'పుస్తక పఠనం ప్రధానం'


  • మేధస్సు పెంపునకు దోహదం వెనుకబడిన వారి అభివృద్ధికి తోడ్పాటు

  • అందుకే జిల్లాలోని 125 గ్రామాల్లో ‘పుస్తక ప్రకాశం’ కేంద్రాలు ఏర్పాటు

  • ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో సీనియర్ ఐఏఎస్ అధికారి దాసరి శ్రీనివాసులు

  •  

    వెనుకబాటుతనాన్ని తరిమికొట్టి ప్రతిఒక్కరూ అభివృద్ధి సాధించేందుకు పుస్తక పఠనం ఎంతో దోహదపడుతుందని సీనియర్ ఐఏఎస్ అధికారి, పుస్తక ప్రకాశం కార్యక్రమ నిర్వాహకులు దాసరి శ్రీనివాసులు పేర్కొన్నారు. 19 సంవత్సరాల క్రితం జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన ఆయన.. అప్పటి నుంచి ఇప్పటికీ వెనుకబడే ఉన్న జిల్లా అభివృద్ధి కోసం ‘పుస్తక ప్రకాశం’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. జిల్లాతో తనకున్న అనుబంధం నేపథ్యంలో అభివృద్ధికి కృషి చేయూలనే ఉద్దేశంతో చేపట్టిన ‘పుస్తక ప్రకాశం’ కార్యక్రమంపై స్థానిక ఐటీసీ అతిథి గృహంలో బుధవారం ‘సాక్షి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు...

     

    సాక్షి : పుస్తక ప్రకాశం కార్యక్రమానికి ప్రకాశం జిల్లాను ఎంచుకోవడానికి గల కారణాలేంటి..?

    దాసరి : రెండున్నర సంవత్సరాలకుపైగా ఈ జిల్లాలో కలెక్టర్‌గా పనిచేశా. ఆ అనుభవం ఎన్నో అనుభూతులను మిగిల్చింది. 19 సంవత్సరాల క్రితం నేను పనిచేసిన సమయంలో జిల్లా ఎలా ఉందో.. ఇప్పటికీ అలాగే వెనుకబడి ఉంది. ఆ వెనుకబాటుతనాన్ని రూపుమాపాలంటే చదువుకున్న వారిలో చైతన్యాన్ని పెంపొందించాల్సిన అవసరం ఉందనిపించింది. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఎక్కువగా ఉన్నందున వెనుకబాటుతనం కూడా ఎక్కువగా ఉందని గుర్తించి పుస్తక పఠనం ద్వారా చైతన్యం తీసుకురావాలనే ఉద్దేశంతో ఎంపిక చేసుకున్నా.

     

    సాక్షి : చైతన్యం కోసం పుస్తక ప్రకాశం కార్యక్రమాన్నే ఎందుకు చేపట్టాలనుకున్నారు..?

     దాసరి : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 125వ జయంతిని పురస్కరించుకుని పుస్తక ప్రకాశం కార్యక్రమాన్ని నిర్వహించాలని తలచా. అందుకోసం తొలి విడతగా ప్రకాశం జిల్లాను ఎంపిక చేసుకున్నా. జిల్లాలోని వెనుకబడిన 125 గ్రామాలను ఎంపిక చేయాలని నిర్ణయించా. ఆయూ గ్రామాల్లో కొందరు అంబేడ్కర్ విగ్రహాలు ఏర్పాటు చేసి నిత్యం ఆయన జ్ఞాపకాలను గుర్తు చేస్తుంటే.. పుస్తక పఠనం ద్వారా ఆయన ఆశయాల సాధనతో పాటు మేధాశక్తిని పెంపొందించాలని సంకల్పించాను. తద్వారా అభివృద్ధి సాధించి వెనుకబాటుతనాన్ని తరిమికొట్టాలని ప్రయత్నిస్తున్నాం.

     

    సాక్షి : అక్షరాస్యతా శాతాన్ని ఏమైనా పెంపొందిస్తారా..?


