'సాక్షి ఎఫెక్ట్'.. వారి కష్టాలకు విముక్తి

'సాక్షి ఎఫెక్ట్'.. వారి కష్టాలకు విముక్తి - Sakshi


గొల్లపల్లి : కరీంనగర్ జిల్లా గొల్లపల్లి మండలంలోని గుంజపడుగు గ్రామంలో బుడిగజంగాల కాలనీ వాసులు, గ్రామస్తులకు ఫ్లోరైడ్ రహిత మంచి నీటిని అందించి జగిత్యాల పట్టణానికి చెందిన పిల్లల వైద్యులు ఎల్లాల శ్రీనివాస్‌రెడ్డి విముక్తి కల్గించారు. గ్రామంలో ఎన్నో ఏళ్లుగా ఫ్లోరైడ్ బాధలు ఎదుర్కొంటూ ఇబ్బందులు పడుతున్న వైనాన్ని సాక్షిలో గత ఫిబ్రవరి నెల 21న ‘కబలిస్తున్న ఫ్లోరైడ్ రక్కసి’ శీర్షికన ప్రత్యేక కథనం ప్రచురితమైంది. ఏన్నో ఏళ్లుగా ఫ్లోరైడ్ బారిన పడి చనిపోయిన వారు వికలాంగులైన వారి ధీనగాథను సాక్షి వెలుగులోకి తీసుకువచ్చింది. అధికారులు, ప్రజా ప్రతినిధులు కనీసం ఫ్లోరైడ్ రహిత తాగునీటిని అందించలేక పోయారు.



సాక్షిలో వచ్చిన కథనాన్ని చదివిన జగిత్యాలకు చెందిన పిల్లల వైద్యుడు డాక్టర్ ఎల్లాల శ్రీనివాస్‌రెడ్డి స్పందించారు. గ్రామనికి చేరుకుని అక్కడి పరిస్థితులను చూసి వాటర్‌ప్లాంట్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఆయన వరంగల్ డయాసిస్ సేవ సంస్థకు పరిస్థితి వివరించి సమాచారం చేరవేశారు. ఆర్థిక సహాయం అందిస్తాం అక్కడ వాటర్‌ప్లాంట్ ఏర్పాటు చేయాలని కోరడంతో గ్రామంలోని ప్రజాప్రతినిధులు, గ్రామస్తులతో చర్చించి వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. షెడ్డు, బోర్‌వెల్ కాలనీకి చెందిన పస్తం కనుకయ్య అందించగా వైద్యులు శ్రీనివాస్‌రెడ్డి ప్లాంట్ ఏర్పాటుకు తన ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ మేరకు ఫాతిమానగర్ ఆడోరేషన్ సొసైటీ వారు ఆర్థిక సహాయం డాక్టర్ శ్రీనివాస్‌రెడ్డి ఆర్థిక సహాయం ప్రజల దాహర్తిని తీర్చాయి. శుక్రవారం బుడిగజంగాల కాలనీలో వాటర్‌ప్లాంట్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎల్లాల శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడారు.



వాటర్‌ప్లాంట్ ఏర్పాటు చేయడం పని పూర్తయింది కానీ దానిని ప్రజలందరు సద్వినియోగం చేసుకుంటేనే సంతృప్తికరమన్నారు. సురక్షిత నీటి వల్ల ఉపయోగాలు, సురక్షితం లేని నీటి వల్ల కలిగే వాటి గురించి వివరించారు. మౌళిక వసతుల ఏర్పాటకు కృషి చేస్తానన్నారు. మౌళిక వసతులు ఏవైనా తన దృష్టికి తీసుకురావాలని ప్రజలను కోరడంతో పలు సమస్యలను దృష్టికి తీసుకురాగా అక్కడే ఉన్న ప్రజాప్రతినిధులకు వివరించి అందరి భాగస్వామ్యంతో పరిష్కరిస్తామన్నారు. మూడు నెలల్లోగా సమస్యలను పరిష్కరిస్తామన్నారు. అందరి భాగస్వామ్యం ఉంటేనే గ్రామంలో అభివృద్ధి జరుగుతుందన్నారు. సురక్షిత నీటిని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకుని ఆనందంగా జీవించాలన్నారు. ఎంపీపీ కాంపెల్లి సత్తవ్వ హన్మండ్లు మాట్లాడుతూ, వాటర్‌ప్లాంట్ ఏర్పాటుకు కృషి చేసిన వైద్యులు ఎల్లాల శ్రీనివాస్‌రెడ్డి, సమస్యను వెలుగులోకి తీసుకువచ్చిన సాక్షికి కృతజ్ఞతలు తెలిపారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top