దాహార్తితో అల్లాడుతున్న ప్రజలు

దాహార్తితో అల్లాడుతున్న ప్రజలు


► 40 గ్రామాలకు తాగునీరందించే  పథకానికి తూట్లు

► మోటార్లు పాడై ఏడాది గడుస్తున్నా పట్టించుకోని అధికారులు

► సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎ.మల్లేశం




హవేళిఘణాపూర్‌(మెదక్‌): ఉమ్మడి మెదక్‌ జిల్లాలో ఆరు సంవత్సరాల క్రితం ప్రజల దాహార్తిని తీర్చేందుకు నిర్మించిన సర్ధన పైలెట్‌ ప్రాజెక్టుకు సంబంధిత అధికారులు తూట్లు పొడుస్తున్నారని, ఫలితంగా ప్రజలు తాగునీటి కోసం అల్లాడుతున్నారని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎ.మల్లేశం అన్నారు.



 శుక్రవారం హవేళిఘణాపూర్‌ మండలం సర్థన గ్రామ శివారులోని మంజీర పరీవాహక ప్రాంతంలోని సర్ధన పైలెట్‌ ప్రాజెక్టును ఆయన అక్కడి సిబ్బందితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడుతూ సర్ధన పైలెట్‌ ప్రాజెక్టును సంబంధిత అధికారులు నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఈ పథకం ద్వారా మెదక్‌ మండలం, హవేళిఘణాపూర్‌ మండలంలోని మొత్తం 40 గ్రామాలకు మంజీర నుంచి తాగునీరు అందజేస్తున్నారని చెప్పారు. çసర్ధన పైలెట్‌ ప్రాజెక్టులోని రెండు మోటార్ల కాలిపోవడంతో ఆయా గ్రామాలకు తాగునీరు అందడం లేదన్నారు.


మోటార్లు కాలిపోయి ఏడాది కావస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. వాటర్‌ ట్యాంకర్ల కోసం లక్షలాది రూపాయలు వెచ్చిస్తున్న అధికారులు అందులోంచి మోటార్ల బాగు కోసం రూ.10 లక్షలు వెచ్చిస్తే 40 గ్రామాలకు తాగునీరు సమృద్ధిగా అందుతుందన్నారు. ఇప్పటికే అనేక గ్రామాలు, తండాల్లో తాగునీటి కోసం ప్రజలు అల్లాడుతున్నారన్నారు. మోటార్లు బాగు చేయించకపోవడంతో ఇందులో పని చేసే 17 మందికి ఉపాధి లేకుండా పోతోందన్నారు.



తద్వారా వారికి వేతనాలు అందడం లేదని చెప్పారు. కాంట్రాక్టర్ల జేబులు నింపేందుకే ప్రభుత్వం కృషి చేస్తోందని ఆరోపించారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి మోటార్లను బాగు చేయించాలని, సిబ్బందికి వేతనాలు అందించాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కె.మల్లేశం, సిబ్బంది బీమాగౌడ్, సత్యనారాయణ, పోచయ్య, రాకేష్, సురేష్‌వర్మ, ఆనందర్, శేఖర్, వెంకట్, కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top