కాకలు తీరిన నేత.. డీఎస్

కాకలు తీరిన నేత.. డీఎస్ - Sakshi


సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ధర్మపురి శ్రీనివాస్. రాష్ట్ర రాజకీయాల్లో చిరకాలం పాటు చక్రం తిప్పిన కాకలుతీరిన రాజకీయ యోధుడు. కాంగ్రెస్‌లో చిరకాలం కొనసాగి, ఉమ్మడి రాష్ట్రంలో పార్టీ సారథిగా 2 సార్లు పని చేశారు. రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగిన ఆయన, అనేక ఎత్తుపల్లాలను చవి చూశారు. తొలుత బ్యాంకు ఉద్యోగి అయిన డీఎస్, 1983లో నిజామాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ టికెట్‌పై రాజకీయ అరంగేట్రం చేశారు. ఓటమి చవిచూశారు.


మొత్తం ఎనిమిదిసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. 1989లో టీడీపీ అభ్యర్థి సత్యనారాయణపై గెలిచినా 1994లో ఓడిపోయారు. 1999, 2004ల్లో వరుసగా గెలుపొందారు. మంత్రిగా పలు శాఖల బాధ్యతలు నిర్వహించారు. 1995-1998ల మధ్య పీసీసీ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. 1999లో నిజామాబాద్ నుంచి రెండోసారి గెలిచి 2003 వరకు అసెంబ్లీలో డిప్యూటీ ఫ్లోర్‌లీడర్‌గా, 2003-2004, 2008-2011 మధ్య పీసీసీ చీఫ్‌గా ఉన్నారు.


మర్రి చెన్నారెడ్డి, వైఎస్ రాజశేఖరరెడ్డి కేబినెట్లలో మంత్రిగా పనిచేశారు. బలమైన బీసీ నేతగా ఎదిగినా... నిజామాబాద్ లో ఆయనపై నెలకొన్న వ్యతిరేకత డీఎస్ రాజకీయ జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. 2009లో రెండోసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు డీఎస్ ఏపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నా నిజామాబాద్‌లో ఎమ్మెల్యేగా ఓడిపోవడం ఎదురుదెబ్బ అయింది.


తర్వాత ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ రాజీనామా చేసినప్పుడు ఉప ఎన్నికల్లోనూ డీఎస్‌ను విజయం వరించలేదు. 2014  ఎన్నికల్లోనూ ఓడిపోయారు. 2011లో ఎమ్మెల్సీగా అవకాశం రాగా, 2014 జులై నుంచి 2015 మార్చి వరకు మండలిలో కాంగ్రెస్ పక్షనేతగా వ్యవహరించారు. 2015 జులై 8న టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top