    దాసరి : అక్షరాస్యతను పెంపొందించే కార్యక్రమాన్ని ప్రభుత్వం చూసుకుంటుంది. జిల్లాలో 63 శాతం మాత్రమే అక్షరాస్యత ఉంది. చదువుకున్న వారిలో పుస్తక పఠనాశక్తిని పెంపొందించడమే పుస్తక ప్రకాశం కార్యక్రమ ఉద్దేశం. తద్వారా మేధస్సు పెరిగి వారి తర్వాతి తరాల వారిని చదివించాలన్న ఆసక్తి కలిగిస్తాం. తద్వారా అక్షరాస్యత శాతం కూడా అభివృద్ధి చెందుతుంది.

     

    సాక్షి : పుస్తకాలు ఎలా సేకరిస్తారు..?

    దాసరి: ఆసక్తి కలిగిన ఎవరినుంచైనా పుస్తకాలు సేకరించడానికి పథకాన్ని సిద్ధం చేశాం. ఎలాంటి పుస్తకమైన అర్హమైనదిగా భావిస్తాం. అది పాఠకునికి ఎంతోకొంత ఉపయోగపడేదిగా ఉంటే చాలు. చిన్నారులు మొదలుకుని వయోవృద్ధుల వరకు ఎవరికి ఏ రకం పుస్తకాలు కావాలన్న దానిపై సర్వే చేస్తున్నాం. అన్ని రకాల పుస్తకాలు సేకరించి జిల్లాలో గుర్తించిన 125 గ్రామాల్లో పుస్తకపఠన కేంద్రాలు ఏర్పాటు చేసి అందరికీ అందుబాటులో ఉంచుతాం. పిల్లలకు కథలు చెప్పడం, వాటిలో నీతిని అర్థమయ్యేలా చేయడం ప్రధాన విధి. ఆ నీతిని జీవితానికి అన్వయించుకునే విధంగా తయారు చేయడమే మా ఉద్దేశం.

     

    సాక్షి : ఈ కార్యక్రమాన్ని ఎవరి ద్వారా ముందుకు తీసుకెళ్తారు..?

    దాసరి : స్వచ్ఛందంగా ముందుకు వచ్చే ఎవరినైనా పుస్తక ప్రకాశం కార్యక్రమాన్ని అమలుచేసేందుకు ఆహ్వానిస్తున్నాం. సమాజానికి ఎంతోకొంత సేవ చేయాలన్న దృక్పథం ఉన్నవారిని ఎంపికచేసి వారి ద్వారా కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. తద్వారా స్వచ్ఛంద కార్యకర్తలను ఏకీకృతం చేయడానికి కూడా ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుంది. స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు, మహిళా సంఘాలు, గ్రామైక్య సంఘాలు ఇలా అన్ని రకాల వారిని భాగస్వాములను చేస్తాం. అందుకోసం విస్తృత ప్రచారం చేపట్టాం. సేకరించిన పుస్తకాలను ఎంపిక చేసిన గ్రామాల్లో స్టడీ సెంటర్లుగా ఏర్పాటు చేసి పుస్తక పఠనం ద్వారా కలిగే లాభాలను అందరికీ వివరిస్తాం.

     

    సాక్షి: ప్రజలను ఏ విధంగా చైతన్యం చేస్తారు..?

    దాసరి : చదువుకోవడం ద్వారా సమాజానికి ఏ విధమైన మేలు జరుగుతుంది, తద్వారా వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా ఎలాంటి ప్రయోజనాలుంటాయి, పుస్తక పఠనం ఎలాంటి ప్రయోజనాలు చేకూరుస్తుందన్న అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తాం. అన్ని వర్గాల వారిని ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేస్తాం.


    సొంత లాభం కొంత మానుకుని పరుల కోసం ఏ విధంగా పాటుపడాలన్న విషయాన్ని విఫులీకరిస్తాం. గ్రామస్థాయి నుంచి నగరం వరకు ఈ కార్యక్రమాన్ని విస్తరించడానికి అన్నివర్గాల వారిని సమీకరించేందుకు ఉద్యుక్తులవుతున్నాం. అందుకోసం టోల్‌ఫ్రీ నంబర్‌ను కూడా అందుబాటులోకి తీసుకొస్తాం. జిల్లా అభివృద్ధికి ప్రతిఒక్కరూ తపనపడే విధంగా పుస్తక ప్రకాశం కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top