జూలై రెండో వారంలో మెడికల్ కౌన్సెలింగ్


- ఈ ఏడాది నుంచి వెబ్ కౌన్సెలింగ్

- ఏపీ, తెలంగాణకు ఒకేసారి మెడికల్ కౌన్సెలింగ్

- కన్వీనర్ కోటాలోకి మరో 200 సీట్లకు అవకాశం!




విజయవాడ (హెల్త్ యూనివర్సిటీ) : ఎంసెట్ మెడికల్ వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియ జూలై రెండో వారంలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ టి.రవిరాజు తెలిపారు. ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ మాదిరిగానే తొలుత సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ నిర్వహిస్తామని, అనంతరం వెబ్ కౌన్సెలింగ్ ద్వారా ఆప్షన్లు పెట్టుకోవాలన్నారు. ఏపీ స్టేట్ కౌన్సిల్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో వెబ్ కౌన్సెలింగ్ జరుగుతుందన్నారు. అన్‌రిజర్వుడ్ మెరిట్ (నాన్‌లోకల్), లోకల్ సీట్ల భర్తీచేయాల్సిన నేపథ్యంలో ఏపీ, తెలంగాణ ఇరు రాష్ట్రాలకు వే ర్వేరుగా దాదాపు ఒకే తేదీల్లో కౌన్సెలింగ్ జరుగుతుందన్నారు.



ఏపీలో ఈ ఏడాది ప్రైవేటు మెడికల్ కళాశాలలైన విశ్వభారతి మెడికల్ కళాశాల (కర్నూలు)లో 100 సీట్లు, అనీల్ నీరుకొండ ఎన్‌ఆర్‌ఐ మెడికల్ కళాశాల (విశాఖపట్నం)లో 150 సీట్లు, మహారాజా మెడికల్ కళాశాల (విజయనగరం )లో 150 సీట్లకు, అలాగే మైనార్టీ కళాశాలైన ఫాతిమా మెడికల్ కళాశాల(కడప)లో 100 సీట్లకు అనుమతి రావాల్సి ఉందన్నారు. ఈ సీట్ల అనుమతి కోసం ప్రభుత్వం కూడా తీవ్రంగా ప్రయత్నిస్తోందన్నారు. పై కళాశాలలకు ఈ ఏడాది ఎంసీఐ అనుమతి లభిస్తే అదనంగా కన్వీనర్ కోటా కింద 200 (ఎ-కేటగిరీ సీట్లు) అందుబాటులోకి వస్తాయన్నారు. ప్రభుత్వ కళాశాలల్లో ఉన్న సీట్లకు ఢోకా లేదని తెలిపారు. జూలై 24న జరిగే నీట్ ఫలితాల విడుదల అనంతరం ప్రైవేటు కళాశాలల్లోని బి-కేటగిరీ (యాజమాన్య) కోటా సీట్ల భర్తీ భర్తీ చేస్తామన్నారు.



అమెరికాకు వైస్ చాన్సలర్

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ టి.రవిరాజు సెలవుపై గురువారం అమెరికాకు వెళుతున్నట్లు తెలిపారు. డీఎంఈ డాక్టర్ సుబ్బారావు ఇన్‌చార్జి వీసీగా వ్యవహరించనున్నారు. జూలై 17వ తేదీ వరకు వీసీ సెలవు పెట్టారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top