పిసరంత.. పెసర

పిసరంత.. పెసర - Sakshi

  • రైతన్నను ముంచిన ఎపీ సీడ్స్‌

  • పైరు పెరిగినా..పంట పోయింది

     

  • జిల్లా వ్యాప్తంగా 719.8 క్వింటాళ్ల విత్తనాలు సరఫరా

     

  • 3,550 మంది రైతులు 15 వేల ఎకరాల్లో సాగు

     

  • రూ.12 కోట్లు నేలపాలు

  • కావలి : రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు సరఫరా చేసిన పెసర విత్తనాలు రైతులకు తీరని నష్టాలను మిగిల్చాయి. జిల్లా వ్యవసాయశాఖ రికార్డుల్లో రాసుకున్న లెక్కల ప్రకారం 6 వేల ఎకరాల్లో ప్రస్తుతం పెసర సాగు చేస్తున్నారు. కానీ వాస్తవంగా జిల్లాలో 15 వేల ఎకరాల్లో రైతులు పెసర సాగు చేశారు. వర్షాభావ పరిస్థితులు నెలకొని ఉందని, సాగుకు నీరు ఇవ్వలేమని.. ఆరుతడి పంటలు వేసుకోవాలని రైతులకు ప్రభుత్వం సెలవిచ్చింది. ఆరుతడి పంటలు సాగు చేసుకునే రైతులకు ఏపీ సీడ్స్‌ ద్వారా నాణ్యమైన పెసర విత్తనాలు ఇస్తామని కూడా ఘనంగా చెప్పుకుంది.



    నాణ్యత విషయంలో ప్రభుత్వంపై నమ్మకంతో రైతులు, పొలం కాగితాలు చేతబట్టుకొని వ్యవసాయ శాఖ కార్యాలయాల చుట్టూ తిరిగి విత్తనాలు కొనుగోలు చేశారు. కేజీ రూ. 60 చొప్పున 4 కేజీల విత్తనాల సంచిని రూ.240లకు కొనుగోలు చేశారు. వ్యవసాయశాఖ ద్వారా ఏపీ సీడ్స్‌ పెసర విత్తనాలు 719.8 క్వింటాళ్లు జిల్లాలోని 3,550 మంది రైతులకు అమ్మారు. ప్రభుత్వంపై నమ్మకం పెట్టుకొని పెసర సాగు చేసుకొన్న రైతులు నేడు నట్టేట మునిగారు. ఏపీ సీడ్స్‌ పెసర విత్తనాలు సక్రమంగా మొలకెత్తకుండా, మొలకెత్తినా ఎదుగుదల లేకుండా, ఎదిగినా కాయలు కాయకుండా.. ఇలా పలురకాలుగా ఇబ్బందులు ఎదురయ్యాయి. పైరుపై మమకారంతో రైతులు రెక్కల కష్టంతో పాటు అప్పులు చేసి మందులు పిచికారి చేసినా పైరు సక్రమంగా రాలేదు. ఇక లాభం లేదనుకొని రైతులు పెసర పైరుపై ఆశలు వదులుకుంటున్నారు. తాము నిండా మునిగిపోయామని ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం తమ గోడు ఆలకించి తగు సహాయం చేయాలని కోరుతున్నారు.



    పొలాలను పరిశీలిస్తాం   

    జిల్లాలో ఏపీసీడ్స్‌ పెసర విత్తనాల ద్వారా సాగుచేసిన రైతుల పొలాల వద్దకు శాస్త్రవేత్తల ను పంపుతాం. నేను కూడా పరిశీలిస్తున్నా. నివేదికలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. తదుపరి వచ్చే ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకుంటాం.  

    కె.హేమమహేశ్వరరావు,జాయింట్‌ డైరెక్టర్‌ జిల్లా వ్యవసాయశాఖ, నెల్లూరు



    ‘కౌలుకు 30 ఎకరాలు తీసుకొని వరిపైరు కోసం నార్లు పోశా. నీళ్లు లేక ఎండిపోయింది. వ్యవసాయ శాఖ ద్వారా నాణ్యమైన పెసర విత్తనాలు అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించే సరికి దానిని సాగు చేయాలని నిర్ణయించుకున్నా. ఏపీ సీడ్స్‌ పెసర విత్తనాలు కొనుగోలు చేసి సాగుకు దిగాను. పైరు ఎదుగులలో తేడా కనిపించడంతో అందిన కాడికి అప్పులు చేసి చాలా రకాల మందులు పిచికారీ చేశా. పైరు ఎదిగిందే కాని కాయలు లేవు. కాయలు కాసే అదను దాటిపోయింది. పైరు ఎండు ముఖం పట్టింది. వ్యవసాయ అధికారులకు చెబితే వచ్చి చూసి పైరు ఎండిపోయిందన్నారు. రూ.2.80 లక్షల అప్పుల పాలయ్యాను.’ – ఇది కావలి మండలంలోని గౌరవరంలో పెసర సాగు చేసిన వాకా శ్రీనివాసులు రెడ్డి అనే రైతు మనో వ్యథ.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top