ట్రంప్‌ మనసు మార్చవా..!

ట్రంప్‌ మనసు మార్చవా..! - Sakshi


► వీసాల దేవుడికి వేడుకోలు

► చిలుకూరు బాలాజీని కోరుకుంటున్న అమెరికాలో ఉన్నవారి బంధువులు

► ప్రదక్షణలు చేసి మొక్కుతున్న వైనం




మొయినాబాద్‌: వీసాల దేవుడా.. ట్రంప్‌ మనసు మార్చవా అంటూ చిలుకూరు బాలాజీకి భక్తులు మొరపెట్టుకుంటున్నారు. అమెరికాలో ఉన్న తమవారు క్షేమంగా ఉండాలని పూజలు నిర్వహిస్తున్నారు. అమెరికా వెళ్లినవారి కోసం వీసాల దేవుడు బాలాజీకి మొక్కుకుంటున్నారు. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత అక్కడ తీసుకున్న నిర్ణయాలు, భారతీయులపై జరుగుతున్న దాడులతో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అదే సమయంలో అమెరికాలో ఉన్నవారి క్షేమం పట్ల ఇక్కడున్న బంధువులు, కుటుంబ సభ్యుల్లో ఆందోళన పెరుగుతోంది.


బాలాజీ కృపతో వీసాలు పొంది అమెరికా వెళ్లినవారిని ఆ బాలాజీనే కాపాడాలని.. ట్రంప్‌ మనసు మారాలని నిత్యం భక్తులు చిలుకూరు బాలాజీ దేవాలయంలో భక్తులు పూజలు నిర్వహిస్తున్నారు.భక్తుల కోర్కెలు తీర్చే ఇలవేల్పు చిలుకూరు బాలాజీకి వీసాల దేవుడిగా పేరొచ్చింది. వీసాలకోసం దరఖాస్తు చేసుకున్నవారు ప్రతిరోజు వందల మంది బాలాజీని దర్శించుకుంటారు. 20 ఏళ్లుగా చిలుకూరు బాలాజీ ఆశీస్సులతో ఎంతోమంది వీసాలు పొంది విదేశాలకు వెళ్లారు. అయితే ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తీసుకుంటున్న నిర్ణయాలు, వ్యవహరిస్తున్న తీరు, అక్కడ మనవారిపై జరుగుతున్న దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. దీంతో అమెరికాలో నివాసం ఉంటున్న వారి బంధువులు, కుటుంబ సభ్యులు నిత్యం బాలాజీ దేవాలయానికి వచ్చి పూజలు చేస్తున్నారు.



ట్రంప్‌ శాశ్వతం కాదు.. బాలాజీనే శాశ్వతం: ఆలయ అర్చకులు రంగరాజన్

భక్తుల కోర్కెలు తీర్చే చిలుకూరు బాలాజీ ఎప్పుడూ తన భక్తులకు అన్యాయం చేయరని చిలుకూరు బాలాజీ దేవాలయం అర్చకులు రంగరాజన్  భక్తులకు వివరిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ శాశ్వతం కాదని.. చిలుకూరు బాలాజీనే శాశ్వతమని చెబుతున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తీసుకుంటున్న నిర్ణయాలు, అక్కడ మనవారిపై జరుగుతున్న దాడులతో చాలామంది భయపడుతున్నారని.. బాలాజీ దేవాలయానికి వచ్చి ప్రదక్షణలు చేసి పూజలు నిర్వహిస్తున్నారన్నారు.


ఇప్పుడు వీసాలు రావడం ఆగలేదని.. వీసాలు పొందినవారు అమెరికాకు వెళ్తూనే ఉన్నారని చెప్పారు. అమెరికాలో ఉన్నవారి కోసం ఆందోళన చెందుతున్నవారు బాలాజీ సన్నిధికి వచ్చి ట్రంపు మనసు మార్చి మంచి నిర్ణయాలు తీసుకునేలా చూడాలని బాలాజీని కోరుకుంటున్నారన్నారు. భక్తుల కోర్కెలు తీర్చే బాలాజీ ఈ కోర్కెను కూడా తీరుస్తారని.. అందరికీ మంచి జరుగుతుందని తెలిపారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top