ఏటా 1.7 లక్షల రొమ్ము క్యాన్సర్ కేసులు

ఏటా 1.7 లక్షల రొమ్ము క్యాన్సర్ కేసులు


సాక్షి, హైదరాబాద్: దేశంలో ఏటా కొత్తగా 1.7 లక్షల రొమ్ము క్యాన్సర్ కేసులు నమోదు అవుతున్నట్లు అసోసియేషన్ ఆఫ్ గైనకాలజిక్ ఆంకాలజిస్ట్ ఆఫ్ ఇండియా(ఏజీఓఐ)- 2015 మూడు రోజుల సదస్సు ప్రకటించింది. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల పట్టణ ప్రాంతాల్లో ప్రతి లక్ష మంది మహిళల్లో 35, గ్రామీణ ప్రాంతాల్లో 8 మంది రొమ్ము క్యాన్సర్‌కు గురవుతున్నట్టు వెల్లడించింది. మహిళల ఆరోగ్యంపై ప్రభుత్వం ఇప్పటికైనా అప్రమత్తంగా వ్యవహరించకపోతే భవిష్యత్తులో ఈ సంఖ్య భారీగా పెరుగుతుందని హెచ్చరించింది. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి, అపోలో గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ సంయుక్తాధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సదస్సు శుక్రవారం హోటల్ మారియట్‌లో ప్రారంభమైంది.



పది మంది అంతర్జాతీయ, 100 మంది జాతీయ ఫ్యాకల్టీలు... గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ శస్త్రచికిత్సల్లో వస్తున్న అధునాతన మార్పలు, మెళకువలను లైవ్ సర్జరీల ద్వారా ఇందులో వివరించారు. 400 మంది వైద్య నిపుణులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏజీఓఐసీఓఎన్ ఆర్గనైజింగ్ చైర్మన్  టి.సుబ్రహ్మణ్యేశ్వర్‌రావు, ఏజీఓఐ అధ్యక్షురాలు నీరజాభట్ల, కార్యదర్శి రమాజోషి, స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ క్లినికల్ చీఫ్ శశికాంత్ లేలే మాట్లాడారు.



 తగ్గిన సర్వైకల్ క్యాన్సర్...

 గతంతో పోలిస్తే ప్రస్తుతం సర్వైకల్ క్యాన్సర్ తగ్గిందని నిపుణులు అభిప్రాయపడ్డారు. వ్యక్తిగత శుభ్రతపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించడం, అవగాహన పెరగడం, యుక్త వయసు వచ్చిన తర్వాతే పెళ్లి చేసుకోవడమే ఇందుకు కారణమన్నారు. శరీరాకృతి దెబ్బతింటుందనే అపోహలతో పిల్లలకు పాలివ్వక పోవడంవల్ల అనేక మంది మహిళలు 30 ఏళ్లకే రొమ్ము క్యాన్సర్ బారిన పడుతున్నారన్నారు. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లోనే ఈ సంఖ్య అధికంగా ఉందన్నారు. ముందస్తు వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల క్యాన్సర్ నుంచి కాపాడుకోవచ్చన్నారు. జాతీయ టీకాల కార్యక్రమంలో హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ను చేర్చి బాలికలు భవిష్యత్తులో క్యాన్సర్ బారిన పడకుండా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 30 ఏళ్లు దాటిన ప్రతి మహిళా నెలకోసారి రొమ్ము సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకోవాలని, మార్పులుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top