బంగ్లాకు బదిలీల దస్త్రం!


 శ్రీకాకుళం టౌన్: జిల్లా పరిషత్ యాజమాన్య పరిధిలో పది కేడర్ల కింద ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. వారిలో ప్రధానంగా ఎంపీడీవోలను మార్చడానికి నిబంధనలు అడ్డంకిగా మారారుు. అయితే ప్రస్తుత పాలకవర్గాలకు అనుకూలంగా వ్యవహరించడం లేదన్న కారణంగా కొంతమంది మండలాభివృద్ధి అధికారులను మార్చాలని ఒత్తిడి మొదలైంది. అందులో పలాస నియోజకవర్గంలో ఒకరిని బదిలీ చేయాలంటూ ఎమ్మెల్యే శివాజీ ఒత్తిడి పెంచారు. చాలా నెలలుగా ఎంపీడీవో, ఎమ్మెల్యేల మధ్య అంతరం ఉంది. దీంతో సాధారణ బదిలీల్లో అతన్ని మార్చాలని ఆయన అనుచరులు పట్టుబడుతుండడంతో బదిలీ తప్పని సరి. అయితే నిబంధనల ప్రకారం మార్చడం సాధ్యం కాక పోవడంతో డిప్యుటేషన్‌పై పంపాలని భావిస్తున్నట్టు సమాచారం.

 

 అలాగే ఎచ్చెర్ల నియోజకవర్గానికి చెందిన ఇద్దరు ఎంపీడీవోలు డిప్యుటేషన్‌పై   జిల్లాపరిషత్‌లోని కీలక స్థానాల్లో పనిచేస్తున్నారు. వారిని జెడ్పీలోనే కొనసాగించినట్టయితే వారి స్థానాల్లో తాత్కాలికంగా ఎంపీడీవోలను నియమించాల్సిఉంది. వీరికి తోడు మరో ఇద్దరు బదిలీ కోసం ఎదురు చూస్తున్నారు. వీరికి స్థానచలనం తప్పని సరి. వీరిని ఎక్కడెక్కడ నియమించాలన్న అంశంపై చర్చ సాగుతోంది. జిల్లా పరిషత్ యాజమాన్యం పరిధిలో ఉన్న జెడ్పీహైస్కూళ్లు, ఎంపీడీవో కార్యాలయాలు, ఇంజినీరింగ్ విభాగాలు, తాగునీటి సరఫరా విభాగంలో పనిచేస్తున్న వివిధ కేడర్ ఉద్యోగులను బదిలీ చేయాలని నిర్ణయించారు.

 

  వీరిలో 74 మంది ఆఫీసు సబార్డినేట్లు, కింది తరగతి ఉద్యోగులు, మిగిలిన కేడర్ ఉద్యోగుల బదిలీలకు ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. వీరు మా వారు.. వారిని అక్కడే ఉంచండి.. వారు కోరిన చోటు ఇవ్వండి.. ఇలాంటి సిఫారుసులు వస్తుండడంతో చైర్‌పర్సన్ దస్త్రాన్ని బంగ్లాకు పంపాలని హుకుం జారీ చేశారు. దీంతో సోమవారం రాత్రి దస్త్రం బంగ్లాకు చేరడంతో వాటిలో సిఫారుసులను కలుపుకుంటూ తుది జాబితాలను తయారు చేయడానికి సిద్ధమయ్యారు. జెడ్పీలో టైపిస్టుగా పనిచేస్తున్న ఓ ఉద్యోగి ఈదస్త్రంలో చేర్పులు మార్పులకు జోక్యం చేసుకుంటున్నారని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు.

 

  ఉద్యోగుల బదిలీలను బుధవారంలోగా పూర్తిచేసి తిరిగి ఆన్‌లైన్లో ఉంచాలన్న ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఆదేశాలను దృష్టిలో ఉంచుకుని అధికారులు తుది జాబితా తయూరీకి తొందర పడుతున్నారు. జెడ్పీ సీఈవో బి.నగేష్ ఇప్పటికే ఈ విషయాన్ని జెడ్పీ చైర్‌పర్సన్ దృష్టికి తీసుకెళ్లారు. అయితే కసరత్తు జరుగుతోందని చెప్పడంతో మౌనం వహించక తప్పలేదని తెలిసింది. ఏలాగైనా బుధవారం నాటికి బదిలీల ఉత్తర్వులు జారీ పూర్తిచేయాలని సీఈవో నగేష్ భావిస్తున్నారు.

 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top