కోనేరు ఇకలేరు.

కోనేరు ఇకలేరు. - Sakshi

  • అనారోగ్యంతో కన్నుమూత

  • నేడు బాలకష్ణ, లోకేష్‌ రాక

  • కొత్తగూడెం :అనారోగ్యంతో బాధపడుతున్న టీడీపీ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి కోనేరు నాగేశ్వరరావు(78) కొత్తగూడెంలోని శ్రీనగర్‌ కాలనీలో గల తన స్వగృహంలో శుక్రవారం ఉదయం కన్నుమూశారు. జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న కోనేరు మృతి ఇక్కడి ప్రజలను కలచివేసింది. 1937, ఆగస్టు 30న కృష్ణా జిల్లా మారేడుమాక గ్రామంలో అచ్యుతరామయ్య, సీతమ్మ దంపతులకు రెండో సంతానంగా జన్మించిన కోనేరు నాగేశ్వరరావు.. 1954లో ఫారెస్టు కాంట్రాక్టర్‌గా కొత్తగూడెం వచ్చి.. ఇక్కడే స్థిరపడ్డారు. 1959లో ధనలక్ష్మిని వివాహం చేసుకున్న ఆయనకు కూతురు ఉషారాణి, కొడుకులు పూర్ణచందర్‌రావు, సత్యనారాయణ ఉన్నారు.

    1982 నుంచి టీడీపీలోనే...

    1982లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ పిలుపు మేరకు టీడీపీలో చేరిన ఆయన.. 1983లో తొలిసారిగా కొత్తగూడెం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తర్వాత 1985, 1994లో ఇదే నియోజకవర్గం నుంచి శాసన సభ్యుడిగా గెలిచారు. 1988లో ఎన్టీఆర్‌ కేబినెట్‌లో చిన్న నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారు. 1991 నుంచి 1994 వరకు టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా సేవలందించారు. 1985లో భద్రాచలం ట్రస్టుబోర్డు చైర్మన్‌గా, పాల్వంచ ఏపీ స్టీల్స్‌ చైర్మన్‌గా పనిచేశారు.

    లయన్స్‌ క్లబ్‌ గవర్నర్‌గా...

    సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుండే కోనేరు.. లయన్స్‌ క్లబ్‌ కార్యక్రమాల్లో చురుగ్గా పనిచేశారు. 13 ఏళ్లుగా లయన్స్‌ క్లబ్‌ మల్టిపుల్‌ కౌన్సిల్‌ కన్వీనర్‌గా సేవలందిస్తున్న ఆయన.. ప్రస్తుతం లయన్స్‌ క్లబ్‌ 324 డిస్ట్రిక్ట్‌ గవర్నర్‌గా ఉన్నారు. 1981 నుంచి క్లబ్‌ కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్నారు.

    మంత్రి తుమ్మల, ఎమ్మెల్యేల సంతాపం

    కోనేరు నాగేశ్వరరావు మరణవార్త తెలుసుకున్న రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కొత్తగూడెంలోని కోనేరు స్వగృహానికి వెళ్లి సంతాపం తెలిపారు. కోనేరు కుమారులు పూర్ణచందర్‌రావు, సత్యనారాయణను ఓదార్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కోనేరు నాగేశ్వరరావు మృతి జిల్లా రాజకీయాలకు తీరని లోటని అన్నారు. జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు జలగం వెంకటరావు, పువ్వాడ అజయ్‌కుమార్, తాటి వెంకటేశ్వర్లు, బానోతు మదన్‌లాల్, సున్నం రాజయ్య, కోరం కనకయ్య, సిర్పూర్‌ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, జెడ్పీ చైర్‌పర్సన్‌ గడిపల్లి కవిత, డీసీసీబీ చైర్మన్‌ మువ్వా విజయ్‌బాబు, సీపీఐ జాతీయ నాయకుడు పువ్వాడ నాగేశ్వరరావు, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు కొండబాల కోటేశ్వరరావు, కూనంనేని సాంబశివరావు, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు తుల్లూరి బ్రహ్మయ్య, టీడీపీ పాలేరు, వైరా నియోజకవర్గాల ఇన్‌చార్జిలు మద్దినేని బేబి స్వర్ణకుమారి, మాళోతు రాందాస్‌నాయక్, కాంగ్రెస్‌ నాయకుడు ఎడవల్లి కృష్ణ, సౌత్‌ సెంట్రల్‌ రైల్వే వినియోగదారుల సంక్షేమ కమిటీ సభ్యుడు జేవీఎస్‌.చౌదరి తదితరులు కోనేరు భౌతికకాయాన్ని సందర్శించి.. నివాళులర్పించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు ఉండేటి యేసుపాదం కోనేరు భౌతికకాయాన్ని సందర్శించి.. సంతాపం తెలిపారు. ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫోన్‌ ద్వారా కోనేరు కుటుంబ సభ్యులను పరామర్శించారు. మాజీ ఎంపీ, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నామా నాగేశ్వరరావు ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు.

    నేడు ‘గూడెం’ బంద్‌కు పిలుపు

    మాజీ మంత్రి కోనేరు నాగేశ్వరరావు మృతికి సంతాపంగా శనివారం నియోజకవర్గ బంద్‌కు అఖిలపక్షం పిలుపునిచ్చింది. ప్రైవేటు విద్యా సంస్థలు స్వచ్ఛందంగా బంద్‌ పాటించాలని తెలంగాణ ప్రైవేటు ఐటీఐ అసోసియేషన్‌ అధ్యక్షుడు జేవీఎస్‌.చౌదరి కోరారు. పట్టణంలోని వ్యాపార, వాణిజ్య సముదాయాలు బంద్‌ పాటించాలని మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు ఉండేటి యేసుపాదం, కాంగ్రెస్‌ నాయకుడు ఎంఏ.రజాక్‌ పిలుపునిచ్చారు.

    రేపు పెనగడపలో అంత్యక్రియలు

    కోనేరు నాగేశ్వరరావు అంత్యక్రియలు కొత్తగూడెం మండలం పెనగడపలోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో ఆదివారం నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

     

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top