఉంటూ కూలి పనులు చేసుకుంటూ ఇల్లు కట్టుకోవాలనే ఉద్దేశంతో కష్టపడి పైసాపైసా కూడబెట్టారు. చివరకు సొమ్ము దక్కకపోగా.. కుటుంబ యజమాని బలవన్మరణం పాలవడంతో ఆ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top