రాజీనామా చేసి ఎన్నికలకు సిద్ధమేనా..?

రాజీనామా చేసి ఎన్నికలకు సిద్ధమేనా..? - Sakshi


ఎమ్మెల్యే డేవిడ్‌రాజుకు ఎమ్మెల్యే జంకె, కొండారెడ్డిల సవాల్

రాజంపల్లె (పెద్దారవీడు) : వైఎస్సార్ సీపీ గుర్తుపై గెలిచిన యర్రగొండపాలెం ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్‌రాజు వెంటనే తమ పదవికి రాజీనామా చేసి ఎన్నికలకు సిద్ధమేనా అంటూ మార్కాపురం ఎమ్మెల్యే జంకే వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేపీ కొండారెడ్డిలు సవాల్ విసిరారు. శనివారం రాత్రి గొడ్రాలికొండ తిరుమలనాథ స్వామి బ్రహోత్సవాల సందర్భంగా వైఎస్సార్ సీపీ తరఫున మండల నాయకులు, కార్యకర్తలు విద్యుత్ ప్రభ ఏర్పాటు చేశారు.



ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లాలో ఫ్యాన్ గుర్తుపై గెలిచిన ఎమ్యెల్యేలు, ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు టీడీపీలో చేరడానికి డబ్బుల కోసమా, స్వప్రయోజనాల కోసమా, అధికారం ఉందని సంపాదన కోసమా అని ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత వారిపై ఉందన్నారు.  ఈ రోజు వైఎస్సార్‌సీపీకి ద్రోహం చేసిన నాయకులు రేపు టీడీపీకి ద్రోహం చేయరని గ్యారంటీ ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి రాష్ట్రాన్ని పరిపాలించినంత కాలం వర్షాలు సకాలంలో కురవడంతో చెరువులు, కుంటలు నిండి రైతులు పాడి పంటలతో సుభిక్షంగా ఉండి ఆనందంలో మునిగి తేలారన్నారు.



ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పరిపాలనలో గతంలో తొమ్మిదేళ్లు, ప్రస్తుతం పాలనలో వర్షాలు లేక గ్రామాల్లో సాగు నీరే కాకుండా తాగునీటికి ప్రజలు అల్లాడుతున్నారన్నారు. పూలసుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టును ప్రారంభించి డ్యామ్‌లు, కాలువలకు, సొరంగాలకు కొన్ని కోట్లు నిధులు విడుదల చేసి, పనులు వేగవంతం చేసిన ఘనత  వైఎస్సార్‌కు దక్కిందన్నారు. వైఎస్సార్ చేపట్టిన పథకాలు అమలు కావాలంటే వైఎస్ జగన్‌ను 2019లో ముఖ్యమంత్రిగా చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని పిలుపునిచ్చారు.



కార్యక్రమానికి స్థానిక జెడ్పీటీసీ సభ్యులు దుగ్గెంపూడి వెంకటరెడ్డి అధ్యక్షత వహించారు. పెద్దదోరా్నాల జెడ్పీటీసీ సభ్యులు అమిరెడ్డి రామిరెడ్డి మాట్లాడారు. పెద్దాయనా- పెద్దాయనా, అశ్వద్ధమాకు ఎదురేలేదు-జగనన్నకు తిరుగేలేదనే పాటలు గాయాకులు పాడుతుంటే ఈలలు వేస్తూ, కేరింతలు కొడుతూ కార్యకర్తలు, యువకులు, అభిమానులు అనందోత్సవంలో మునిగి లేలారు. అనంతరం జంకే, కేపీలను నాయకులు, కార్యకర్తలు పూలమాలతో సన్మానించారు.  



మాజీ ఎంపీటీసీ సభ్యుడు ఏర్వ చలమారెడ్డి, మాజీ సర్పంచ్ డి.వెంకటరెడ్డి, మహిళ నాయకురాలు కె.ప్రమీలారెడ్డి, మండల యూత్ కన్వీనర్ షేక్ బుజ్జీ, మండల నాయకులు ఎలూరి వెంకటనారాయణరెడ్డి, డి.వెంకటనారాయణరెడ్డి, పి.క్రిష్ణరెడ్డి, ఎం.శ్రీనివాసరెడ్డి, కె.వెంకటరెడ్డి, తిమ్మరాజు, జి.రమణారెడ్డి, పి.శ్రీనివాసరెడ్డి, కె.శివారె డ్డి, రఘునాథరెడ్డి, రామక్రిష్ణరెడ్డి, వి.ఈశ్వరరెడ్డి, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top