సార్లొస్తారు


త్వరలో డీఎస్సీ, టెట్‌ నోటిఫికేషన్‌..!

ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రకటనతో

నిరుద్యోగుల్లో ఆశలు

కుమ్రంభీం జిల్లాలోనే అత్యధిక ఖాళీలు..

నిర్మల్‌ జిల్లాలో స్వల్పం




మంచిర్యాల సిటీ : ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టులకు మోక్షం లభించనుందా..? ప్రభుత్వం టెట్, డీఎస్సీ నిర్వహించడం ద్వారా ఐదేళ్ల తరువాత నిరుద్యోగుల ఆశలు తీర్చనుందా..? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం చెపుతున్నాయి అధికార వర్గాలు. జిల్లాల వారీగా ఖాళీ ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు నిర్ణయించింది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌), డీఎస్సీని వేర్వేరుగానే నిర్వహించి నియామకాలు చేపట్టనున్నట్లు ఇటీవల ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రకటించారు. ముందుగా టెట్‌ నోటిఫికేషన్‌ వెలువడిన తర్వాతనే డీఎస్సీ ప్రకటన రానున్నట్లు – మిగతా 2లోu  సమాచారం. అన్నీ సక్రమంగా కుదిరితే మార్చిలో టెట్‌ నోటిఫికేషన్‌ ప్రకటించి, ఏప్రిల్‌లో ఫలితాలు వెల్లడించే అవకాశం ఉంది. అలాగే డీఎస్సీ నోటిఫికేషన్‌ ఏప్రిల్‌ చివరి వారం లేదా మేలో వెలువరించి జూలై నాటికి ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఉన్నతస్థాయి వర్గాల సమాచారం. టెట్, డీఎస్సీ కలిపి ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. అదేవిధంగా టీఎస్‌పీఎస్‌సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసే ఆలోచన కూడా ప్రభుత్వానికి లేదని విద్యాశాఖ మంత్రి స్పష్టం చేశారు. ఉమ్మడి జిల్లా పరిధిలో 1,867 కొత్త నియామకాలు జరిగే అవకాశం ఉంది. కొత్తగా ఏర్పాటైన జిల్లాల్లో కుమ్రంభీం ఆసిఫాబాద్‌లో అత్యధికంగా 989 టీచర్‌ పోస్టులు ఖాళీ ఉండ గా, నిర్మల్‌ జిల్లాలో అతితక్కువగా 175 పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది.



ఐదేళ్ల తర్వాత.. : ఉపాధ్యాయ వృత్తి చేపట్టడానికి ఆశతో ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతీ, యువకులకు ఐదేళ్లుగా అవకాశాలు లేవు. 2012లో ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం డీఎ స్సీ ద్వారా ఉపాధ్యాయ నియామకాలు చేపట్టడమే చివరిది. అప్పటి నుంచి నిరుద్యోగులు ప్రభుత్వ ప్రకటన కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నోటిఫికేషన్‌ వస్తుందని ఆశతో ఉన్న వారికి రెండున్నరేళ్ల తరువాత ఉప ముఖ్యమంత్రి ప్రకటన ఊపిరినిచ్చింది. నాలుగు జిల్లాల్లో కలిపి 1,867 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. విద్యార్థుల శాతం తక్కువగా ఉన్న పాఠశాలలను విలీనం చేయాలని ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ ఖాళీల సంఖ్యలో మార్పులు ఉంటాయా అన్న విషయాన్ని ఆయా జిల్లాల విద్యాశాఖ అధికారులు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. కాగా.. ప్రభుత్వం నోటిఫికేషన్‌ వెలువరిస్తే నాలుగు జిల్లాల్లో 1ః28 చొప్పున సుమారు 55 వేల మంది పోటీపడే అవకాశాలు ఉన్నాయి.

కుమ్రంభీంలోనే అధిక ఖాళీలు.. : ఉమ్మడి పరి ధిలో కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలోనే అత్యధిక ఖాళీలు ఉన్నాయి.



ఈ జిల్లాలో అన్ని విభాగాల్లో కలిపి 989 పోస్టులు ఖాళీగా ఉన్నాయని విద్యాశాఖ గణాంకాలు చెబుతున్నాయి. మారుమూల మండలాలైన బెజ్జూరు, కెరమెరి, తిర్యాణి, కౌటాల, సిర్పూర్‌(టి), చింతల్‌మానేపల్లి, దహెగాం, వాంకిడి, జైనూర్‌ మండలాల్లోని ప్రాథమిక పాఠశాలల్లోనే అత్యధిక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మంచిర్యాల జిల్లాలోని వేమనపల్లి, కోటపల్లి, నెన్నెల, భీమిని, భీమారం, కాసిపేట, అదే విధంగా నిర్మల్‌ జిల్లాలోని కడెం, పెంబి, కుంటాల, సారంగాపూర్, ఖానాపూర్, లోకేశ్వరం, ఆదిలాబాద్‌ జిల్లాలోని బేల, జైనథ్, నేరడిగొండ, నార్నూర్, ఉట్నూర్, తలమడుగు, ఇంద్రవెల్లి మండలాల్లోని ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులు ఎక్కువగా ఖాళీ ఉన్నట్టు సమాచారం.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top