ఈశ్వరుడేమోగానీ..పోలీసు డాగ్‌ పట్టించింది!

chori - Sakshi

కందుకూరు:  

సొంత ఇంటికే కన్నం వేసిన యువకుడు 


జల్సాల కోసం రూ.2.50 లక్షలు కాజేసిన ఘనుడు


దొంగతనంగా చిత్రీకరించేందుకు విఫలయత్నం


అడ్డంగా బుక్‌ చేసిన డాగ్‌ స్క్వాడ్‌


 


ఇంటి దొంగను ఈశ్వరుడైనా కనిపెట్టలేడు.. ఇది అనాదిగా పెద్దలు వాడే కాలం చెల్లిన సామెత. ఈ సామెతకు పోలీసు డాగ్‌ చెక్‌ పెట్టింది. సొంత ఇంట్లో రూ.2.50 లక్షలు మాయం చేసి ఏమీ ఎరగనట్లు ఉన్న కొడుకును డాగ్‌ స్క్వాడ్‌ వెంటపడి మరీ పట్టించింది. బాత్‌రూమ్‌లో నక్కిన వారి పుత్ర రత్నాన్ని బయటకు లాక్కొచ్చి మరీ దొంగ ఇతడేనని వెలుగులోకి తెచ్చింది. ఈ సంఘటన గుడ్లూరు మండలం తెట్టులో జరిగింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను కందుకూరు డీఎస్పీ ప్రకాశ్‌రావు తన చాంబర్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వెల్లడించారు.  


 

   

పిల్లలు లేని ఆ తల్లిదండ్రులు ఓ పిల్లాడి కోసం పరితపించారు. పొత్తిళ్ల బిడ్డను తీసుకుని కన్న బిడ్డ కంటే ఎక్కువగా మమతానురాగాలతో పెంచుకున్నారు. కూలీనాలి చేసి ఏ లోటూ లేకుండా ఆ బిడ్డే సర్వసంగా భావించారు. అల్లారుముద్దుగా పెంచుకున్న ఆ కొడుకే దొంగ అవతారమెత్తి సొంత ఇంటికే కన్నమేసి ఆ తల్లిదండ్రుల నమ్మకాన్ని ఒమ్ము చేశాడు. చేసిన దొంగతనం నుంచి తప్పించుకునే ప్రయత్నంలో పోలీసు డాగ్‌కు చిక్కి కటకటాల పాలయ్యాడు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను కందుకూరు డీఎస్పీ ప్రకాశ్‌రావు గురువారం తన చాంబర్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వెల్లడించారు. డీఎస్పీ కథనం ప్రకారం.. గుడ్లూరు మండలం తెట్టుకు చెందిన షేక్‌ మౌలాలీ, సుల్తాన్‌బీ దంపతులు. వీరికి సంతానం కలగలేదు. పిల్లలపై ఉన్న మమకారంతో ఓ పురిటి బిడ్డను తెచ్చుకుని పెంచుకుంటున్నారు. ఆ పిల్లాడికి షేక్‌ సుల్తాన్‌షరీఫ్‌గా నామకరణం చేశారు. ప్రస్తుతం ఆ పిల్లాడికి 20 ఏళ్లొచ్చాయి. జల్సాలకు అలవాటు పడి సుల్తాన్‌షరీఫ్‌ దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో సొంత ఇంట్లోనే తల్లిదండ్రులకు తెలియకుండా ఐదు, పది వేలు తీసుకెళ్లేవాడు. 

 

వేల నుంచి లక్షలకు..

తల్లిదండ్రులు పెద్దగా పట్టించుకోలేదు. ఈ నెల 23వ తేదీన ఇంట్లోని బీరువా నుంచి ఏకంగా రూ.2.50 లక్షలు కాజేశాడు. తల్లిదండ్రులకు తెలుస్తుందోమోనని దొంగతనంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. రాత్రి తల్లిదండ్రులు నిద్రపోయే సమయంలో ఇంట్లోకి వెళ్లి బీరువాలోని బట్టలన్నీ చెల్లాచెదురు చేసి దొంగతనం జరిగినట్లు కథ అల్లాడు. అనంతరం ఏమీ తెలియనట్టు ఇంటి మిద్దెపైకి వెళ్లి పడుకున్నాడు. ఉదయాన్నే లేచి తల్లిదండ్రులు ఇంట్లో దొంగతనం జరిగిందని భావించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. డాగ్‌ స్క్వడ్‌ వచ్చి నేరుగా సుల్తాన్‌షరీఫ్‌ వద్దకు వెళ్లింది. అతను పడుకున్న మిద్దెపైకి ఎక్కి తచ్చాడింది. డాగ్‌ను చూసిన సుల్తాన్‌షరీఫ్‌ భపడి బాత్‌రూమ్‌లో దాక్కుకున్నాడు. అయినా వదలని ఆ కుక్క నిందితుడిని బాత్‌రూమ్‌ నుంచి బయటకు లాక్కొచ్చింది. దొంగతనం అతనే చేసి ఉంటాడని భావించిన పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించి నిజాన్ని తేల్చారు. కాజేసిన రూ.2.50 లక్షల్లో ఇప్పటికే రూ.50 వేలు ఖర్చు చేశాడు. మిగిలిన రూ.2 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తానికి సొంత ఇంటికే కన్నమేసిన ఈ ప్రబుద్ధుడు పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. డీఎస్పీతో పాటు కందుకూరు సీఐ ఎం.లక్ష్మణ్, గుడ్లూరు ఎస్సై విజయ్‌చంద్, ట్రైనీ ఎస్సై రామకృష్ణ ఉన్నారు.

 

వదిలేయమన్న తల్లిదండ్రులు..కుదరదన్న ఖాకీలు 

ఇంటి దొంగ కొడుకేనని తెలిసి అతడి అరెస్టుకు తల్లిదండ్రులు అంగీకరించనట్లు తెలిసింది. జరిగిందేదో జరిగింది.. తమ బిడ్డను వదిలేయాలని పోలీసులను ఆ తల్లిదండ్రులు వేడుకున్నట్లు సమాచారం. పోలీసులు దీనికి ససేమిరా.. అనడంతో ఇంటి దొంగ కటకటాల వెనక్కి వెళ్లక తప్పలేదు.
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top