డీఈఓ కార్యాలయ ముట్టడి ఉద్రిక్తం

డీఈఓ కార్యాలయ ముట్టడి ఉద్రిక్తం

– భారీగా తరలివచ్చిన ఉపాధ్యాయులు

– మంత్రి గంటా రాజీనామా చేయాలని డిమాండ్‌

– కార్యాలయాన్ని తెరవనియ్యకుండా అడ్డగింత

– సీఎం తీరుపై అగ్రహం వ్యక్తం చేసిన టీచర్లు

 

కర్నూలు సిటీ: బదిలీల్లో అశాస్త్రీయ పద్ధతులను నిరసిస్తూ ఫ్యాప్టో–జాక్టోల ఆధ్వర్యంలో బుధవారం ఉపాధ్యాయులు.. డీఈఓ కార్యాలయాన్ని ముట్టడించారు. ఉపాధ్యాయ సంఘాలన్నీ ఏకతాటిపైకి వచ్చి ఆందోళనకు దిగడంతో డీఈఓ కార్యాలయ ప్రాంగణం ఉద్రిక్తంగా మారింది. కొంత మంది ఉపాధ్యాయులు తమ ఆవేదనను పాటల రూపంలో వినిపించారు. పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు మాట్లాడుతూ..విద్యాశాఖ తీసుకుంటున్న నిర్ణయాలు సరిగా లేవన్నారు. బదిలీలు, హేతుబద్ధీకరణపై చర్చలకు పిలిచి.. మంత్రి గంటా శ్రీనివాసరావు ఉపాధ్యాయ సంఘాల నాయకులను అవమానపరిచారన్నారు. వేసవిలో బదిలీలు పూర్తి చేస్తామని చెప్పి స్కూళ్లు పునఃప్రారంభమవుతున్న సమయంలో షెడ్యూల్‌ ఇవ్వడంలో ఆంతర్యం అర్థం కావడం లేదన్నారు. వెబ్‌ కౌన్సెలింగ్, పని ఆధారిత పాయింట్లు పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. స్పందిచకుంటే ఈ నెల23న చలో అమరావతి కార్యక్రమాన్ని చేపడతామన్నారు. సమస్యలు పరిష్కరించలేని..మంత్రి గంటా రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు డీఈఓ కార్యాలయానికి తాళం వేసి ఆందోళన జరిపారు.  

 

సీఎం దృష్టికి సమస్య...

ఉపాధ్యాయుల బదిలీల్లో అశాస్త్రీయమైన విధానాలను మార్చాలని జిల్లాకు వచ్చిన సీఎం చంద్రబాబు నాయుడుకు తంగడంచెలో ఉపాధ్యాయ సంఘాలు వినతి పత్రం ఇచ్చారు. అయితే సీఎం సానూకూలంగా స్పందించక పోవడంతో ఉపాధ్యాయ వర్గాలు తీవ్ర అగ్రహం వ్యక్తం చేశాయి. టీచర్ల ఆందోళనకు పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి సంఘీభావం తెలిపి ప్రసంగించారు. ఫ్యాప్టో, జాక్టో జిల్లా కన్వీనర్లు సురేష్‌కుమార్, వి.కరుణానిధిమూర్తి, ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సన్మూర్తి, జిల్లా ప్రధాన కార్యదర్శి హెచ్‌.తిమ్మన్న, ఏపీటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.హృదయ రాజు, జిల్లా అద్యక్షులు ఇస్మాయిల్, కమలాకర్, మరియానందం, ఏపీటీఎఫ్‌(257)జిల్లా అధ్యక్షుడు మాణిక్యంరాజు, డీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు కె.కృష్ణ, యూటీఎఫ్‌ గౌరవ అధ్యక్షుడు నరసింహూలు, జిల్లా కార్యదర్శి రామశేషయ్య, నాగమణి, ఎస్సీ,ఎస్టీ ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షులు సుబ్బరాయుడు, ప్రసాద్, పీఆర్‌టీయూ నాయకులు భార్గవరామయ్య, అపాస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సత్యనారాయణ, జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top