రుణాల పంపిణీలో నిర్లక్ష్యం వద్దు!

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ శ్రీదేవి - Sakshi

– డిపాజిట్ల షేర్, రుణాల శాతంలో వ్యత్యాసం ఎందుకు?

– బ్యాంకర్లను సూటిగా ప్రశ్నించిన కలెక్టర్‌ శ్రీదేవి

 

మహబూబ్‌నగర్‌ న్యూటౌన్‌ : ‘అన్ని రంగాల్లో వ్యవసాయానిదే ప్రధాన పాత్ర.. రైతులకు కాలం కలిసిరాక వలసలు పోతూ, ఆత్మహత్యలకు పాల్పడుతూ దుర్భర జీవితాలు గడుపుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వారిని ఆర్థికంగా ఆదుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది.. వ్యవసాయ రుణాలు ఇవ్వాలని ఎన్నో సమావేశాల్లో చర్చిస్తున్నా, ప్రభుత్వం ఆదేశిస్తున్నా ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారో అర్థం కావడంలేదు.. బ్యాంకర్లు తీరు మార్చుకోకపోతే ఆర్బీఐకి ఫిర్యాదు చేస్తా.. నని కలెక్టర్‌ డా.టీకే శ్రీదేవి హెచ్చరించారు. శుక్రవారం రెవెన్యూ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లాస్థాయి బ్యాంకర్ల సమీక్ష, సంప్రదింపుల సమావేశానికి కలెక్టర్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. 2016–17 సంవత్సరానికి సంబంధించి వార్షిక రుణ ప్రణాళిక అమలుపై బ్యాంకర్లు, జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ రుణాలు ఇవ్వడంలో బ్యాంకర్లు అనుసరిస్తున్న తీరు ఏమాత్రం బాలేదని అసంతప్తిని వ్యక్తం చేశారు. డిపాజిట్ల షేర్‌కు, వ్యవసాయ, వ్యవసాయ అనుబంద రంగాలు, ఎంఎస్‌ఎంఈ రుణాల తీరును పరిశీలించి పురోగతిలో వ్యత్యాసంపై అసహనం వ్యక్తం చేశారు. బ్యాంకర్ల తీరు మార్చుకోవాలని, వ్యవసాయ రుణాలు ఇవ్వడంలో నిర్లక్ష్యం ప్రదర్శించరాదని సూచించారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఎక్కువ శాతం మంది ప్రజలు వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నందున వ్యవసాయ రంగానికి నిర్దేశించిన ప్రకారం బ్యాంకర్లు రుణాలు అందజేయాలని ఆదేశించారు. 

 

 

లక్ష్యం పూర్తికావాలి

బ్యాంకర్లకు ఇచ్చిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. జూన్‌ 30 నాటికి రుణ ప్రణాళికలో 34 శాతం లక్ష్యాలు సాధించగా వ్యవసాయ రంగానికి సంబంధించి 29 శాతం, కాల పరిమితి రుణాల కింద 14 శాతం, వ్యవసాయ అనుబంధ కార్యక్రమాలకు 9 శాతం రుణాలు ఇచ్చినట్లు కలెక్టర్‌ తెలిపారు. వ్యవసాయ కాల పరిమితి రుణాలకు కేవలం 14 శాతం మాత్రమే బ్యాంకర్లు రుణాలివ్వడం సరికాదన్నారు. ముఖ్యంగా పాడి పరిశ్రమ రంగంలో కూడా జిల్లాలోని ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్నందున ఈ రంగంలో కూడా రుణాలను ఎక్కువగా ఇవ్వాలని కోరారు. అలాగే జిల్లాలో అత్యధికంగా గొర్రెలు, పశు సంపద ఉందని, వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమ, మత్స్య, అనుబంధ రంగాల్లో కూడా ఎక్కువగా ఆదాయం పొందేందుకు ఆస్కారం ఉన్నందున వీటిపై ఎక్కువ దష్టి కేంద్రీకరించాలని చెప్పారు. 

 

 

హెల్ప్‌ డెస్క్‌ ఏర్పాటు చేయాలి

బ్యాంకుల ద్వారా అందజేసే వివిధ రుణాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు తెలియజేసేందుకు ఎల్‌డీఎం కార్యాలయంలో హెల్ప్‌ డెస్క్‌ను ఏర్పాటుచేయాలని ఆదేశించారు. అదేవిధంగా ఐఈసీ మెటిరియల్‌ను కూడా సిద్ధంగా ఉంచాలని, వీలైతే ఎంపీడీఓ కార్యాలయంలో కూడా ఇలాంటి సమాచారాన్ని ఏర్పాటుచేస్తే లబ్ధిదారులకు అవకాశాలు ఉపయోగించుకునేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. ముద్ర రుణాలకు సంబంధించి అవగాహన కల్పించేందుకు సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. సారా మానేసిన కుటుంబాలకు రుణాలు ఇవ్వాలని కోరామని, ఆ ప్రక్రియ వేగవంతం చేయాలని ఐటీడీఏ పీఓ వెంకటయ్యను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ఎస్సీ, బీసీ, మైనార్టీ, ఎస్టీ, డీఆర్‌డీఏ, మెప్మాల ద్వారా బ్యాంకుల అనుసంధానంతో అమలుచేసే పథకాలపై సమీక్ష నిర్వహించారు. ఎల్‌డీఎం పార్థసారథి, టికె.బాలాజీరావ్, నాబార్డు ఏజీఎం అమితాబ్‌ ఘోష్, జెడ్పీ చైర్మన్‌ బండారి భాస్కర్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

 

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top