రోజుకు ఐదారు టెస్టులు రాయండి!

రోజుకు ఐదారు టెస్టులు రాయండి! - Sakshi

సాక్షి, హైదరాబాద్: ‘ఒక్కో డాక్టర్ రోజుకు ఐదారు టెస్టులు రాయాల్సిందే..’ నంటూ వైద్యాధికారులపై కలెక్టర్లు ఒత్తిడి తెస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రోగులకు అవసరం లేకపోయినా పరీక్షలు ఎలా రాసేదంటూ వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో రక్త పరీక్షల నిర్వహణ బాధ్యతను మెడాల్ అనే ప్రైవేటు సంస్థకు ఏపీ ప్రభుత్వం అప్పగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మెడాల్ సంస్థ.. డాక్టర్లతో వీలైనన్ని ఎక్కువ పరీక్షలకు సిఫారసు చేయించుకోవడం లేదా అసలు పరీక్షలే చేయకున్నా చేసినట్టుగా బిల్లులు పెట్టుకోవడం వంటి చర్యలకు పాల్పడుతోందనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఇటీవల గోదావరి జిల్లాలకు చెందిన ఓ కలెక్టర్... వైద్యాధికారులు, వైద్యులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

 

ఈ సందర్భంగా ఆయన ఎందుకు టెస్టులు రాయడం లేదంటూ కొందరు అధికారులు, వైద్యులపై సీరియస్ అయినట్లు సమాచారం. ‘ఇది మన ప్రభుత్వం, ఈ ప్రాజెక్టును భారీగా సక్సెస్ చేయాలి. రోగులకు టెస్టులు ఎవరైనా రాయకపోతే నాకు చెప్పండి..’ అంటూ జిల్లా వైద్యాధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. దీంతో సమావేశంలో పాల్గొన్న వైద్యులు, డిప్యూటీ డీఎంహెచ్‌ఓలు, డీఎంహెచ్‌ఓ, సివిల్ అసిస్టెంట్ సర్జన్‌లు నివ్వెర పోయారు. రోగికి అవసరమనుకుంటే టెస్టులు రాస్తాం కానీ, అవసరం లేకపోతే ఎలా రాస్తామని పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఓ వైద్యుడు వాపోయారు. రోజుకు 8 వేల రక్త నమూనాలు ఇస్తామని ప్రభుత్వం మెడాల్‌కు చెప్పిన నేపథ్యంలోనే.. ఆ సంస్థకు లబ్ధి చేకూర్చే బాధ్యతను ప్రభుత్వం కలెక్టర్లపై పెట్టిందని, ఆ మేరకు కలెక్టర్లు తమపై ఒత్తిడి తెస్తున్నారని వైద్యాధికారులు వాపోతున్నారు.

 

మరోవైపు పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రి  వైద్యుల వద్దకు మెడాల్ తమ ప్రతినిధులను పంపించి మీరు ఖాళీ ప్రిస్క్రిప్షన్‌లు ఇస్తే, తామే టెస్టులు రాసుకుంటామని, దీనికి ప్రతిఫలంగా దుబాయ్, సింగపూర్ వంటి దేశాలకు టూర్‌లు ఎరగా వేస్తోందని ప్రకాశం జిల్లాకు చెందిన ఓ వైద్యుడు తెలిపారు. ఇదిలా ఉండగా మెడాల్ సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా 81 రక్తపరీక్షల ల్యాబొరేటరీలు ఏర్పాటు చేయాల్సి ఉండగా ఇంతవరకు చేయలేదు. పైగా ప్రైవేటు డయాగ్నిస్టిక్స్ కేంద్రాలకు ఫ్రాంచైజీల లెక్కన అమ్మేసుకున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ స్థాయిలో, ఉన్నతాధికారుల వద్ద ఉన్న పరపతి కారణంగానే మెడాల్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని వైద్యాధికారులు అంటున్నారు.
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top