అక్రమ సంపాదన వద్దు

అక్రమ సంపాదన వద్దు


శాఖాపరమైన చర్యలు తప్పవు

ఐజీ స్టీఫెన్‌ రవీంద్ర హెచ్చరిక

 సీసీటీఎన్‌ఎస్‌     పనితీరుపై ప్రశంస




నిజామాబాద్‌ క్రైం (నిజామాబాద్‌అర్బన్‌): జిల్లా పోలీస్‌ శాఖలో పనిచేసే సిబ్బంది అక్రమ సంపాదనకు పాల్పడితే ఎంతటి అధికారైనా శాఖాపరమైన చర్యలు తప్పవని హైదరాబాద్‌ రీజియన్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ స్టీఫెన్‌ రవీంద్ర అన్నారు. ఐజీగా బాధ్యతలు స్వీకరించాక సోమవారం తొలిసారిగా జిల్లా కేంద్రానికి వచ్చిన ఆయనకు పోలీస్‌ గెస్ట్‌హౌస్‌లో నిజామాబాద్‌ రేంజ్‌ డీఐజీ ఎన్‌ శివశంకర్‌రెడ్డి, పోలీస్‌ కమిషనర్‌ కార్తికేయ పుష్పగుచ్ఛాలు ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయం సమావేశం హాలులో నిజామాబాద్, బోధన్, ఆర్మూర్‌ ఏసీపీలు, సీఐలు, ఎస్సైలు, అధికారులతో ఐజీ సమావేశమయ్యారు.



ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీతి, నిజాయితీకి మారు పేరైన పోలీస్‌శాఖలో సిబ్బంది ఎవరూ అక్రమ సంపాదనలకు పాల్పడవద్దని, అలాంటి విషయాలు మా దృష్టికి వస్తే క్రమ శిక్షణ  లేదా తీవ్రమైన చర్య ఉంటుందన్నారు. జిల్లాలోని సాలురా చెక్‌పోస్టు తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులో ఉన్నందున నిజామాబాద్, నాందేడ్‌ జిల్లాల్లో అన్ని ప్రభుత్వ శాఖలతో మంచి సంబంధాలు పెట్టుకుని, పెట్రోలింగ్, నిఘా వ్యవస్థ పటిష్టపర్చాలన్నారు. జిల్లాలో షీ టీంలు బాగా పనిచేసి, మహిళలకు భద్రత చేకూర్చాలని, కౌన్సెలింగ్‌ వ్యవస్థను పటిష్ట పర్చాలని సూచించారు. ఈవ్‌ టీజింగ్‌ వ్యవస్థను కళాశాలలో రూపుమాపాలని, జనరద్దీగల ప్రాంతాలలో నిఘా వ్యవస్థను మరింత పెంచాలన్నారు. మతపరమైన విషయాలలో ఏ వర్గం వారిని నమ్మవద్దని, కీలక సమయంలో తగిన చర్యలు తీసుకోవాలన్నారు. అవాంఛనీయ ఘటనలు తలెత్తనీయవద్దని, శాంతి కమిటీ సమావేశాలు నిర్వహించాలన్నారు. జనరద్దీ ప్రాంతాలు, ప్రధాన కూడళ్ల వద్ద, వాణిజ్య వ్యాపార సముదాయాల వద్ద సీసీ కెమోరాలు ఏర్పాటు చేయాలన్నారు. వీఐపీ, ఎస్కార్ట్‌ బందోబస్తుకు గట్టి చర్యలు తీసుకోవాలన్నారు. ఎప్పటికప్పుడు బందోబస్తులో మార్పులకు అనుగుణంగా విధులు నిర్వహించాలన్నారు. పోలీస్‌స్టేషన్లకు వచ్చే ఫిర్యాదులపై స్పందించాలన్నారు. ఫిర్యాదు దారుల సమస్యలను సత్వరంగా పరిష్కరించాలన్నారు. జిల్లాలో శాంతిభద్రతల విషయంలో ఎలాంటి అలసత్వం పనికిరాదని, సమస్యలు ఉన్నప్పుడు తమ పైస్థాయి అధికారులకు త్వరగా విషయాలను తెలుపాలన్నారు.



సీసీటీఎన్‌ఎస్‌ పనితీరుపై సంతృప్తి

జిల్లాలో క్రైం క్రిమినల్‌ ట్రాకింగ్‌ నెట్‌వర్క్‌ సిస్టం (సీసీటీఎన్‌ఎస్‌) వ్యవస్థ చక్కగా పనిచేస్తోందని ఐజీ స్టీఫెన్‌ రవీంద్ర పోలీసులకు కితాబునిచ్చారు. ఇలాగే పనిచేస్తూ రాష్ట్రంలో జిల్లాకు మంచిపేరు తీసుకురాడానికి కృషి చేయాలన్నారు. సమావేశం అనంతరం జిల్లాలో నేరాలకు సంబంధించి, పోలీస్‌శాఖ తీసుకుంటున్న చర్యలపై పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా ఐజీకి సీపీ కార్తికేయ వివరించారు. అనంతరం విధి నిర్వహణలో చక్కని ప్రతిభ కనబర్చిన 10 మంది సీఐలు, ఎస్సైలు, సిబ్బందికి ఐజీ  ప్రోత్సాహక సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. సమావేశంలో ఏసీపీలు ఆనంద్‌కుమార్, మోహన్, రవీందర్, సంజీవ్‌కుమార్, సయ్యద్‌ అన్వర్‌ హుస్సేన్, ఎస్‌బీ సీఐ వెంకన్న, సీఐలు, ఎస్‌హెచ్‌వోలు, ఎస్సైలు, ఆర్‌ఐలు పోలీస్‌ కార్యాలయం సూపరింటెండెంట్‌లు జనార్దన్, మక్సుద్‌ హైమద్, ఐటీకోర్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top