చూపు పదిలం...

చూపు పదిలం... - Sakshi

  • నేత్రదానంతో ఇద్దరికి చూపు 

  • సర్వేంద్రియానాం నయనం ప్రధానం

  • అంధులకు కంటి చూపును ప్రసాదిద్దాం

  • నేటినుంచి జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు

  •  కోల్‌సిటీ : ‘సర్వేంద్రియానాం నయనం ప్రధానం..’ అన్నారు పెద్దలు. అందమైన సృష్టిని చూడాలంటే కంటిచూపే ముఖ్యం. చీకట్లో మగ్గుతున్నవారెందరో కంటిచూపు కోసం ఎదురుచూస్తున్నారు. మరణించిన తర్వాత నేత్రాలు వృథాగా పోకుండా ఉండేందుకు అందరూ నేత్రదానం చేయాల్సిన అవసరముంది. ప్రజల్లో నేత్రదానంపై అనేక స్వచ్ఛంద సంస్థలు అవగాహన కల్పిస్తున్నాయి. ఏటా ఆగస్టు 25నుంచి జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు నిర్వహిస్తున్నారు.

     

    ఒకరి దానం.. ఇద్దరికి చూపు

    నేత్రదానం చేయడానికి వయసుకు పరిమితులు లేవు. ఒకరుదానం చేయడంద్వారా ఇద్దరికి కంటిచూపు వస్తుంది. నేత్రదానం చేస్తున్నట్లు ప్రకటించినా, ప్రకటించకపోయినా కళ్లుదానం చేయవచ్చు. నేత్రదానం చేయాలనుకుంటే స్వచ్ఛందసంస్థలకు, ఐబ్యాంకులకు సమాచారం ఇవ్వాలి. వ్యక్తిమరణించిన 6 గంటలలోపు నేత్రాలు తీయాలి. ఐబ్యాంకు డాక్టర్‌కానీ, శిక్షణ పొందిన టెక్నీషియన్‌ మాత్రమే స్టెరైల్‌ పద్ధతి ద్వారా కార్నియాను బయటకుతీస్తారు. మృతదేహం ఉంచిన చోటుకే వీరు వచ్చి 15నుంచి 20 నిమిషాల్లో కళ్లు తీసుకుంటారు. మృతదేహం దగ్గర ఫ్యాన్లు ఆపేయాలి. తడిపిన దూదిని, ఐస్‌తోపాటు మూసిన కళ్లపై ఉంచాలి. తలకింద తలగడ పెట్టి ఎత్తుగా ఉండేలా చూడాలి. దీని ద్వారా టిఫ్యూ తడిగా ఉంచేలా సహాయపడుతుంది.

     

    నేత్రదానం కోసం పనిచేసే సంస్థలు

    –ఐ బ్యాంక్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా అనే సంస్థ నేత్రదానం కోసం 1919/1053 టోల్‌ఫ్రీ నంబర్లను ఏర్పాటుచేసింది.

    –ఉదారకంటి ఆస్పత్రి,రేకుర్తి ఫోన్‌:0878–2285318, 2253131

    –నేత్రదాన  సేకరణ కేంద్రం, జిల్లా ప్రధానఆస్పత్రి, కరీంనగర్‌ 0878–2240337

    –ఎల్వీ ప్రసాద్‌ ఐ బ్యాంక్, హైదరాబాద్‌ 9849545822. 040–23548266

    –వాసన్‌ ఐ బ్యాంక్, సికింద్రాబాద్‌. ఫోన్‌: 7799281919. 040–43400000

    –లయన్‌ డాక్టర్‌ కోల అన్నారెడ్డి, కరీంనగర్‌ లయన్స్‌ క్లబ్‌ నేత్ర వైద్యశాల ట్రస్ట్‌బోర్డు సభ్యుడు 9849059538

    –కె.రాజేందర్, రామగుండం లయన్స్‌ క్లబ్‌నేత్రాల సేకరణ ఇన్‌చార్జి 7396295999

    –టి.శ్రవణ్‌కుమార్, సదాశయఆర్గాన్‌ ఫౌండేషన్, టీ2–363, ౖయెటింక్లయిన్‌కాలనీ, గోదావరిఖని 9948609591. 

     

    నేత్రదానం చేయాలి 

    –డి.నిరంజన్, నేత్ర వైద్యనిపుణులు

    మరణించాక కళ్లు మట్టిలో కలిసిపోకుండా, మంటల్లో కాలిబూడిద కాకుండా నేత్రదానం చేయండి. కొన్ని దేశాల్లో మృతదేహాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని అవయవాలను మరొకరిని అమర్చుతుంది. మనప్రభుత్వాలు కూడా ఇందుకోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలి. మరణించినా మరికొందరి జీవితాల్లో వెలుగులు నింపడానికి అందరూ నేత్రదానం కోసం ముందుకురావాలి.

     

    190 నేత్రాలను స్వీకరించాం

    –టి.శ్రవణ్‌కుమార్, గోదావరిఖని 

    మేము స్థాపించిన సదాశయ ఆర్గాన్‌ ఫౌండేషన్‌ ద్వారా 250కు పైగా కార్యక్రమాలు చేపట్టడంతో నేత్ర,అవయవదానంపై వేలాది మంది ముందుకొచ్చారు. ఇప్పటివరకు 190 నేత్రదానాలు స్వీకరించి వాటిని సకాలంలో ఆస్పత్రికి చేరవేశాం. ప్రతీ మండల ప్రభుత్వ ఆస్పత్రిలో నేత్రాలు సేకరించడానికి, ప్రత్యేకశిక్షణ పొందిన టెక్నీషియన్‌ను నియమించాలి.

     

     అంధుల కంటిపాప 

    కరీంనగర్‌ కల్చరల్‌: కంటి చూపు ఉంటేనే ఈ సృష్టిలోని అందాన్ని చూడగలం. అలాంటి కళ్లు లేకుంటే జీవితమే అంధకారం. అంధులకు చూపు ప్రసాదించడంలో తన వంతు కృషి చేస్తున్నారు కోల అన్నారెడ్డి. జిల్లా కేంద్రంలోని కాపువాడకు చెందిన అన్నారెడ్డి 1990లో నాగపూర్‌ విశ్వవిద్యాలయం నుంచి సివిల్‌ ఇంజినీర్‌లో పట్టా పుచ్చుకున్నారు. చదివింది ఇంజినీరింగ్‌ అయినా మెరుగైన సమాజంకోసం తపనపడుతున్నారు. లయన్స్‌ క్లబ్‌ నేత్ర వైద్యశాల ట్రస్టుబోర్డు సభ్యుడిగా, అలయన్స్‌ క్లబ్‌ ఉప జిల్లాగవర్నర్‌గా, రెడ్‌క్రాస్‌ సొసైటీ మండలకార్యదర్శిగా అన్నారెడ్డి అనేక సేవా,సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఉచితవైద్య శిబిరాలు, నేత్రశిబిరాలు, దంత వైద్యశిబిరాలు, పల్స్‌పోలియో కార్యక్రమాలు  ఏర్పాటుచేశారు.  15 మెగారక్తదాన శిబిరాలు నిర్వహించి 1,100యూనిట్ల రక్తాన్ని బ్లడ్‌ బ్యాంకులకు అందజేశారు. 3,100వేల నేత్రాలను సేకరించారు. 6వేలమంది నుంచి నేత్రదాన అంగీకర పత్రాలను రాయించారు. చూపులేక దుర్భర  జీవితాలు గడుపుతున్న అన్నార్థులకు అండగా నిలుస్తున్నారు.
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top