డెంగీ పంజా

డెంగీ పంజా

తాజాగా కాకినాడ రూరల్‌లో ఐదుగురు బాధితులు

తుని మండలంలో కూడా పలువురికి అవే లక్షణాలు

జిల్లాలో 24 కేసులు నమోదైనట్టు వైద్యాధికారుల వెల్లడి

 

 

 

పారిశుద్ధ్య లోపం.. ఎక్కడికక్కడ మురుగునీరు నిలిచిపోవడం.. దోమల స్వైర విహారంతో.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో డెంగీ పంజా విసురుతోంది. ఇటీవలి కాలంలో జిల్లావ్యాప్తంగా 24 డెంగీ కేసులు నమోదైనట్టు వైద్యాధికారులు చెబుతున్నారు. తాజాగా కాకినాడ రూరల్, తుని మండలాల్లో పలువురు ఇవే లక్షణాలతో ఆస్పత్రుల పాలయ్యారు.  పలువురికి రక్తంలో ప్లేట్‌లెట్స్‌ కౌంట్‌ పడిపోవడంతో వీటిని డెంగీ జ్వరాలుగా ప్రైవేటు వైద్యులు నిర్ధారిస్తున్నారు. 

 

కాకినాడ రూరల్‌ :

జిల్లాలోని పలు ప్రాంతాల్లో డెంగీ పంజా విసురుతోంది. పారిశుద్ధ్యం లోపించడం, దోమలు పెరిగిపోవడంతో జ్వరాలు ప్రబలుతున్నాయి. కాకినాడ రూరల్‌ మండలంలోని ఇంద్రపాలెం, వాకలపూడి గ్రామాల్లో 15 మందికి పైగా వ్యక్తులు విషజ్వరాల బారిన పడ్డారు. రక్తంలో ప్లేట్‌లెట్స్‌ కౌంట్‌ తగ్గిపోవడంతో వారం రోజులుగా వారు ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ లక్షణాలు గమనించిన ఆయా ఆస్పత్రుల వైద్యులు దీనిని డెంగీగా నిర్ధారిస్తున్నారు. వాకలపూడిలో తర్ల విజయలక్ష్మి రెండు రోజులుగా డెంగీ బారిన పడి కాకినాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఇంద్రపాలేనికి చెందిన పాలిక కౌసల్య, గీసాల ఆనంద్, కాద జయంత్, కాద శ్రీనివాస్‌లు కూడా ఇవే లక్షణాలతో ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరికి కూడా ప్లేట్‌లెట్స్‌ కౌంట్‌ పడిపోయింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఏఎన్‌ఎంలు మంగళవారం హడావుడిగా ఇంద్రపాలెం, వాకలపూడిల్లో బాధితుల రక్తనమూనాలు సేకరించారు. కాగా, ప్లేట్‌లెట్స్‌కు ఒక్కసారిగా డిమాండ్‌ పెరగడంతో కాకినాడలోని పలు బ్లడ్‌బ్యాంకుల్లో వీటికి కొరత ఏర్పడినట్టు తెలుస్తోంది.

ఇవీ లక్షణాలు

జ్వరం సోకినవారు నీరసించిపోతున్నారు. తల తిప్పటం, వాంతులతో బాధపడుతున్నారు. 103–104 డిగ్రీల ఫారన్‌హీట్‌ వరకూ జ్వరం నమోదై, కొద్దిసేపటిలో తగ్గిపోతోందని బాధితుల కుటుంబ సభ్యులు చెబుతున్నారు. రోగి ప్రమాదకర స్థితికి చేరుతూండడంతో భయాందోళనతో ప్రైవేటు ఆస్పత్రులకు తరలిస్తున్నారు.

వైరల్‌ జ్వరాలేనా..!

సాధారణంగా జూలై నుంచి సెప్టెంబర్‌ వరకూ ఈ తరహా జ్వరాలు వస్తూంటాయని, ఇవి వైరల్‌ జ్వరాలు అయి ఉండవచ్చని ప్రభుత్వ వైద్యులు అంటున్నారు. వాతావరణ మార్పుల కారణంగా సోకే ఈ జ్వరాలు ప్రాణాంతకం కాకపోయినా రోగి పూర్తిగా నీరసించిపోతాడని, ఒక్కోసారి ప్లేట్‌లెట్ల సంఖ్య పడిపోతుంటుందని చెబుతున్నారు. అది ఒక్కోసారి ప్రాణాంతకం కావచ్చని చెబుతున్నారు. అయితే ప్రజలను భయపెట్టేలా ప్రైవేటు వైద్యులు డెంగీ జ్వరాలంటున్నా.. అది నిజం కాదని, ప్రభుత్వాస్పత్రుల ల్యాబ్‌ల్లో పరీక్షించిన తరువాతే ఈ జ్వరాలు ఏమిటనే నిర్ధారణ జరుగుతుందని వారంటున్నారు.

డెంగీ లక్షణాలతో గ్రామాల్లో బెంబేలు

తుని రూరల్‌ : మండలంలోని వివిధ గ్రామాల్లో అనేకమంది డెంగీ లక్షణాలతో బాధ పడుతున్నారు. తేటగుంట, ఎస్‌.అన్నవరం, డి.పోలవరం, దొండవాక, వి.కొత్తూరు, హంసవరం గ్రామాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. మూడు, నాలుగు రోజులకు జ్వరం తగ్గకపోవడంతో వైద్యులు వారికి రక్త పరీక్షలు చేయిస్తున్నారు. ప్లేట్‌లెట్ల కౌంట్‌ తగ్గినట్టు తేలడంతో డెంగీ లక్షణాలు ఉన్నాయంటూ కాకినాడ, విశాఖపట్నంలోని ఆస్పత్రులకు పంపిస్తున్నారు. ప్రతి గ్రామంలోనూ 20 నుంచి 25 కేసులు వస్తున్నాయి. ఎన్‌.సూరవరం పీహెచ్‌సీలో డాక్టర్‌ రాజశేఖర్‌ వైద్య సేవలందిస్తుండగా, తేటగుంటలో వైద్యులు అందుబాటులో లేరు. నర్సులే వైద్య సేవలు అందించాల్సి వస్తోంది.

 

జిల్లాలో 24 డెంగీ కేసులు

జిల్లాలో 24 డెంగీ కేసులు నమోదయ్యాయి. ఇంద్రపాలెం, వాకలపూడిల్లోని కేసుల వివరాలు నా దృష్టికి రాలేదు. ప్రజలకు విషజ్వరాలపై అవగాహన కల్పించేలా సిబ్బందిని అప్రమత్తం చేశాం. జ్వర పీడితులకు అవసరమైన మందులు పీహెచ్‌సీల్లో ఉంచాం. ప్రజలు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి డబ్బులు వృథా చేసుకుంటున్నారు. జ్వరంతో బాధపడేవారికి పూర్తి విశ్రాంతి అవసరం. జ్వర లక్షణాలు కనిపించిన వెంటనే ఐవీ ప్లూయిడ్స్‌ ఎక్కించాలి. ఫలితంగా శరీరం శక్తిని పుంజుకుంటుంది. సాధారణంగా పారాసిటమాల్‌ మాత్రలు ఇస్తాం. అప్పటికీ తగ్గకుంటే స్టెరాయిడ్స్‌ ఇవ్వాల్సి ఉంటుంది. ప్లేట్‌లెట్‌ కౌంట్‌ను పెంచేందుకు కొత్తగా మాత్రలు అందుబాటులోకి వచ్చాయి.

– డాక్టర్‌ చంద్రయ్య, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top