దళితుల కన్నెర్ర

దళితుల కన్నెర్ర - Sakshi

ఆదినారాయణరెడ్డి వ్యాఖ్యలపై సర్వత్రా నిరసన

రాస్తారోకోలు, ధర్నాలు

దిష్టిబొమ్మల దహనం

పలు పోలీసుస్టేషన్లలో ఫిర్యాదులు

సాక్షి ప్రతినిధి, ఏలూరు:

ఎస్సీల పట్ల అవమానకరంగా వ్యాఖ్యలు చేసిన మంత్రి అదినారాయణరెడ్డిపై దళితులు కన్నెర్ర చేశారు. ఆదినారాయణరెడ్డికి వ్యతిరేకంగా జిల్లా వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అయ్యాయి. దళితులు రోడ్డెక్కి ఆందోళనలు చేశారు. రాస్తారోకోలు, ధర్నాలు, వినతిపత్రాలు, పలు స్టేషన్లలో మంత్రికి వ్యతిరేకంగా ఫిర్యాదులతో జిల్లా వ్యాప్తంగా నిరసనలు హోరెత్తాయి. అత్తిలి, చింతలపూడి పోలీసు స్టేషన్లలో మంత్రి ఆదినారాయణరెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని ఫిర్యాదులు చేశారు. ఆచంటలో  మంత్రి ఆదినారాయణరెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. వైఎస్సార్‌సీపీ ఎస్‌సీసెల్‌ జిల్లా అధ్యక్షులు మానుకొండ ప్రదీప్‌ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దహనం కార్యక్రమం నిర్వహించారు. వివక్ష పూరిత వ్యాఖ్యలు చేసిన మంత్రి ఆదినారాయణరెడ్డిని తక్షణమే బర్తరఫ్‌ చేయాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ దళిత విభాగం ఆధ్వర్యంలో అత్తిలి బస్‌ స్టేషన్‌ సెంటర్‌లో ధర్నా చేసి మంత్రి దిష్టిబొమ్మ దహనం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షులు నల్లి రాజేష్‌ ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ విగ్రహానికి వినతిపత్రం అందించారు.  అచంటలో వైఎస్సార్‌సీపీ ఎస్‌సీసెల్‌ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దహనం కార్యక్రమం నిర్వహించారు. నిడదవోలు పట్టణంలో సంతమార్కెట్‌ వద్ద, అంబేడ్కర్‌ విగ్రహం వద్ద బుధవారం కేవీపీఎస్, చర్చిపేట యూత్‌ ఆధ్వర్యంలో దళితులు నిరసన వ్యక్తం చేసారు. రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. అనంతరం మంత్రి దిష్టి బొమ్మను చెప్పులతో కొట్టి, ఆగ్రహం వ్యక్తం చేస్తూ దిష్టి బొమ్మను దహనం చేసారు. అక్కడ నుంచి తహసిల్దారు కార్యాలయం వద్దకు వెళ్లి  కార్యాలయం ముందు అర్ధనగ్న ప్రదర్శన చేసారు. సమిశ్రగూడెంలో ఎమ్మార్పీఎస్‌ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. మంత్రి దిష్టిబొమ్మ దహనం ప్రయత్నాన్ని ఎస్‌ఐ అడ్డుకున్నారు. టి.నర్సాపురంలో బీఎస్పీ నాయకులు అంబేద్కర్‌ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. పోలవరంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. మంత్రిని వెంటనే మంత్రివర్గం నుంచి భర్తరఫ్‌ చేయాలని  వైఎస్సార్‌సీపీ ఎస్సీసెల్‌ డిమాండ్‌ చేసింది.  వెఎస్సార్‌సీపీ మహిళా నాయకురాలు, జిల్లా సర్పంచ్‌ల ఛాంబర్‌ ఉపాధ్యక్షురాలు దేవీ గంజిమాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. మంత్రి నోరు అదుపులో పెట్టుకోవాలని డిమాండ్‌ చేస్తూ దెందులూరు బస్టాండ్‌ సెంటర్‌లో దళితులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. కొవ్వలిలో నల్ల బ్యాడ్జీలతో నిరసన, మౌన ప్రదర్శన నిర్వహించారు.  ఏలూరులో ఫైర్‌స్టేషన్‌ సెంటరులో దళిత సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం  మంత్రి ఆదినారాయణ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. 

 

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top