లోపాలు సవరిస్తేనే సుపరిపాలన

లోపాలు సవరిస్తేనే సుపరిపాలన - Sakshi


మాజీ ఎన్నికల ప్రధాన కమిషనర్ టీఎస్ కృష్ణమూర్తి

 


 సాక్షి, హైదరాబాద్: ప్రజలు ఎన్నుకున్న నాయకుల తీరును బట్టే పరిపాలనా విధానం ఆధారపడి ఉం టుందని మాజీ ఎన్నికల ప్రధాన కమిషనర్ టీఎస్ కృష్ణమూర్తి వ్యాఖ్యానించారు. ‘హమ్‌సబ్ హిందూస్థాన్ ట్రస్ట్’ ఆధ్వర్యంలో ‘‘సుపరిపాలనలో ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర’’ అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. ‘వ్యవస్థలో ఉన్న లోపాలను సవరిస్తేనే సుపరిపాలన అందుతుంది. దేశంలో రిజర్వేషన్ల విధానంపై సమీక్ష, గ్రూప్-1 వంటి మొదటి స్థాయి పోస్టుల్లో ఉన్న వయసు మినహాయింపు తదితర అంశాలపై చర్చ జరగాలి.  అవినీతిని అరికట్టేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రయోజనం ఉండటంలేదు.



రాజకీయ పార్టీలకు అందజేసే నిధుల విషయంలో ఒక విధానాన్ని అవలంభించాలి. లోక్‌పాల్ చట్టం తీసుకురావాలి. జాతీయ స్థాయిలో ఎన్నికల ఫండ్ ఏర్పాటు చేసి దాని ద్వారా అన్ని పార్టీలకు నిధులను పంపిణీ చేయాలి. అప్పుడే అధికారంలోకి వచ్చే పార్టీలు వారి అనుకూల కంపెనీలకు లబ్ధి చేకూర్చే విధానాలకు అడ్డుకట్ట పడుతుంది. ఎన్నికల విధానంలోనూ మార్పులు రావాలి. అలాగే... దేశంలో అధికార వికేంద్రీకరణ జరగాలి. పెద్దపెద్ద సంస్థలన్నీ ఢిల్లీలోనే ఉన్నాయి. కొన్నింటిని నూతనంగా రూపొందుతున్న స్మార్ట్ సిటీలకు తరలించాలి. రాజకీయ నాయకుల చేతుల్లో ఉన్న పోలీసు వ్యవస్థను సంస్కరించాలి.



ఆర్థికరంగ లోటు పాట్లు సరిచేయాలి. సత్యం కుంభకోణంలో అవలంభించిన విధానాలను కింగ్‌ఫిషర్ విషయంలో ఎందుకు అమలు చేయలేదు? న్యాయవ్యవస్థలోనూ మార్పులవసరం’ అని కృష్ణమూర్తి అన్నారు. బిహార్‌లో మొదటి విడుత ఎన్నికల్లో పోటీ చేస్తు న్న అన్ని పార్టీల అభ్యర్థులు నేరచరిత్ర కలిగినవారేనని తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ చెప్పారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top