ఆంగ్ల బోధన అక్కర్లేదా..?

ఆంగ్ల బోధన అక్కర్లేదా..?


►  ముందుకు రాని గురువులు

►  ప్రైవేటు వైపు తల్లిదండ్రుల చూపు

► నియోజకవర్గంలో దరఖాస్తులు చేసుకున్నది రెండు పాఠశాలలు




ఆదిలాబాద్‌టౌన్‌: ప్రైవేట్‌ పాఠశాలలకు దీటుగా సర్కారు బడుల్లో విద్యాబోధన సాగుతోందని ప్రభుత్వం ప్రచారానికి పోవడమే తప్పా అమలులో మాత్రం కనిపించడం లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఆంగ్ల విద్య బోధించాల్సి ఉన్నప్పటికీ కొందరు గురువులు ముందుకు రావడం లేదు. దీంతో ఆర్థికంగా కొంత ఇబ్బందులు ఎదురైనప్పటికీ విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లల్ని ప్రైవేట్‌ పాఠశాలల్లోనే చేర్పిస్తున్నారు. పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం చదువు ప్రారంభించేందుకు ఉపాధ్యాయులు ఆసక్తి చూపడం లేదని తెలిసింది.


నియోజకవర్గంలో కేవలం రెండు పాఠశాలల్లో మాత్రమే ఇంగ్లిష్‌ మీడియం ప్రారంభించేందుకు దరఖాస్తులు చేసుకోవడం ఇందుకు నిదర్శనం. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల సంఖ్య తగ్గుతుండడం, పలుచోట్ల మూతపడటం, తల్లిదండ్రుల డిమాండ్‌ నేపథ్యంలో సర్కారు బడులు కాపాడేందుకు ప్రభుత్వం ఓ అడుగు ముందుకు వేసింది. గత విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. గతేడాది ఒక్క ప్రభుత్వ పాఠశాలకు కూడా ఆంగ్ల మధ్యమం కోసం దరఖాస్తు చేసుకోలేదు. ఈ సంవత్సరం కేవలం రెండు పాఠశాలలు మాత్రమే ముందుకొచ్చాయి. ఆంగ్ల బోధన చేసేందుకు గురువులు ముందుకు రాకపోవడంతో పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది.



ముందుకురాని గురువులు

ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమం బోధించి సర్కారు బడులు కాపాడుకోవాల్సి ఉండగా, ఆ దిశగా ఉపాధ్యాయులు ముందుకు సాగడం లేదని తెలుస్తోంది. ఇతర జిల్లాల్లో ఆంగ్ల మాధ్యమం పాఠశాలలు ప్రారంభమవుతుండగా, ఆదిలాబాద్‌ జిల్లా పరిస్థితి అధ్వానంగా ఉంది. ఇంగ్లిష్‌ మీడియం కోసం ప్రతిపాదనలు రావడం లేదని విద్యాశాఖ అధికారులు ³ర్కొంటున్నారు.



ఇప్పటికైనా అవకాశం

విద్యా సంవత్సరం పున:ప్రారంభానికి మరో వారం రోజుల గడువు ఉంది. ప్రభుత్వం నుంచి ఇంగ్లిష్‌ మీడియం ప్రారంభించాలనే నిబంధన లేనప్పటికీ సర్కారు బడులు కాపాడుకోవాల్సిన ఉపాధ్యాయులు ఇప్పటికైనా ముందడుగు వేయాలని పలువురు పేర్కొంటున్నారు. ఆసక్తి గల ఉపాధ్యాయులు, ఎస్‌ఎంసీ, జీపీల తీర్మానాలు వేర్వేరుగా చేసి విద్యా శాఖకు పంపించాల్సి ఉంటుంది. ఆంగ్ల మాధ్యమంపై ఉపాధ్యాయులు ఔత్సాహికంగా లేకపోవడం ఇందుకు కారణమని తెలుస్తోంది. తీర్మానం పంపిన పాఠశాలలు ఈ విద్యా సంవత్సరం నుంచి 1వ తరగతి ఇంగ్లిష్‌ మీడియం ప్రారంభించుకోవచ్చు. పై తరగతులు వెళ్లిన కొద్ది ఇంగ్లిష్‌ మీడియంలో చదువుతారు.



మూతబడుతున్న సర్కారు బడులు

ప్రైవేట్‌ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం కొనసాగడం, విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆంగ్ల విద్యనందించాలనే ఉద్దేశంతో రోజురోజుకు సర్కారు బడుల పరిస్థితి దారుణంగా మారుతోంది. కారణం ఏదైనా చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని సర్కార్‌ బడులకు పంపడానికి మొగ్గు చూపడం లేదు. ప్రభుత్వ పాఠశాల్లో ఆంగ్లమాధ్యమం లేకపోవడమే కారణం. నియోజకవర్గంలో విద్యార్థుల సంఖ్య పది కంటే తక్కువగా ఉన్న పాఠ శాలలు 10 వరకు ఉన్నాయి. ఆదిలాబాద్‌ పట్టణంలోనే ఒక్క విద్యార్థి లేకపోవడంతో రెండు పాఠశాలలు ఇప్పటికే మూతపడ్డాయి. భవిష్యత్‌లో సర్కారు బడులకు తాళాలు పడే పరిస్థితులు లేకపోలేదని పేర్కొంటున్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top