అప్పణంగా భోంచేశారు!


  • జేఎన్‌టీయూలో మెస్‌ బిల్లుల మాయాజాలం

  • లెక్కల్లో చూపకుండా రూ.8 లక్షలు స్వాహా

  • కలికిరి కళాశాల విద్యార్థులతో చలానాకు బదులు నగదు రూపంలో వసూలు

  • హాస్టల్‌ ఖాతాకు జమ చేయకుండా దారి మళ్లించిన వైనం!

  • సాఫ్ట్‌వేర్‌ రూపకల్పనకు అనధికారికంగా రూ.4లక్షల చెల్లింపు!!

  •  


    జేఎన్‌టీయూ(ఏ)కు కానిస్టిట్యూట్‌ కళాశాలగా కలికిరి ఇంజినీరింగ్‌ కళాశాల ఉంది. అక్కడ ల్యాబ్‌ సదుపాయాలు, పర్మినెంట్‌ ఫ్యాకల్టీ లేకపోవడంతో ప్రయోగాలు చేసుకోవడానికి అనంతపురం క్యాంపస్‌ ఇంజినీరింగ్‌ కళాశాలకు విద్యార్థులు వస్తుంటారు. ఏడాదిలో నాలుగు పర్యాయాలకు పైగా ఇక్కడి ల్యాబ్‌లను వారు ఉపయోగించుకుంటారు. దీంతో క్యాంపస్‌ కళాశాల హాస్టల్‌లోనే వారికి వసతి ఏర్పాట్లు చేస్తుంటారు. సాధారణంగా ఏ విద్యార్థి అయినా మెస్‌ బిల్లు చలానా రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. కానీ కలికిరి ఇంజినీరింగ్‌ కళాశాల విద్యార్థుల నుంచి హాస్టల్‌ అధికారులు నేరుగా మెస్‌ బిల్లులు కట్టించుకున్నారు. కానీ ఆ నగదు ఏ ఖాతాల్లోనూ చూపలేదు. కలికిరి ఇంజినీరింగ్‌ కళాశాల విద్యార్థుల నుంచి రూ.8లక్షలకు పైగానే నగదు కట్టించుకున్నట్లు తెలుస్తోంది. ఎంత మంది విద్యార్థులు భోజనం చేస్తారో వారందరి మీద మెస్‌ బిల్లు సమానంగా వేస్తారు. వసూలు చేసిన రూ.8లక్షలను హాస్టల్‌ ఖాతాకు చేర్చకపోవడంతో ఆ భారం కాస్తా స్థానిక కళాశాల ఇంజినీరింగ్‌ విద్యార్థులపై పడింది.


    వ్యూహంతో విద్యార్థులు బలి


    సాధారణంగా ఎవరైనా విద్యార్థి వరుసగా మూడు రోజులు మెస్‌కు గైర్హాజరయితే సెలవులో ఉన్నట్లు గుర్తించాలి. సెలవు రోజులకు మెస్‌ బిల్లు వేయకూడదు. కానీ ఇందుకు భిన్నంగా నెల రోజులు సెలవులో ఉన్న విద్యార్థులకు సైతం మెస్‌ బిల్లు వేశారు. దీంతో మెస్‌కు నిరంతరంగా హాజరైన విద్యార్థులకు బిల్లు తక్కువగా వచ్చింది. బిల్లు తక్కువగా వచ్చిన అంశాన్ని ముమ్మర ప్రచారం చేస్తూ హాస్టల్స్‌లో అంతా సజావుగా ఉందన్న భ్రమ కల్పించేందుకు ప్రయత్నించినట్లు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.


    ఇండెంట్‌కు.. బిల్లులకు భారీ వ్యత్యాసం


    మెస్‌లో నిత్యావసర సరుకుల కొనుగోలుకు సంబంధించి ఇండెంట్‌లో నిర్ధారించిన ధరకు, కొనుగోలు బిల్లుకు మధ్య భారీ వ్యత్యాసం ఉంది. జనవరి 24న ఇండెంట్‌లో ఉల్లిగడ్డలు కిలో రూ.14, మిర్చి రూ.10గా నిర్ధారించారు. కానీ బిల్లులో మాత్రం కిలో ఉల్లిగడ్డలు రూ.20,  మిర్చి రూ.13గా చూపించారు. అంటే కిలోకు ఆరు రూపాయలు అదనంగా బిల్లు వేశారు. తిరిగి జనవరి 27న ఇండెంట్‌లో ఉల్లిగడ్డలు రూ.13, ఆలూ రూ.10,  కానీ బిల్లులో ఉల్లి రూ.20. ఆలూ రూ.25గా బిల్లు వేశారు. బిల్లులోని ప్రతి వస్తువుపైనా అదనపు ధరలతో దండుకున్నారు.


    సాప్ట్‌వేర్‌ రూపకల్పనకు రూ. 4లక్షలు ఖర్చు


    మెస్‌బిల్లు వసూలుకు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ రూపకల్పనకు రూ.4 లక్షలు వెచ్చించారు. ఇందుకు ఎలాంటి విధివిధానాలు, అనుమతులు లేకుండానే హాస్టల్‌ అధికారులు ఖర్చు పెట్టడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ ప్రోగ్రాంను రూపొందించిన కంపెనీ సైతం లోకల్‌దే చూపించడంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థుల సొమ్మును విచ్చలవిడిగా ఖర్చు పెడుతుండడంతో మెస్‌ బిల్లులు భారంగా పరిణమించాయని విద్యార్థులు బాహాటంగానే వాపోతున్నారు. 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top