ఇదేనా బాబూ! ఆరోగ్యాంధ్రప్రదేశ్‌!!


  • ఏజెన్సీ మరణాల ప్రస్తావనే లేదు 

  • ప్రచార ఆర్భాటంగా ‘దోమలపై దండయాత్ర’ 

  • సీఎం సభ తీరుపై కన్నబాబు మండిపాటు  

  • కాకినాడ : 

    ఏజెన్సీ ప్రాంతంలో మరణాలు, అక్కడి ప్రజల ఆరోగ్య సమస్యలపై ఎటువంటి ప్రస్తావనా లేకుండా, ఆరోగ్యాంధ్రప్రదేశ్‌ పేరిట ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కాకినాడలో సభ నిర్వహించిన తీరు హాస్యాస్పదంగా ఉందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు అన్నారు. స్థానిక రమణయ్యపేటలోని తన నివాసంలో ఆదివారం రాత్రి ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘దోమలపై దండయాత్ర – ఆరోగ్యాంధ్రప్రదేశ్‌’ పేరిట ఏర్పాౖటెన సభలో చంద్రబాబు వ్యవహరించిన తీరును ఆయన తప్పు పట్టారు. జిల్లా ఏజెన్సీలో వ్యాధులతో గిరిజనులు మృతి చెందుతున్నారని, విలీన మండలాల్లో కాళ్లవాపులతో 10 మంది మరణించి, వందలాది మంది ఆసుపత్రి పాలయ్యారని, ఈ విషయాలు ముఖ్యమంత్రి దృష్టికి రాలేదా? అని ప్రశ్నించారు. రాజవొమ్మంగి ప్రాంతంలో పౌష్టికాహార లోపంతో 10 మంది చనిపోయారని, జిల్లాలో 4 వేల మలేరియా కేసులు నమోదయ్యాయని.. వీటిల్లో ఏ ఒక్క అంశాన్నీ సీఎం ఏమాత్రం ప్రస్తావించకపోవడం దారుణమని అన్నారు. ఏజెన్సీలో అనారోగ్య పరిస్థితులను చక్కదిద్దేందుకు చర్యలు తీసుకోవడంలో సీఎం ఘోరంగా విఫలమయ్యారని ఆయన దుయ్యబట్టారు.

     

    ఇదేం దండయాత్ర?

    దోమలపై దండయాత్ర పేరుతో డ్వాక్రా మహిళలు, విద్యార్థులతో ర్యాలీలు చేయించడం వల్ల ప్రయోజనం లేదని కన్నబాబు విమర్శించారు. ‘‘నిజంగా దోమలను నియంత్రించాలన్న చిత్తశుద్ధి ఉంటే జిల్లా కేంద్రంలో ఫాగింగ్‌ మెషీన్లు ఉన్నాయా? అవి పని చేస్తున్నాయా? ఏ షెడ్యూల్‌ ప్రకారం ఎక్కడ ఫాగింగ్‌ యంత్రాలు  పని చేశాయో చెప్పగలరా?’’ అని నిలదీశారు. నిల్వ నీటివద్ద లార్వాను చంపేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. చెత్త తొలగించడంలో ఘోరంగా విఫలమయ్యారని, కాకినాడ నగరానికి కనీసం డంపింగ్‌ యార్డును కూడా సమకూర్చలేకపోయారని ధ్వజమెత్తారు. కోనసీమ అభివృద్ధిపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై కూడా కన్నబాబు మండిపడ్డారు. ‘కోనసీమ రైతులు దాదాపు 50 వేల ఎకరాల్లో గతంలో పంట విరామం ప్రకటించిన విషయం చంద్రబాబుకు తెలియదా?’ అని ప్రశ్నించారు. జిల్లాకు సంబంధించిన ఇలాంటి ప్రధాన సమస్యలు, గిరిజన ప్రాంతాల ఇబ్బందుల గురించి కనీస ప్రస్తావన కూడా లేకుండా.. కేవలం ప్రచార ఆర్భాటంతో ముఖ్యమంత్రి వ్యవహరించారని విమర్శించారు.

     
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top