‘అమ్మ’ లడ్డూ ఆరగింపు

‘అమ్మ’ లడ్డూ ఆరగింపు


లడ్డూ ప్రసాదాల్లో సిబ్బంది చేతివాటం

తెల్లవారేలోగానే గుట్టుగా లడ్డూలు విక్రయాలు

ఇద్దరు ఉద్యోగుల తొలగింపుతో బయట పడిన వ్యవహారం

దేవస్థానం సిబ్బంది, ప్రైవేటు సిబ్బంది మిలాఖత్‌

రూ.లక్షల్లో అమ్మ సొమ్ముకు ఎసరు




ఇంటి దొంగల్ని ఈశ్వరుడు కూడా పట్టుకోలేడని దుర్గగుడిలో మరోసారి రుజువైంది. సాక్షాత్తు దుర్గమ్మ సొమ్మును ఆలయ ఉద్యోగులు కొంత మంది ప్రైవేటు సిబ్బందితో కలిసి కొంతకాలంగా దిగమింగుతున్నారు. గట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న ఈ వ్యవహారంలో నెలకు లక్షల రూపాయలు అమ్మ సొమ్ము స్వాహా అవుతున్నట్లు ఇంద్రకీలాద్రిపై ప్రచారం జరుగుతోంది.



సాక్షి, విజయవాడ : దుర్గమ్మ లడ్డూ ప్రసాదాల విక్రయాల్లో గోల్‌మాల్‌ జరుగుతోంది. ఈ వ్యవహారంలో ఆలయ ప్రసాదాల తయారీ కేంద్రంలోని సిబ్బందితో పాటు ప్రసాదాలు విక్రయించే కౌంటర్‌లోని ప్రైవేటు సిబ్బంది కీలకపాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల డబ్బుల వ్యవహారంలో ప్రసాదాల కౌంటర్ల సూపర్‌వైజర్లుగా వ్యవహరించే ఇద్దరు వ్యక్తులను విధుల నుంచి తొలగించడం, వారు తిరిగి విధులకు హాజరు కావాలంటే కాంట్రాక్టర్‌ లక్షలాది రూపాయలు డిమాండ్‌ చేయడంతో వ్యవహారం బయటకు వచ్చింది. ప్రసాదాల విక్రయించే కౌంటర్‌ను ఒక బ్యాంకు నిర్వహిస్తున్నా అందులో పనిచేసేందుకు సిబ్బందిని మాత్రం కాంట్రాక్టర్‌ సరఫరా చేస్తారు. అందువల్ల కాంట్రాక్టు సిబ్బంది, దేవస్థానం సిబ్బంది మిలాకత్‌ అయి లడ్డూలను దారిమళ్లిస్తున్నారు.



రోజుకు 5 గంపలు..  

అమ్మవారి లడ్డూ ప్రసాదాన్ని అర్జున వీధిలోని బుద్దా వారి సత్రంలో తయారు చేస్తారు. ఈ లడ్డూలను దేవస్థాన వాహనాల్లోనే కొండపై ఉన్న కౌంటర్లకు సరఫరా చేస్తుంటారు. ఈ క్రమంలో నిత్యం ఉదయం 9 గంటలలోపు వెళ్లే లడ్డూ ప్రసాదం గంపలతో పాటు అదనంగా 5 గంపలను కౌంటర్లకు పంపుతున్నట్లు తేలింది. ఈవో, ఇతర విభాగాల అధికారులు విధులకు వచ్చే లోగానే ఈ 5 గంపల లడ్డూలను విక్రయించి డబ్బులను ప్రసాదాల కౌంటర్ల నుంచి పక్కకు తప్పిస్తున్నారు.



ఒక్కొక్క గంపలో 300 లడ్డూల చొప్పున రోజుకు 5 గంపల్లో మొత్తం 15 వందల లడ్డూలు పక్కదారి పడుతున్నాయి. ఒక్కొక్క లడ్డూ రూ.10 చొప్పున రూ.15 వేల విలువైన లడ్డూలు ప్రతి రోజూ దారిమళ్లిస్తున్నారు. ఇక శుక్రవారం, ఆదివారాల్లో పది నుంచి పదిహేను గంపలు సైతం దారి మళ్లిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. లడ్డూలు దారి మళ్లింపునకు సహకరించేందుకు ఆయా బీట్లలో పనిచేసే సెక్యూరిటీ సిబ్బంది మొదలు కొని ప్రసాదాల కౌంటర్ల వద్ద ఉండే హోంగార్డుల వరకు వాటాలు ఇస్తున్నట్లు సమాచారం. ఇక లడ్డూలను విక్రయించగా వచ్చిన మొత్తంలో రూ.10 వేలు లడ్డూ తయారీ కేంద్రంలోని సిబ్బందికి, రూ.5 వేలు కౌంటర్‌లోని సిబ్బంది, సూపర్‌వైజర్లు పంచుకుంటున్నట్లు సమాచారం.



త్వరలో ట్రైలోక్‌ కంపెనీకి అప్పగిస్తాం

లడ్డూలు దారిమళ్లుతున్న విషయం నా దృష్టికి రాలేదు. దీనిపై విచారణ చేయిస్తాం. త్వరలోనే ట్రైలోక్‌ కంపెనీకి అప్పగిస్తాం. వారు యాక్సిస్‌ కార్డు భక్తులకు ఇస్తారు. వాటి ద్వారా దర్శనంతో పాటు ప్రసాదాలు ఎన్ని కావాలో భక్తులకు ఒకేసారి ఇస్తారు. దీనివల్ల అక్రమాలు జరిగే అవకాశం ఉండదు.

– సూర్యకుమారి,ఈవో, దుర్గగుడి

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top