ఈ క్రీమ్‌లు రాస్తే ఫేస్ గోవిందా!

ఈ క్రీమ్‌లు రాస్తే ఫేస్ గోవిందా! - Sakshi


ముఖానికి రాసుకుంటే ఇక అంతే

నగరంలో నాసిరకం క్రీమ్‌ల విక్రయం

13 రకాల క్రీమ్స్‌ను సీజ్ చేసినడీసీఏ


 సాక్షి, సిటీబ్యూరో: చర్మసౌందర్యం కోసం చాలా మంది రకరకాల ఫెయిర్‌నెస్, వైట్‌నెస్ క్రీమ్స్ వాడుతున్నారు. అందరికంటే మరింత అందంగా కన్పించాలనే ఆశతో వీటిని కొనుగోలు చేస్తున్నారు. మార్కెట్లో దొరికింది కదా అని ఏదీ పడితే అది రాసుకుంటే ఇక అంతే సంగతి. తెల్లగా నిగనిగలాడే ముఖం కాస్తా నల్లగా మారడమే కాదు.. చర్మం వాడిపోయి ఊడిపోవడం ఖాయం. మహిళల బలహీనతను ఆసరా చేసుకుని పలు కంపెనీలు నాసిరకం ఉత్పత్తులను తయారు చేసి సొమ్ము చేసుకుంటున్నాయి. ఈ నకిలీ వ్యాపారానికి నగరంలోని బేగంబజార్ అడ్డగా మారింది. బ్రాండెడ్ ఉత్పత్తులకు ఏమాత్రం తీసిపోని నకిలీ క్రీమ్స్‌ను తయారు చేసి విక్రయిస్తున్నారు. స్కిన్ క్రీమ్స్‌లో ఉండే స్టెరాయిడ్స్ వల్ల ప్రజలు దీర్ఘకాల చర్మవ్యాధుల బారిన పడుతున్నారు. తయారీలో ఉపయోగించే కార్టికోస్టెరాయిడ్స్ యాంటి ఇంప్లమెంటరీ మెడిసిన్స్‌గా ఉపయోగపడుతాయి. ఇవి చర్మం, కండరాలు, రక్తనాళాల పని తీరును దెబ్బతీస్తున్నాయి. పిగ్మేంటేషన్, చర్మంపై పగుళ్లతో పాటు బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్‌ఫెక్షన్లు వస్తాయి. తెలిసీ తెలియక వాడుతుండటం వల్ల రోగ నిరోధక శక్తి తగ్గిపోవడంతో పాటు రోగనిర్ధారణ, చికిత్స కష్టంగా మారుతుందని పలువురు సీనియర్ చర్మవైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

 13 రకాల క్రీమ్స్ సీజ్: రాష్ట్ర ఔషధ నియంత్రణ మండలి అధికారులు ఇటీవల నగరంలోని పలు హోల్‌సేల్ ఏజెన్సీల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. మై ఫేర్‌నెస్ క్రీమ్, కేలైట్ క్రీమ్, క్యూట్ స్కిన్‌క్రీమ్, కారొఫిట్‌మ్యాక్స్ క్రీమ్, యుక్రోమా క్రీమ్, యుక్రోమా ప్లస్, స్కిన్ బ్రైట్ క్రీమ్, క్లీయర్ స్కిన్ క్రీమ్, స్మూత్ క్రీమ్, హడెన్సా, ఎవర్‌షైన్ ఫెయిర్‌నెస్ క్రీమ్స్‌లతో పాటు మరో రెండు రకాల క్రీమ్స్‌లో చర్మానికి హానిచేసే రసాయన కారకాలు ఉన్నట్టు నిర్ధారించి వాటిని సీజ్ చేసింది. బ్యూటీపార్లర్లు, రిటైల్ డీలర్లకు వీటిని తక్కువ ధరకే సరఫరా చేసి భారీగా సొమ్ము చేసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎప్పటికప్పుడు ఏజెన్సీలపై తనిఖీలు చేసి నాసిరకం క్రీమ్స్‌ను అరికట్టాల్సిన అధికారులు వ్యా       పారులు ఇచ్చే మాముళ్లకు అలవాటుపడి పట్టించుకోవడం లేదు. వీటిని వాడటం వల్ల సౌందర్యం సంగతేమో కానీ చర్మం పొడిబారిపోయి చిట్లిపోవడం ఖాయం అంటున్నారు నిపుణులు.

 

 ఏదీ పడితే అది వాడొద్దు:  డాక్టర్ మన్మోహన్, ఉస్మానియా జనరల్ ఆస్పత్రి


 చర్మ సౌందర్యం కోసం చాలా మంది చర్మ వైద్యులను సంప్రదించకుండానే ఫెయిర్‌నెస్, వైట్‌నెస్ క్రీములు వాడుతున్నారు. ఇలా వాడటం వల్ల చర్మం దెబ్బతినడంతో పాటు నల్లని కురుపులు రావడం, చర్మం పలచపడటం, పగుళ్లు ఏర్పడటం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఏవైనా సమస్యలు ఉంటే వైద్యుడిని సంప్రదించి ఆయన సలహా మేరకే క్రీమ్స్ వాడాలి. అంతే కానీ మార్కెట్లో దొరికింది కదా అని ఏదీపడితే అది కొని వాడ కూడదు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top