దళిత సాహిత్యమే చైతన్యానికి నాంది

దళిత సాహిత్యమే చైతన్యానికి నాంది


విజయనగరం పూల్‌బాగ్‌: బడుగు, బలహీనవర్గాల ప్రజలు చైతన్యం కావాలంటే దళిత సాహిత్య ఉద్యమ ఒరవడిని చదవాలని, పూలే అంబేడ్కర్‌ భావజాలన్ని ప్రజలకు చేరువ చేయాలని భారత దళిత సాహిత్య అకాడమీ అధ్యక్షుడు నల్లా రాధాకృష్ణ పిలుపునిచ్చారు.బాలాజీ జంక్షన్‌లోని అంబేడ్కర్‌ భవనంలో బహుజన కవి, జాతీయ అంబేడ్కర్‌ అవార్డు గ్రహీత గంటాన అప్పారావుకి ఆత్మీయ సత్కారసభ ఆతవ ఉదయ భాస్కర్‌ అధ్యక్షతన నిర్వహించారు. సభలో రాధాకృష్ణ ముఖ్య అతిధిగా మాట్లాడుతూ బుద్ధుడి నుంచి కాన్షీరాం వరకు మహానీయుల చరిత్రను మరుగునపెట్టిన మనువాదులను ఎదుర్కోవాలంటే పూలే అంబేడ్కర్‌ భావజాలం ద్వారా అనివార్యమని చెప్పారు. లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ మాట్లాడుతూ గంటాన అప్పారావు కవిత్వంలో లోతైన భావన, పాలకులను ప్రశ్నించే తత్వం దోపిడీ రాజకీయ దొంగలను ఎగతాళి చేయడం కనిపిస్తాయని తెలిపారు. సీనియర్‌ దళిత నాయకులు రొంగలి పోతన్న మాట్లాడుతూ ఉత్తరాంధ్ర జిల్లాలో దళిత సాహిత్యం తక్కువగా వచ్చిందని గంటాన కవిత్వంతో ఆ లోటు తీరిందని తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ ఎస్సీ సెల్‌ ఛైర్మన్‌ పీరుబండి జైహింద్‌కుమార్, రొంగలి రామారావు, ఆర్‌బి రామానాయుడు, రామవరపు పైడిరాజు, బి.ఎ.రావు, బొంగభానుమూర్తి, నాగరాజు, దీపిల్లి అప్పారావు, గోకా రమేష్‌బాబు, ఎ వెంకటరావు , వివిధ సంఘాల ప్రతినిధులు గంటాన అప్పారావును ఘనంగా సన్మానించారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top