బిల్లులో జాప్యం.. కుటుంబం ఆత్మహత్యాయత్నం

బిల్లులో జాప్యం.. కుటుంబం ఆత్మహత్యాయత్నం


 రెండేళ్లుగా బిల్లులు చెల్లించకపోవడంతో ఇటుకల వ్యాపారి మనస్తాపం

 భార్య, కొడుకుతో కలసి ప్రభుత్వ కార్యాలయం పైనుంచి దూకే  యత్నం

 ఖమ్మంలో ఘటన.. నిధులు రాగానే ఇచ్చేస్తామన్న అధికారులు


 

 ఖమ్మం: ఇందిరమ్మ బిల్లుల చెల్లింపుల్లో జాప్యం జరుగుతుండడంతో ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. సాక్షాత్తూ జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి కార్యాలయ భవనం పైనుంచి కిందకు దూకే యత్నం చేసింది. మంగళవారం ఖమ్మంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

 

ఎన్నిసార్లు తిరిగినా..

 వీఆర్‌పురం మండలం రేఖపల్లికి చెందిన చీమల వెంకటేశ్వర్లు ఇటుకల తయారీ వ్యాపారం చేస్తున్నారు. 2013-14 ఏడాదిలో ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకంలో లబ్ధిదారులకు ఇటుకలు సరఫరా చేసేందుకు అధికారులతో ఒప్పందం కుదుర్చుకున్నారు. రూ.11 లక్షల విలువ చేసే ఇటుకలను సరఫరా చేశారు. వీటి బిల్లులు వెంకటేశ్వర్లుకు అందించాల్సి ఉంది. అయితే రూ.6.33 లక్షలు చెల్లించిన గృహ నిర్మాణ శాఖ అధికారులు మిగిలిన డబ్బులు చెల్లించడం లేదు. దీనిపై వెంకటేశ్వర్లు పలుమార్లు భద్రాచలం డీఈ నారాయణ, ఇతర అధికారులను కలిసినా ఫలితం లేకుండా పోయింది.


మంగళవారం వెంకటేశ్వర్లు తన భార్య సరోజ, కొడుకు కృష్ణార్జున్‌తో కలసి మరోసారి జిల్లా గృహ  నిర్మాణ శాఖ అధికారి కార్యాలయానికి వచ్చారు. బిల్లుపై అడగ్గా.. అధికారులు స్పందించలేదు. దీంతో మనస్తాపం చెందిన వెంకటేశ్వర్లు.. భార్య, కొడుకుతో కలసి కార్యాలయ భవనం పైనుంచి దూకే ప్రయత్నం చేశారు. కుమారుడు కృష్ణార్జున్ వెంట తీసుకువచ్చిన కిరోసిన్‌ను ఒంటిపై పోసుకుని నిప్పంటించుకునేందుకు ప్రయత్నించాడు. విషయం తెలుసుకున్న అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తక్షణమే అక్కడికి చేరుకున్న పోలీసులు ముగ్గురిని స్టేషన్‌కు తరలించి వారిపై ఆత్మహత్యాయత్నం కేసు నమోదు చేశారు.

 

 బిల్లులు రాగానే చెల్లిస్తాం

 వెంకటేశ్వర్లుకు బిల్లు చెల్లించాల్సిన విషయం వాస్తవమే. రూ.11 లక్షలకుగాను రూ.6.33 లక్షలు చెల్లించాం. మిగిలిన డబ్బులు చెల్లించేందుకు ప్రయత్నిస్తున్నాం. బిల్లుల్లో జాప్యం వల్లే చెల్లించలేకపోయాం. ప్రభుత్వం నుంచి నిధులు రాగానే డబ్బులు ఇస్తాం.    - వైద్యం భాస్కర్, పీడీ గృహ నిర్మాణశాఖ

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top