కదిలిస్తే కన్నీళ్లే..

కదిలిస్తే కన్నీళ్లే.. - Sakshi


కరువుతో వలస వెళుతున్న పల్లె జనం

♦ ఎండిపోయిన పంటలు.. ఉపాధి హామీ పనులు చేపట్టని ప్రభుత్వం

♦ పొట్టచేతబట్టుకుని ముంబై, బెంగళూరు, హైదరాబాద్ తరలుతున్న వైనం

♦ పట్టణాల్లోనూ కూలీ పనులు అంతంతే

 

 సాక్షి నెట్‌వర్క్

 కరువుతో తల్లడిల్లుతున్న తెలంగాణ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు, కూలీలు వలసలు పోతున్నారు. కంట నీరు కక్కుకుంటూ ముసలి తల్లిదండ్రులను, భార్యాపిల్లలను ఉన్న ఊళ్లలో వదిలేసి పోయేవాళ్లు కొందరైతే... పొట్టచేతబట్టుకుని కుటుంబం మొత్తం వెళ్లేవాళ్లు మరికొందరు. సాధారణంగా వేసవి సమయంలో వలసలు వెళ్లే రైతు కూలీలు... ఈ సారి రబీ పంటలు వేయకముందే పట్టణాల బాట పడుతున్నారు. ఎక్కడ నిర్మాణ పనులుంటే అక్కడికి తరలి వెళుతున్నారు. ఈ దుస్థితిలో ఉపాధి హామీ పథకంతో ఆదుకోవాల్సిన ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తోంది. నామమాత్రానికి కరువు మండలాలను ప్రకటించి ఊరుకుంది. దీంతో వలసలు పెరుగుతూనే ఉన్నాయి.



 మహబూబ్‌నగర్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ జిల్లాల నుంచి బతుకుదెరువు కోసం పట్టణ ప్రాంతాలకు, పక్కనున్న రాష్ట్రాలకు తరలి వెళుతున్నారు. ఇక మహబూబ్‌నగర్ జిల్లాలోనైతే ఊళ్లకు ఊళ్లు ఇప్పటికే ఖాళీ అయ్యాయి. కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాద్, సిరిసిల్ల, వేములవాడ మండలాల్లో కరువు పరిస్థితి తీవ్రంగా ఉంది. హుస్నాబాద్‌లోని రేగొండ, మల్‌చెర్వుతండా, దుబ్బ తండా రైతులు పంటలు కళ్లముందే ఎండిపోతున్నా.. నిస్సహాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. మక్క, పత్తి పంటలు పూర్తిగా ఎండిపోయాయి. నీళ్లు లేక మొక్కజొన్న వాడిపోతుండటంతో పశువుల మేతగా ఉపయోగిస్తున్నారు. గ్రామాల్లో ఉపాధి లేక కరీంనగర్, వరంగల్ పట్టణాలకు వలస వెళుతున్నారు. నిజామాబాద్ జిల్లాలోనూ ఇదే పరిస్థితి. వ్యవసాయ పనులు, ఉపాధి పనుల జాడలేక పల్లెలను వదులుతున్నారు. అటు పట్టణ ప్రాంతాల్లోనూ సరిగా కూలి పనులు దొరకక పడరాని పాట్లు పడుతున్నారు.

 

 భార్యాపిల్లల్నీ వదిలేసి..

 మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేట మండలం పేరపళ్ల పంచాయతీ పరిధిలోని మీది తండాకు చెందిన శంకర్‌నాయక్ సింగిల్ విండో డెరైక్టర్. ఆయనకు ఆరుగురు కుమారులు. ఉన్న నాలుగెకరాల్లో వేసిన పెసర పంట ఎండిపోయింది. ఉన్న పశువులనూ అమ్ముకునే పరిస్థితి. దీంతో ముగ్గురు కుమారులు దశరథ్, సిద్ధానాయక్, బీక్యానాయక్ బతుకు దెరువు కోసం ముంబైకి వలస వెళ్లారు. మరో ముగ్గురు కుమారులు చిన్నాచితకా పనులు చేసుకుంటున్నారు.



  పేరపళ్ల తండాకు చెందిన చిన్న రామునాయక్ ఎకరా భూమిలో వేసిన పెసర పంట ఎండిపోయింది. దీంతో ఉపాధి కోసం ఇద్దరు కుమారులు భార్యాపిల్లలను ఇక్కడే వదిలి ముంబైకి వలస వెళ్లారు. ఇదే తండాకు చెందిన మరో రైతు పెద్దరాము నాయక్. మూడెకరాల్లో పెసర, కంది పంటలు వేశాడు. వానల్లేక అవి ఎండిపోవడంతో... ముగ్గురు కుమారులు వారి భార్యాపిల్లలతో ముంబైకి వలస వెళ్లారు.

 

 పోరగాండ్లను వదిలేసి వెళ్తున్నం

 ‘‘పంటలతో కళకళలాడాల్సిన పొలాలు బీళ్లుగా మారినయి. ఇద్దరు పోరగాండ్లను ఇంటికాడ వదిలేసి పట్నానికి వలస వెళుతున్నా. కరువు కాలం లో ఉపాధి పనులు పెట్టాల్సిన అధికారులు ఎక్కడున్నారో ఎమో?’’

 - రెడ్డి దస్తయ్య, రైతు, గాలిపూర్, నిజామాబాద్ జిల్లా

 

 ఊళ్లకు ఊళ్లే ఖాళీ..


 పాలమూరు రైతులు, కూలీలు పొట్టకూటి కోసం వలసలు వెళుతున్నారు. జిల్లాలోని నారాయణపేట డివిజన్‌లో కోయిల్‌కొండ, ధన్వాడ, దామరగిద్ద, ఊట్కూర్, మాగనూర్ మండలాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. నారాయణపేట మండలంలోని పేరపళ్ల తండాలు, కొల్లంపల్లి పరిధిలోని లింగంపల్లితండా, ఒండుచెలిమి తండా, మేకహన్మన్ తండా, కోయిలకొండ మండలంలోని వింజామూర్, రామన్నపల్లి తండా, జయనగర్‌తండా, రాజీవ్‌గాంధీతండా, ఎల్లారెడ్డిపల్లి, అంకిళ్ల, చందాపూర్‌ల నుంచి గిరిజనులు మూటమూల్లె సర్దుకుని మహారాష్ట్రలోని ముంబై, పుణె, నాగపూర్, కర్ణాటకలోని బెంగళూర్, హైదరాబాద్, విశాఖపట్నం, గుంటూరు ప్రాంతాలకు వలస వెళ్లారు.



దీంతో ఊళ్లకు ఊళ్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. మరోవైపు కూలీ పనులు కూడా సరిగా దొరకడం లేదు. ఇక గ్రామాల నుంచి వలస వచ్చిన వారిని గుంపు మేస్త్రీలు మోసం చేస్తున్నారు. దంపతులిద్దరికీ కలిపి నెలకు రూ. ఆరేడు వేలు ఇస్తామంటూ ముంబై, గుజరాత్, పూణె, బెంగళూర్, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు తరలించి పనులు చేయించుకుంటున్నారు. అంటే ఒక్కొక్కరికి రోజుకు రూ. వంద కూడా రాని పరిస్థితి.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top