మరణంలోనూ వీడని బంధం

మరణంలోనూ వీడని బంధం - Sakshi


షార్ట్‌ సర్క్యూట్‌తో ప్రమాదం

వృద్ధ దంపతుల సజీవ దహనం

మదనపల్లె పట్టణంలో విషాదం




వారు పెళ్లినాడు చేసిన నాతిచరామి అన్న  బాసను ఏనాడూ మరువలేదు. 50 ఏళ్లుగా  కష్టసుఖాల్లో తోడూనీడగా ఉన్నారు. పిల్లలు రెక్కలు వచ్చి దూర ప్రాంతాలకు వెళ్లిపోయినా నీకు నేను.. నాకు నీవు.. ఒకరికొకరం నువ్వూ.. నేను.. అని అనుకున్నారు. చుట్టుపక్కల వారికి ఆదర్శంగా ఉంటూ జీవనం సాగిస్తున్నారు. జీవిత చరమాంకంలో ఉన్న ఈ ఆదర్శ దంపతులు ఇద్దరూ శుక్రవారం అనుకోని విధంగా జరిగిన ప్రమాదంలో సజీవ దహనమయ్యారు. ఈ హృదయ విదారకమైన సంఘటన మదనపల్లె పట్టణంలో చోటుచేసుకుంది.



మదనపల్లె క్రైం: మదనపల్లెలో శుక్రవారం షార్ట్‌ సర్క్యూట్‌ ఏర్పడిన ప్రమాదంలో వృద్ధ దంపతులు సజీవ దహనమయ్యారు. ఈ విషాదకర సంఘటన తీవ్ర సంచలనం కలిగించింది. పోలీసుల కథనం మేరకు.. మదనపల్లె పట్టణం నెహ్రూ బజార్‌లో మాకం నిరంజన్‌శెట్టి(78), సరస్వతమ్మ(68) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు శ్రీహర్ష, రోహిత్‌కుమార్‌ ఉన్నారు. ఇద్దరూ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు. శ్రీహర్ష బెంగళూరులో, రోహిత్‌కుమార్‌ లండన్‌లో స్థిరపడ్డారు. 20 ఏళ్లుగా అక్కడే ఉంటున్నారు. నిరంజన్‌శెట్టికి ముగ్గురు తమ్ముళ్లు ఉన్నారు. వారు కూడా పక్కపక్క ఇళ్లలో ఉంటూ వ్యాపారులు చేస్తున్నారు. నిరంజన్‌శెట్టి, సరస్వతమ్మ ఇంటిలో ఎలక్ట్రికల్‌ వస్తువుల దుకాణాన్ని నిర్వహిస్తున్నారు. రోజూ మాదిరిగానే గురువారం రాత్రి 10 గంటల సమయంలో షాపులో పనిచేసే అటెండర్‌ మోహన్‌ అంగడి మూసేసి ఇంటికి వెళ్లిపోయాడు.



ఆ సమయంలో నిరంజన్‌ తమ్ముడు మోహన్‌ రోజూ మాదిరిగానే అన్న, వదిన యోగక్షేమాలను ఆరాతీసి వెళ్లిపోయాడు. శుక్రవారం ఉదయం 10 గంటలకు షాపు తెరిచేందుకు వచ్చిన అటెండర్‌ మోహన్‌ తలుపుతడితే యజమాని గడియతీయలేదు. దీంతో పక్కనున్న ఓనర్‌ తమ్ముడు నరేంద్రకు విషయం తెలిపాడు. వారు ఇంటి వద్దకు చేరుకుని తలుపులు తట్టినా గడియ తీయలేదు. అనుమానం వచ్చి నిచ్చెన సాయంతో మిద్దెపైకి చేరుకున్నారు. వెనుక మెట్ల దారిలో కిందికి దిగి పరిశీలించారు. వంట గదిలో నుంచి వస్తున్న పొగలను గుర్తించి అప్రమత్తమయ్యారు. తలుపులు పగులగొట్టి లోనికి వెళ్లి చూడగా మంటల్లో కాలిపోయి ఉన్న వృద్ధ దంపతులను గుర్తించారు. ఒకటో పట్టణ పోలీసులకు సమాచారం అందించడంతో సీఐ నిరంజన్‌కుమార్, ఎస్‌ఐ సుకుమార్, సిబ్బంది అక్కడికి చేరుకుని పరిశీలించారు. సరస్వతమ్మ మృతదేహం పూర్తిగా కాలిపోయింది. నిరంజన్‌శెట్టి మృతదేహం తల మాత్రమే ఉంది. పోలీసులు పంచనామా చేసి కేసు నమోదు చెసి దర్యాప్తు చేస్తున్నారు.



ఆత్మహత్య చేసుకున్నారా...?

అసలే వృద్ధాప్యంతో బాధపడుతున్న ఆ వృద్ధ దంపతులు సొంత పనులు చేసుకోలేని స్థితిలో ఉన్నారు. దీనికితోడు ఒంటరితనం. బిడ్డల యడబాటు వారిని కలచివేయడంతో వంట గదిలో నిప్పటించుకుని ఆత్మహత్య చేసుకున్నారా అని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక సమస్యలు లేనందున ప్రమాదవశాత్తు జరిగిన సంఘటనలో చనిపోయి ఉంటా రని పోలీసులు చెబుతున్నారు. మృతికిగల కారణాలు పోస్టుమార్టం నివేదికలో తెలియాల్సివుంది.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top