దొంగ బిల్లులే..!

దొంగ బిల్లులే..!

 యనమలకుదురు  గ్రామ పంచాయతీలో నకిలీ బిల్లు 

 యనమలకుదురు ‘పంచాయితీ’ అక్రమాల్లో కొత్త కోణం

 బిల్లులో పేర్కొన్న సంస్థ లేదని తేల్చిన డీసీటీవో

 

పెనమలూరు :

యనమలకుదురు గ్రామ పంచాయతీలో నకిలీ బిల్లులతో నిధులు డ్రా చేసినట్లు వస్తున్న ఆరోపణలకు బలం చేకూరుతోంది. పంచాయతీలో చూపిస్తున్న బిల్లుల్లో పేర్కొన్న వ్యాపార సంస్థలేమీ లేవని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు ధ్రువీకరించారు. దీంతో నకిలీ బిల్లులతో నిధులు డ్రా చేసినట్లు స్పష్టమవుతోంది. ఇందుకు సంబంధించిన వివరాలు... యనమలకుదురు పంచాయతీ కార్యదర్శిగా రామకోటేశ్వరరావు 2015లో పని చేశారు. ఆ సమయంలో పారిశుద్ధ్య నిర్వహణ, విద్యుత్‌ పరికరాల కొనుగోలు, వాటర్‌ వర్క్స్, ఇతర పనులకు సంబంధించి నకిలీ బిల్లులు పెట్టి రూ.50లక్షలకు పైగా నిధులు డ్రా చేశారు. పంచాయతీ పాలకవర్గ ఆమోదం లేకుండానే ట్రెజరీ నుంచి కాకుండా నేరుగా ఈ నిధులు డ్రా చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై అప్పట్లో ‘సాక్షి’లో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. దీంతో విచారణ చేసిన ఉన్నతాధికారులు.. నిధులు డ్రా చేసే విషయంలో నిబంధనలు పాటించలేదని గుర్తించి రామకోటేశ్వరరావును సస్పెండ్‌ చేశారు. అయితే నకిలీ బిల్లులపై మాత్రం విచారణ చేయలేదు. అక్రమంగా డ్రా చేసిన సొమ్మును రికవరీ చేయలేదు. ఈ అవనితీ వ్యవహారంలో అధికార పార్టీ నేతలు, పలువురు అధికారుల పాత్ర కూడా ఉందని, అందువల్లే కార్యదర్శి సస్పెన్షన్‌తో సరిపెట్టారనే ఆరోపణలు వచ్చాయి.  

 

స.హ.చట్టం దరఖాస్తుతో... 

విజయవాడలోని భావన్నారాయణ వీధిలో డోర్‌ నంబర్‌ 45–3–44 /2ఏలో నిఖిత ఎంటర్‌ప్రైజెస్‌ పేరుతో రూ.15లక్షల విలువైన పలు రకాల మెటీరియల్‌ తీసుకున్నట్లు పంచాయతీలో బిల్లులు చూపించారు. ఈ బిల్లులపై ఏపీ జీఎస్‌టీ నంబర్‌ 1842 ఆర్సీ నంబర్‌ వీజే2/02/865 అని ఉంది. ఈ క్రమంలో పంచాయతీ లెక్కల్లో చూపిస్తున్న బిల్లులు అందించిన వ్యాపార సంస్థల వివరాలు ఇవ్వాలని యనమలకుదురు ఉప సర్పంచ్‌ ముప్పవరపు నారాయణరావు సమాచార హక్కు చట్టం ద్వారా వాణిజ్య పన్నుల శాఖ అధికారులను కోరారు. దీనిపై విచారణ చేసిన విజయవాడ డీసీటీవో నిఖిత ఎంటర్‌ప్రైజెస్‌ పేరుతో అసలు తమ పరిధిలో వ్యాపార సంస్థలు లేవని ధ్రువీకరిస్తూ బదులిచ్చారు. ఉయ్యూరులో మంజునాథ ఎంటర్‌ ప్రైజెస్‌ పేరుతో కూడా రూ.10 లక్షల వరకు బిల్లులు ఉన్నాయి. అక్కడి డీసీటీవో కూడా మంజునాథ ఎంటర్‌ప్రైజెస్‌ పేరుతో ఎటువంటి వ్యాపార సంస్థ లేదని తెలిపారు. ఇదే తరహాలో మరికొన్ని సంస్థల పేరుతో బిల్లులు పెట్టి నిధులు డ్రా చేసినట్లు సమాచారం. ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించి నిధుల రికవరీకి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top