బాబోయ్‌ దొంగనోట్లు!


* మంగళగిరిలో పల్నాడు ముఠా

చేతులు మారుతున్న లక్షలాది రూపాయలు

చిట్స్‌.. కాల్‌మనీ వ్యాపారులే దళారులు

బలవుతున్న సామాన్యులు

 

మంగళగిరి : పల్నాడు ప్రాంతం నుంచి దొంగనోట్లను విచ్చలవిడిగా జిల్లా మొత్తం చెలామణి చేస్తున్నారా.. ఈ ముఠాతో మంగళగిరికి చెందిన బడా కాల్‌మనీ వ్యాపారులు, చిట్టీల నిర్వాహకులు, హోల్‌సేల్‌ వర్తకులు చేతులు కలిపి కోట్లు గడిస్తున్నారా.. ప్రస్తుతం ఇదే అంశంపై పట్టణంలో జోరుగా చర్చ సాగుతోంది. మంగళగిరికి చెందిన వడ్డీ వ్యాపారి ఏడాది కిందట చిట్స్‌ వేసి, కాల్‌మనీ వ్యాపారం చేసి భారీగా నష్టపోయి ఐపీ పెడుతున్నాడనే ప్రచారం విస్తృతంగా జరిగింది. కానీ ఏడాది తిరక్కుండానే అదే వ్యాపారి లాభాల బాటలో పయనించడమే కాకుండా మూడంతస్తుల భవానాలు నిర్మించి అద్దెలకిచ్చే స్థాయికి ఎదగడంతో స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. దీన్నిబట్టి ఈ వ్యాపారికి కూడా పల్నాడు దొంగనోట్ల ముఠాతో సంబంధాలున్నట్లు తెలుస్తోంది.

 

దొంగనోట్ల మార్పిడి ఇలా..

మంగళగిరి పట్టణంలో యాభై లక్షల రూపాయల చిట్స్‌ను అన ధికారికంగా నిర్వహిస్తుండగా.. కాల్‌మనీ వడ్డీ వ్యాపారం య«థేచ్ఛగా జరుగుతోంది. వీరితో జతకట్టిన దొంగనోట్ల తయారీదారులు భారీగా దొంగనోట్లను మార్చి డబ్బు సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది. రూ. 5 లక్షల నుంచి రూ. 50æలక్షల వరకు చిట్‌లు పాడేవారే వీరికి బలవుతుండడం విశేషం. ఎంతో నమ్మకంతో చిట్స్‌వేసి  పాట పాడుకున్న అనంతరం పాటదారుడికి వారు చెల్లించే నగదులో దొంగనోట్లను చేర్చి మారుస్తుండడం గమనార్హం. రూ. 50 లక్షలు పాడుకుంటే అతడికి ఇచ్చే నగదు కట్టల్లో కొన్ని దొంగనోట్లను పెడుతున్నారు. కొత్త రాజధాని కావడంతో రియల్‌ వ్యాపారం జోరుగా సాగుతుండగా అనేకమంది కాల్‌మనీదారులను ఆశ్రయిస్తున్నారు. కాల్‌మనీలోను లక్షలు ఇచ్చే సమయంలో నగదు కట్టల్లో దొంగనోట్లు చేర్చుతున్నారని విశ్వసనీయ సమాచారం. నగదు తీసుకునేవారు వాటిని గుర్తించే అవకాశం లేకుండా ముఠా సభ్యులు చాలా తెలివిగా మోసగిస్తున్నారు. పెద్ద మొత్తంలో నగదు ఇవ్వాల్చివచ్చినప్పుడు ఒక గంట ఆగి వస్తే రెడీ చేసి ఇస్తామని చెప్పి పంపుతున్నారు. తీరా వారు వచ్చేసరికి దొంగనోట్లను చేరి కట్టలు కట్టి ఇస్తున్నారు. నగదు ఎక్కువగా ఉండడంతో తిరిగి లెక్కపెట్టకుండా నమ్మకంతో తీసుకెళుతున్నారు. వ్యాపారులు మాత్రం మిషన్‌లో లెక్కపెట్టి తీసుకుంటుండడం విశేషం. చిట్స్‌ పాడి తీసుకున్న వారు, కాల్‌మనీ తీసుకున్న వారు  బ్యాంక్‌లో నగదు చెల్లించడానికి వెళ్లినప్పుడు అడ్డంగా బుక్కవుతున్నారు. దొంగనోట్లను గుర్తించిన బ్యాంకు అధికారులు చింపేస్తున్నారు.

 

మిన్నకుండిపోతున్న బాధితులు

గత నెల రోజుల కాలంలో ఐదుగురు బాధితులు దొంగనోట్ల పంపిణీదారుల బారిన పడ్డారు. అధికంగా నష్టపోయి పోలీసులకు ఫిర్యాదుచేసినా, బహిరంగంగా చెప్పినా తాము చేసే వ్యాపారాలపై కూపీ లాగడంతో పాటు మరోసారి నగదు ఇవ్వరనే భయంతో మిన్నకుండిపోతున్నట్లు సమాచారం. కొంత కాలంగా దొంగనోట్లు మరీ ఎక్కువగా మార్కెట్లో చెలామణి కావడం సామాన్యులను కలవరపరుస్తోంది. అధికారులు పటిష్ట నిఘా ఏర్పాటు చేసి దొంగనోట్ల ముఠా ఆటకిట్టించి సామాన్యులు బలవకుండా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

 

ఫిర్యాదులు రాలేదు..

దొంగనోట్లు అంటగడుతున్నారనే విషయమై ఇంతవరకు మాకు ఎవరి నుంచి ఫిర్యాదు రాలేదు. ఒకవేళ అలా మోసపోయిన బాధితులు ఎవరైనా ఉంటే మమ్మల్ని కలిసి ఫిర్యాదు ఇవ్వొచ్చు. వారి పేరు బయటకు రాకుండా రహస్యంగా విచారించి దొంగనోట్ల చెలామణీదారుల ఆటకట్టిస్తాం.

– జి.రామాంజనేయులు, నార్త్‌ జోన్‌ డీఎస్పీ 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top