కాదేదీ కల్తీకి అనర్హం!

కాదేదీ కల్తీకి అనర్హం! - Sakshi


► ఇబ్రహీంపట్నం డివిజన్‌లో చేలరేగుతున్న కల్తీ దందాలు

► విత్తనాలు మొదలు పాల వరకు అన్నీ కల్తీలే

► ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వైనం

► భయబ్రాంతులకు గురవుతున్న ప్రజలు




ఇబ్రహీంపట్నం: కాదేది కల్తీకి అనర్హం అనే రీతిలో కల్తీ వ్యాపారం జోరుగా కొనసాగుతుంది. ఇబ్రహీంపట్నం డివిజన్‌లో గత కొన్నేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ వ్యవహారాలు ఒక్కోటిగా బయటకొస్తున్నాయి. నకిలీ విత్తనాలు మొదలు కారం, పప్పు, ఆహార పదార్థాల నుంచి ఆఖరికి పసిపిల్లలు తాగే పాల వరకు అన్ని కల్తీలే. ఎస్‌ఓటీ, స్థానిక పోలీసులు, నిఘా వర్గాలు ఆక్రమ వ్యాపారాల, ఆహార పదార్థాల కల్తీలపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఏదో కంపెనీ పేరుతో అనుమతులు తీసుకొని వాటిలో గుట్టుచప్పుడు కాకుండా ఆహారపదార్థాలను కల్తీలు చేస్తూ యదేశ్ఛగా వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. రోజుకో ఘటన వెలుగు చూస్తుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఆరోగ్యంతో వ్యాపారం చేస్తున్న కల్తీగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.



నిబంధనలు బేఖాతరు.....

పోలీసులు హెచ్చరికలు చేస్తున్న కల్తీగాళ్లు వాటిని బేఖాతరు చేస్తున్నారు. పట్టుబడితే దొంగ.. లేదంటే దొర అన్న చందంగా ఈ తతంగం కొనసాగుతుంది. కల్తీలపై ఉక్కుపాదం మోపుతున్నామని, పీడీ యాక్ట్‌ను సైతం నమోదు చేస్తామని రాచకొండ సీపీ మహేష్‌ భగవత్, ఎల్బీనగర్‌ డీసీపీ వెంకటేశ్వరరావు హెచ్చరిస్తున్న వీరి అరచకాలకు అడ్డు, అదుపు లేకుండా పోతుంది. కల్తీ దందాలకు పాల్పడే వారికి తగిన రీతిలో దండన విధిస్తేనే తగ్గుతారేమో. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న దుండగుల భరతం పట్టేందుకు ఆహార పదార్థాల తనిఖీ విభాగం అధికారులు, పోలీసు యంత్రాంగం పకడ్బందీగా వ్యవహారించాల్సివుంది.  



కల్తీల మూలాలను పెకిలించాలి....

కల్తీగాళ్ల ఆగడాలు అరికట్టాలంటే దొరికిన వారిపై కేసులు పెట్టి చేతులు దులుపుకుంటే సరిపోదు. ఈ కల్తీ వ్యాపారుల మూలాలను గుర్తించాల్సిన అవసరం ఉందని ప్రజలు వాపోతున్నారు. మార్కెట్‌లోకి కల్తీ సరుకులు, విత్తనాలు, పాలు వస్తున్నాయంటే దానిని తయారు చేసే వారిపై... వాటిని కొనుగోలు చేసి ప్రజలకు అంటగడుతున్న వ్యాపారులకు శిక్షపడే విధంగా చర్యలు తీసుకుంటేనే ఫలితం వుంటుందని విశ్లేషకులు అంటున్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top