మూత‘బడి’ దిశగా..

మూత‘బడి’ దిశగా..


విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందన్న సాకుతో చిన్నబడులను మూసేయడానికి సర్కారు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే జాబితాను సిద్ధం చేసింది. రేషనలైజేషన్‌తో జిల్లాలో 50 పాఠశాలలు మూతబడనున్నాయి. గ్రామంలోని బడి ఎత్తివేతతో విద్యార్థులకు చదువు దూరమయ్యే అవకాశాలున్నాయి. దీంతో ఆయా గ్రామాలకు చెందిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. –నిజామాబాద్‌ అర్బన్‌





నిజామాబాద్‌అర్బన్‌ : జిల్లాలో విద్యార్థులు తక్కువగా ఉన్న పాఠశాలలను మూసివేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. వాటిని సమీపంలోని బడుల్లో విలీనం చేసే ప్రయత్నం మొదలుపెట్టింది. 10 మందికన్నా తక్కువ విద్యార్థులు ఉన్న పాఠశాలలను ఇప్పటికే అధికారులు గుర్తించి ఉన్నతాధికారులకు నివేదిక అందించారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే పాఠశాలలను మూసేయడానికి సిద్ధమవుతున్నారు.



50 పాఠశాలలపై ప్రభావం

జిల్లాలో 776 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 10 మందికంటే తక్కువ విద్యార్థులు ఉన్న పాఠశాలలను ఇప్పటికే గుర్తించారు. జిల్లాలో విద్యార్థులు తక్కువగా ఉన్న స్థానిక సంస్థల పాఠశాలలు–31, ప్రభుత్వ విభాగం పాఠశాల –1, మండల ప్రజాపరిషత్‌ పాఠశాలలు–18 ఉన్నాయి. వీటిలో చదువుతున్న సుమారు 315 మంది విద్యార్థులను ఇతర పాఠశాలలకు కేటాయించేందుకు సిద్ధమయ్యారు. ఆయా పాఠశాలల్లో పనిచేస్తున్న 63 మంది టీచర్లను ఇతర పాఠశాలలకు కేటాయించనున్నారు. దీనికి సంబంధించి టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్న పాఠశాలలను గుర్తించి నివేదికలు కూడా సిద్ధం చేశారు.


జిల్లావ్యాప్తంగా పదిమంది విద్యార్థులకంటే తక్కువగా ఉన్న పాఠశాలలు 50 ఉన్నాయి. వీటిలో ఆర్మూర్, జక్రాన్‌పల్లి, కమ్మర్‌పల్లి, మోర్తాడ్, నందిపేట, నవీపేట, నిజామాబాద్‌రూరల్, రెంజల్, వర్ని మండలాల్లో ఒక్కొక్క పాఠశాల చొప్పున గుర్తించారు. భీమ్‌గల్‌లో–6, బోధన్‌లో–3, ధర్పల్లి–7, డిచ్‌పల్లి–5 , ఇందల్‌వాయిలో–2, కోటగిరి–4, మాక్లూర్‌–2, మోపాల్‌–5, సిరికొండ–5, వేల్పూర్‌–3 పాఠశాలలను గుర్తించారు. వీటిని మూసివేయాలని నిర్ణయించారు. పాఠశాల డైరెక్టర్‌ నుంచి ఆదేశాలు రాగానే మూసివేసే ప్రక్రియ కొనసాగుతుంది.



విద్యార్థుల సంఖ్య సున్నా..

జిల్లాలో ఆరు పాఠశాలల్లో అసలు విద్యార్థులే లేరు. బోధన్‌ మండలంలోని హంగర్గ, సాలూర, భీమ్‌గల్‌ మండలంలోని వంచాయ్‌తండా, కోటగిరి మండలంలోని దేవునిగుట్ట, మోపాల్‌ మండలంలోని హనుమాన్‌తండా, నందిపేట మండలంలోని ఇంద్రనగర్‌ పాఠశాలల్లో విద్యార్థులు లేరు.



‘పది’లోపు పాఠశాలలు 44..

పదిమందిలోపు విద్యార్థులు ఉన్న పాఠశాలలు జిల్లాలో 44 ఉన్నాయి. డిచ్‌పల్లి మండలం మెంట్రాజ్‌పల్లిలో ముగ్గురు, ఇదే మండలంలోని ఆరేపల్లిలో నలుగురు, భీమ్‌గల్‌ మండలం పెద్దకండీ తండాలో ఐదుగురు చొప్పున విద్యార్థులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మిగతా పాఠశాలలలో ఆరుగురు నుంచి 10 మందిలోపు విద్యార్థులే ఉన్నారు. అంతేకాకుండా 20 మందిలోపు విద్యార్థులు ఉన్న పాఠశాలల గుర్తింపు, పరిశీలన కొనసాగుతోంది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వీటిపై కూడా త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి.



బడులు మూసేస్తే..

హేతుబద్ధీకరణ పేరుతో మారుమూల ప్రాంతాల్లో ఉన్న పాఠశాలలను మూసివేస్తే విద్యార్థులు చదువుకు దూరమయ్యే అవకాశాలుంటాయి. మూసివేత జాబితాలో ప్రాథమిక పాఠశాలలే ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో చిన్న పిల్లలు కొంత దూరం నడిచివెళ్లి చదువుకునే పరిస్థితులుండవు. మారుమూల ప్రాంతాల్లో ఇంటికి సమీపంలో బడి ఉన్నప్పుడే డ్రాపవుట్లు ఉంటున్న పరిస్థితుల్లో బడి దూరమైతే విద్యార్థులు చదువు కొనసాగించడం కష్టమనే భావిస్తున్నారు.



అందరికీ విద్య అన్న సర్కారు లక్ష్యం పాఠశాలల హేతుబద్ధీకరణ వల్ల నీరుగారిపోయే ప్రమాదం ఉంది. బడులను మూసివేయకుండా వసతులను మెరుగుపర్చి, సరిపడా ఉపాధ్యాయులను నియమించాలని విద్యా పరిరక్షణ కమిటీ ప్రతినిధులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నారు.



బడులను మూసివేయలేదు

జిల్లాలో పది మందిలోపు విద్యార్థులు ఉన్న పాఠశాలలను గుర్తించాం. తక్కువ విద్యార్థులు ఉన్న పాఠశాలలను మూసివేయలేదు. ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే నిర్ణయం తీసుకుంటాం. – నాంపల్లి రాజేశ్, డీఈవో

 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top