చంద్రబాబూ.. క్షమాపణ చెప్పు

చంద్రబాబూ.. క్షమాపణ చెప్పు - Sakshi


♦ ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై దళిత సంఘాల మండిపాటు

♦ రాష్ట్రవ్యాప్తంగా దిష్టిబొమ్మ దహనాలు, ధర్నాలు

♦ సీఎంపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఫిర్యాదులు

 

 సాక్షి, విజయవాడ బ్యూరో/ఏలూరు: ఎస్సీలుగా పుట్టాలని ఎవరూ కోరుకోరంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తాయి. ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని దళిత సంఘాల నాయకులు మంగళవారం పలు పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. వివిధ ప్రాంతాల్లో ధర్నాలు నిర్వహించారు. ముఖ్యమంత్రిదిష్టిబొమ్మలను దహనం చేశారు. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ విగ్రహాలకు పాలాభిషేకాలు చేశారు. సీఎం చంద్రబాబు వెంటనే క్షమాపణ చెప్పాలని పలువురు ఎమ్మెల్యేలు, నేతలు డిమాండ్ చేశారు.  కృష్ణా జిల్లా అవనిగడ్డ పోలీస్‌స్టేషన్‌లో ఎమ్మార్పీఎస్, మాల మహానాడు నాయకులు, వైఎస్సార్‌సీపీ ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు రాజేష్ వేర్వేరుగా చంద్రబాబుపై ఫిర్యాదు చేశారు. తిరువూరు పోలీస్‌స్టేషన్‌లో ఎమ్మార్పీఎస్ నాయకులు ఫిర్యాదు చేయగా, మైలవరంలో చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. మచిలీపట్నంలో దళిత సంఘాల ఐక్య కార్యాచరణ సమితి ధర్నా నిర్వహించింది.



 తహసీల్దార్‌కు వినతి పత్రం

 పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో వైఎస్సార్‌సీపీ ఎస్సీ విభాగం, టి.నరసాపురం మండలం మక్కినవారిగూడెంలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి దిష్టిబొమ్మలను దహనం చేశారు. బాబు వ్యాఖ్యలను నిరసిస్తూ పాలకొల్లులో దారా లక్ష్మీగణేష్ అనే యువకుడు శిరోముండనం చేయించుకున్నాడు. వైఎస్సార్‌సీపీ గోపాలపురం నియోజకవర్గ కన్వీనర్ తలారి వెంకట్రావు ఆధ్వర్యంలో నల్లజెర్ల మండలం పోతవరంలో ధర్నా చేయగా, నిడదవోలులో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఏపీ దళిత మహాసభ రాష్ట్ర కన్వీనర్ పిల్లి డేవిడ్‌కుమార్ ఆధ్వర్యంలో దళితులు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు.



చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్‌కు వినతిపత్రం ఇచ్చారు. వినతిపత్రం కాపీలను గవర్నర్ నరసింహన్ కార్యాలయానికి ఫ్యాక్స్ ద్వారా పంపారు. చంద్రబాబుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి ముప్పిడి విజయ్‌రావు, ఎమ్మార్పీఎస్ నేత ఆరుగొల్లు చినబాబు కొవ్వూరు రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆచంట పోలీస్ స్టేషన్‌లోనూ వైఎస్సార్‌సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర కార్యదర్శి, అంబేడ్కర్ యువసేన అధ్యక్షుడు సుంకర సీతారామ్ ఫిర్యాదుచేశారు. నరసాపురం అంబేడ్కర్ సెంటర్‌లో దళిత సంఘాల ఆధ్వర్యంలో చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు.  



 రాస్తారోకోలు, నిరసనల హోరు

 తూర్పు గోదావరి జిల్లా అన్నవరం మెయిన్‌రోడ్డులో వైఎస్సార్‌సీపీ, దళిత సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం సీఎంపై అన్నవరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ముమ్మడివరంలో దళితులు రాస్తారోకో నిర్వహించి, ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దహనం చేశారు. అల్లవరం పోలీసు స్టేషన్ ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు. చంద్రబాబు వ్యాఖ్యలపై రామచంద్రపురంలో వైఎస్సార్‌సీపీ ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు పెట్టా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. గుంటూరులో వైఎస్సార్‌సీపీ ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు బండారు సాయిబాబు ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ప్రకాశం జిల్లా టంగుటూరు పోలీస్‌స్టేషన్‌లో చంద్రబాబుపై దళిత నేతలు ఫిర్యాదు చేశారు. తిరుపతి ఎస్వీ వర్సిటీ క్యాంపస్ పోలీస్ స్టేషన్‌లో వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం ముఖ్యమంత్రిపై ఫిర్యాదు చేసింది. యూనివర్సిటీ గేటు వద్ద మాదిగి విద్యార్థి సమాఖ్య ప్లకార్డులతో నిరసన ప్రదర్శన నిర్వహించింది. కర్నూలు కలెక్టరేట్ ఎదుట కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు ఆనంద్‌బాబు నేతృత్వంలో ధర్నా చేపట్టారు.

 

 ఓయూలో చంద్రబాబు దిష్టిబొమ్మ దహనం

 హైదరాబాద్: ఎస్సీలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల ఎదుట మంగళవారం మాదిగ విద్యార్థి సమాఖ్య(ఎంఎస్‌ఎఫ్) నాయకులు, కార్యకర్తలు ఏపీ సీఎం చంద్రబాబు దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించి, దహనం చేశారు. ఎన్నికలకు ముందు పెద్ద మాదిగనవుతానని దళితుల ఓట్లు దండుకున్న చంద్రబాబు అధికారం చేట్టిన తర్వాత అహంకారంతో ఎస్సీలను కించపరిచేలా హేళనగా మాట్లాడడం సిగ్గుచేటని ఎంఎస్‌ఎఫ్ జాతీయ అధ్యక్షుడు రుద్రవరం లింగస్వామి మాదిగ ఆరోపించారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top