పల్లెకు పర్యాటకశోభ

పల్లెకు పర్యాటకశోభ - Sakshi


నారావారిపల్లి(తిరుపతి రూరల్‌): రాష్ట్రంలో విలేజ్, వ్యవసాయ పర్యాట కాన్ని అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని స్వగ్రామం నారావారిపల్లెకు వచ్చిన ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. çసంప్రదాయ టూరి జంనే కాకుండా గ్రామస్థాయిలో పర్యాటకం పెరగాల్సిన అవసరం ఉందన్నారు. పట్టణవాసులు సెలవుల్లో పల్లె వాతావరణంలో సేదతీరేలా అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. త్వరలోనే గాలేరు–నగరి రెండోదశ పనులను ప్రారంభిస్తామన్నారు. గాలేరు–నగరి నీటిని కల్యాణి డ్యామ్‌కు తప్ప క తీసుకువస్తామన్నారు. వైకుంఠమాల పేరుతో బాలాజీ రిజర్వాయర్‌– మల్లిమడుగు–కృష్ణాపురం రిజర్వాయర్లను అనుసంధానం చేసి సిటీ ఆఫ్‌ ట్యాంక్స్‌గా జిల్లాను అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. ప్రతి ఇంటికి  ప్రతి నెలారూ.10 నుంచి రూ.15 వేల వరకు ఆదాయం వచ్చేలా కార్యచరణ రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. అందులో భాగంగా గ్రామాల్లో పశువులకు హాస్టల్స్, గ్రామాల్లోనే గార్మెంట్‌ ఫ్యాక్టరీలను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రయోగాత్మకంగా నారావారిపల్లెలోనే వీటిని ప్రారంభిస్తామని ఆ దిశగా పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించినట్లు సీఎం తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడా నగదు కొరత లేదన్నారు. అన్ని సంక్షేమ పథకాలకు ఆధార్‌ అనుసంధానం చేయడం వల్ల అవినీతి, దుర్వినియోగం తగ్గినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా నాల్గవ విడత జన్మభూమి–మాఊరు కార్యక్రమం బుక్‌లెట్‌ను ఆయన ఆవిష్కరించారు.



నాలుగు గంటలు ఆలస్యంగా కార్యక్రమాలు

సీఎం సమయపాలన పాటించకపోవడంవల్ల ఆదివారం ఆయ న కార్యక్రమాలు నాలుగు గంటలు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. స్థానిక పీహెచ్‌సీని 30పడకల ఆసుపత్రిగా మార్చేం దుకు నిర్వహించాల్సిన  శంకుస్థాపన  ఉదయం 8 గంటలకు ప్రారంభం కావాల్సింది. అయితే సీఎం ఆలస్యంగా రావడంతో మధ్యాహ్నం 12గంటలకు జరిగింది.  ప్రోటోకాల్‌ ప్రకారం ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉదయం 7.50 గంటలకే వచ్చిన స్థానిక ఎమ్మెల్యే డాక్టర్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అక్కడే నాలుగు గంటలపాటు నిరీక్షించారు. ముఖ్యమంత్రికి తమ సమస్యలపై అర్జీలు ఇచ్చేందుకు జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చిన ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఆలస్యంగా వచ్చిన సీఎం అందరి నుంచి అర్జీలు తీసుకోకుండానే వెనుదిరిగారు. దీంతో  అర్జీదారులు అసహనం వ్యక్తం చేశారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top